గోదావరి నదిలో లాంచీ ప్రమాద ఘటన తెలియగానే గుండె బరువెక్కింది. రోజువారీ అవసరాలకి ఇతర ప్రాంతాలకి వెళ్ళి తిరుగు ప్రయాణంలో ఉన్న గిరిజనులు జల సమాధి కావడం ఆందోళన కలిగించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 60 అడుగుల లోతున లాంచీ పడిపోయిందని తెలిశాక ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమైంది. మృతుల కుటుంబాలకి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ దుర్ఘటనకి సంబధించిన వివరాలు తెలియగానే బాధిత కుటుంబాలకి అండగా నిలిచి సహాయకార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని జనసేన కార్యకర్తలకి సూచించానని తెలిపారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం గిరిజనులకి శాపం కావద్దు. ఈ ఘటనలో సర్కార్ శాఖలు, ఉద్యోగుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రమాదానికి గురైన లాంచీకి అనుమతులు సక్రమంగా లేవంటే... లోపం ఎవరిది? జవాబుదారీతనం లేని పాలన విధానాలే అమాయకుల్ని జలసమాధి చేశాయి. దుర్ఘటన జరగగానే హడావిడి చేసే పాలకులు.. సమస్యలకి శాశ్వత పరిష్కారాలు చూపించాలని సూచించారు. ప్రజల వద్దకు పాలన ప్రకటనలకే పరిమితమా? నిత్యావసరాలకీ, వైద్యం కోసం, విద్య కోసం, ఏ చిన్న పని వున్నా నదిలోనే ప్రయాణాలు సాగిస్తూ గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ శాఖలు గిరిజన గూడేలపై శ్రద్ధ చూపడం లేదు. పోలవరం నిర్వాసితులు అధికారుల చుట్టూ తిరిగి వెళుతు ఈ ప్రమాదంలో చనిపోవడం దురదృష్టకరం. బాధిత కుటుంబాలకు తగిన పరిహారం ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.
పాలకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి గిరిజనులకి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, పాలన వారి గూడేలకి చేర్చాలి. నదుల్లో అనుమతులు లేని బోట్లు తిరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. కృష్ణా నదిలో బోటు ప్రమాద ఘటన మరువక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం బాధాకరమని అయన అన్నారు.