YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కొవిడ్ కాలర్ ట్యూన్ నుంచి విముక్తి

కొవిడ్ కాలర్ ట్యూన్  నుంచి విముక్తి

ముంబై, మార్చి 30,
ఫోన్ చేస్తే చాలు ఒక‌టే కాల‌ర్‌ట్యూన్‌. ఒక‌రోజు రెండురోజులో అంటే ఎవ‌రైనా భ‌రిస్తారు. కానీ, ఏళ్ల త‌ర‌బ‌డి అదే కాల‌ర్‌ట్యూన్ వినాలంటే ఎవ‌రైనా విసుగు చెందుతారు. క‌రోనా ఏ టైమ్‌లో వ‌చ్చిందోగానీ.. వైర‌స్ టార్చ‌ర్ కంటే ఫోన్లో ఆ కాల‌ర్‌ట్యూనే వినియోగ‌దారుల‌కు ఎక్కువ‌గా టార్చ‌ర్ చేసిందనే చెప్పాలి. జాగ్ర‌త్త‌గా ఉండాలంటూ సూచ‌న చేయ‌డం మంచిదే అయినా.. ఆ మంచి మ‌రీ శృతిమించింద‌నే విమ‌ర్శ ఉంది. రోజులు, వారాలు, నెల‌లు, ఏళ్ల త‌ర‌బ‌డి ఒక‌టే అరిగిపోయిన రికార్డు వినిపించి వినిపించీ జ‌నాల‌ను ఒక విధంగా వేధించార‌నే ఆరోప‌ణ కూడా ఉంది. మోదీ స‌ర్కారు ఆ కాల‌ర్ ట్యూన్ పెట్ట‌డం మిన‌హా కొవిడ్ నివార‌ణ‌కు ప్ర‌త్యేకంగా చేప‌ట్టిన చ‌ర్య‌లేవీ లేవ‌ని ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ విమ‌ర్శించ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. రెండేళ్లుగా భ‌రిస్తూ వ‌స్తున్న ఆ క‌రోనా కాల‌ర్‌ట్యూన్ బారి నుంచి ఇక‌పై విముక్తి ల‌భించ‌నుంది. నమస్కారం.. కొవిడ్‌-19 అన్‌లాక్‌ ప్రక్రియ ఇప్పుడు దేశమంతటా మొదలైంది. ఇలాంటి సమయంలో అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి వెళ్లకండి".. ఇలా ఎప్పుడు ఫోన్ చేసినా ఇదే కాల‌ర్‌ట్యూన్‌. అంత‌కుముందు, క‌రోనా వ‌చ్చిన కొత్త‌లో ఇంకోటి ఉండేది. "కరోనా వైర్‌స్‌తో ఇప్పుడు యావత్‌ దేశం పోరాడుతోంది. మనమంతా ఆ వ్యాధితో పోరాడాలి. రోగితో కాదు..." ఇది కొవిడ్‌ వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో మన ఫోన్లలో వినిపించిన కాలర్‌ట్యూన్‌. వ్యాక్సినేష‌న్ గురించి ఇంకోటి. అంతే. ఇలా రెండు మూడు ట్యూన్స్‌ మ‌న చెవుల్లో గింగిరాలు తిరిగేవి. నిద్ర‌లో కూడా అవే వినిపించేవి. క‌నీసం ఎప్ప‌టిక‌ప్పుడు ఆ మెసేజ్‌లు మార్చుదామ‌నే ఉద్దేశ్యం కూడా లేక‌పోయేది ప్ర‌భుత్వానికి. అలా ఓ మెసేజ్ రికార్డు చేయించి.. దాన్నే నెల‌ల త‌ర‌బ‌డి విసుగుపుట్టేలా వినిపించారు. ఆ మంచి మెసేజ్ కాస్తా.. వాళ్లు చేసిన ఓవ‌రాక్ష‌న్‌కి ఈ గోల ఏంట్రా బాబోయ్ అనిపించేలా చేసింది.
దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చిన ప్రస్తుత తరుణంలో కొవిడ్‌ కాలర్‌ ట్యూన్లకు ఇక స్వస్తి పలకాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈమేరకు టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత 21 నెలలుగా అంతా ఫోన్లలో వింటున్న కొవిడ్‌ కాలర్‌ ట్యూన్‌ ఇక బంద్ కానుంది. ఆ కాలర్‌ ట్యూన్ల లక్ష్యం నెరవేరింది.. ఇకనైనా తొలగించండి’’ అంటూ సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీవోఏ), మొబైల్‌ వినియోగదారుల నుంచి కేంద్ర టెలికాం విభాగానికి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి.ఎవరికైనా ఎమర్జెన్సీ కాల్స్‌ చేసుకునే క్రమంలో.. కొవిడ్‌ కాలర్‌ట్యూన్‌ వల్ల కాల్‌ కనెక్ట్‌ కావడానికి ఎక్కువ సమయం పడుతోంది. అంతేకాదు విలువైన సెల్యులార్‌ బ్యాండ్‌ విడ్త్‌ వినియోగం అవసరానికి మించి జరుగుతోంది. ఫలితంగా సాంకేతిక సమస్యలు తలెత్తి కాల్స్‌ కనెక్టివిటీకి పట్టే సగటు సమయం పెరుగుతోంది’’ అని పేర్కొంటూ టెలికాం విభాగానికి సీవోఏ లేఖ రాసింది. ఎంతోమంది మొబైల్‌ వినియోగదారులు కూడా ఈ అంశాన్ని ప‌దే ప‌దే లేవనెత్తారు. ఇలాంటి విజ్ఞ‌ప్తుల‌న్నిటినీ పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఆరోగ్యశాఖ ‘కొవిడ్‌ కాలర్‌ ట్యూన్‌’ను తొలగించాలని నిర్ణ‌యించింది. త్వ‌ర‌లోనే ఇక ఆ కాల‌ర్‌ట్యూన్ నుంచి విముక్తి ల‌భించ‌నుంది.

Related Posts