హైదరాబాద్, మార్చి 30,
ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఉత్తమ ప్రదర్శన చేసిన భారతీయ జనతా పార్టీ రాబోయే రెండేళ్లలో జరిగే వివిధ ఎన్నికలకు రెట్టించిన ఉత్సాహంతో సన్నద్ధమవుతోంది. ఒక దాని తరువాత ఒకటిగా నిరంతరం ఎన్నికల కోసం పనిచేయటం బీజేపీ ప్రత్యేకత. నిరంతరం గెలుపు వ్యూహాలకు పదును పెడుతూనే ఉంటుంది.ఉత్తరాదితో పాటు ఈశాన్య భారతంలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యత సాధించింది. కానీ దక్షిణాది విషయంలో ఆ పరిస్థితి లేదు. కర్ణాటక మినహా మిగతా నాలుగు రాష్ట్రాలో అధికారం దానికి అందని ద్రాక్ష అయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులో దానికి పెద్దగా ఉనికి లేదు. కానీ తెలంగాణలో అధికారంపై ఆశలు పెట్టుకుంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 20 శాతం ఓట్లు.. నాలుగు సీట్లు దక్కించుకోవటమే అధికారంపై ఆ పార్టీకి ఆశలు కలిగించిమరోవైపు అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి బీజేపీ కథ మారిపోతోంది. లోక్‌సభ ఎన్నికలను గెలిచినంత సులువుగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేకపోతోంది. సార్వత్రిక ఎన్నికలకు కేవలం కొన్ని నెలల ముందు జరిగిన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏడు శాతం ఓట్లతో కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచింది. దాంతో బీజేపీని టీఆర్‌ఎస్ పట్టించుకోవటం మానేసింది. కానీ 2019 లోక్‌సభ ఫలితాలు షాక్ ఇచ్చాయి. అయితే అది మోదీ ప్రభంజనం అని సరిపెట్టుకున్నా.. దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్‌ఎంసీలో బీజేపీ విజయాలను ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోలేకపోయింది.ఇక హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయ చిత్రాన్నే మార్చింది. బీజేపీ చేతిలో ఘోర పరాభవం టీఆర్‌ఎస్ శ్రేణులను డిఫెన్స్‌లో పడేసింది. అసెంబ్లీ ఎన్నికల వరకు అదే ఊపును కొనసాగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఆధిపత్య పోరులో కాంగ్రెస్‌ని వెనక్కి నెట్టి బీజేపీ ఒక అడుగు ముందుకు వేసింది. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను హ్యాట్రిక్ కొట్టకుండా నిలవరించటమే ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకుంది. ఆందుకోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకునేందుకు ఆ పార్టీ సిద్ధంగా లేదు. కేసీఆర్ ముందస్తుకు వెళ్లినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర బీజేపీ సిద్దమవుతోంది. అందుకు తగిన వ్యూహాలను ఇప్పటికే సిద్ధం చేసిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ముందుగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ సీట్లపై బీజేపీ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. తెలంగాణలో ఎస్సీకి 19, ఎస్టీకి 12 రిజర్డ్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ స్థానాలలో పార్టీ పునాదిని బలోపేతం చేయటం కోసం మిషన్ 19, మిషన్ 12 పేరుతో బీజేపీ రెండు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసింది. ఈ మిషన్‌లో విజయం అంత సులభం కాకపోవచ్చు.2018 ఎన్నికల్లో ఖమ్మం మినహా రిజర్వుడ్ సీట్లలో టీఆర్‌ఎస్ స్వీప్ చేసింది. మరోవైపు బీజేపీ ఒక్కటీ గెలువలేకపోయింది. ఈసారి కూడా దానిని రిపీట్ చేయాలని టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోంది. ఎస్టీలకు పోడు భూమి పట్టాలు, ఎస్సీలకు దళితబంధు పథకాలపై టీఆర్‌ఎస్ ఆశలు పెట్టుకుంది. అయితే, బీజేపీ కూడా తన దైన శైలిలో ఆ వర్గాలను ఆకట్టుకునే వ్యూహాలు సిద్దం చేసింది. మిషన్ 19 ఛైర్మన్‌గా మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డిని, మిషన్ 12 కోఆర్డినేషన్ సభ్యుడుగా మరో మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావును నియమించింది.జితేందర్ రెడ్డి గతంలో దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల ఇంచార్జ్ బాధ్యతలు చూశారు. ఈ రెండు చోట్లా టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య జరిగిన హోరాహోరీ పోరు పార్టీ విజయం సాధించింది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆయన ముషీరాబాద్ డివిజన్ ఇంచార్జ్‌గా ఉన్నారు. ముషీరాబాద్ పరిధిలోని ఆరు వార్డులకు గాను బీజేపీ ఐదు స్థానాలను కైవసం చేసుకుంది. ఈ ట్రాక్ రికార్డు చూసే మిషన్ 19 బాధ్యతలను జితేందర్ రెడ్డికి అప్పగించినట్టు తెలుస్తోంది.ఎస్సీ స్థానాల్లో ఏ పార్టీ మెజార్టీ సీట్లు గెలిస్తే ఆ పార్టీదే అధికారమని చరిత్ర చెబుతోంది. రాష్ట్రం కలిసి ఉన్నపుడు కూడా ఈ ట్రెండ్‌ను చూడవచ్చు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ప్రాంతంలోని 19 ఎస్సీ స్థానాల్లో 10 సీట్లు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గెలుపొందారు. 2014లో మొత్తం 19 స్థానాల్లో కేసీఆర్ 13 సీట్లు గెలుచుకుని ఎన్నికల్లో విజయం సాధించారు. మళ్లీ 2018లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ 16 సీట్లు గెలుపొందారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కమలం పార్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలపై ఎక్కువ దృష్టి పెట్టింది.ఎస్సీ నియోజకవర్గాల్లో ఇప్పటికే కన్వీనర్లు, మండల ఇంచార్జిలను గుర్తించారు. బూత్ కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి. కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి బీజేపీ అభివృద్ధి కార్యక్రమాల గురించి చెబుతున్నారు. ఎన్నికల నాటికి ఒక్కో ఇంటిని కనీసం పదిసార్లు సందర్శించాలి. సమస్యల గురించి తెలుసుకోవాలి.. ఓటర్లతో వ్యక్తిగత పరిచయాలు పెంచుకుని పార్టీకి ఓటు వేసేలా ఒప్పించాలి. మొత్తం మీద బీజేపీ పట్ల ప్రజలకు విశ్వాసం కల్పించాలన్నదే ఇప్పుడు మిషన్ 19 మొదటి లక్ష్యం. అలాగే అన్ని రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసేందుకు సర్వే చేపట్టింది. అభ్యర్థిని నిర్ణయించటంలో ప్రజాభిప్రాయానికి పెద్ద పీట వేయనుంది.ఇదే సమయంలో మిషన్ 70 పేరుతో బీజేపీ 2023 అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. 119 అసెంబ్లీ సీట్ల తెలంగాణ అసెంబ్లీలో మూడు సీట్లు మాత్రమే ఉన్న బీజేపీ 2023లో 70 సీట్లపై కన్నేయటం అవాస్తవికమే గాక అవాస్తవంగా కూడా అనిపించవచ్చు. ఐతే, గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టి గెలిచారని బీజేపీ నమ్ముతోంది. అలాగే తెలంగాణపై బీజేపీ కేంద్ర నాయకత్వం గతంలో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదు. ఇప్పుడు అమిత్ షా ప్రత్యేకంగా తెలంగాణపై ఫోకస్ పెట్టారు. బూత్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి స్థాయిలో సరైన వ్యక్తుల కోసం ఓ ప్రణాళికను సిద్ధం చేసింది.ప్రతి నియోజకవర్గంలో ముగ్గురు నేతలను గుర్తించి ఉత్తమ అభ్యర్థికి సీటు కేటాయించనున్నారు. కిందటిసారిలా కాకుండా ఈ సారి ఎన్నికలకు సిద్ధం కావటానికి తగిన సమయం ఉంది. కనుక ముందుగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంటుంది. 2018లో ముందస్తుకు వెళ్లటం వల్ల విపక్షాలు హడావుడిగా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి వచ్చింది. సిట్టింగ్‌లకు తిరిగి టికెట్లు ఇవ్వటం అప్పుడు టీఆర్‌ఎస్‌కు అడ్వాంటేజ్ అయ్యింది. ఇప్పుడు అలా కాకుండా బీజేపీ ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది.ప్రచారం విషయానికి వస్తే.. ఏ ఎన్నికల్లో అయినా బీజేపీ క్యాంపెయిన్ దూకుడుగా ఉంటుంది. కేసీఆర్ విధానాల వైఫల్యాలను చాలా దూకుడుగా ఎత్తిచూపడం ఆ పార్టీ ప్రణాళికలలో ఒకటి. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు నుంచి లబ్ధిపొందటం ఎలా అనేదానిపై బీజేపీ ప్రత్యేకంగా కసరత్తు చేస్తోంది. సీఎం కేసీఆర్ కొంత కాలంగా బీజేపీపై మాటల దాడి చేస్తున్నారు. ప్రధాని మోడీ సర్కార్ తీరుపై విరుచుకుపడుతున్నారు. ఇదంతా తన ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత నుంచి జనం దృష్టిని మరల్చడానికే అని బీజేపీ బలంగా ప్రచారం చేస్తోంది.తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గత ఏడాది ఆగస్టు 28న హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయం నుంచి చారిత్రాత్మక చార్మినార్ మీదుగా ప్రజాసంగ్రామ పాదయాత్ర ప్రారంభించారు. దాదాపు 438 కిలోమీటర్ల మేర సాగిన తొలి దశ పాదయాత్ర 36 రోజుల పాటు కొనసాగింది. హుస్నాబాద్‌లో కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ బహిరంగ సభతో పాదయాత్ర ముగిసింది. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు నాలుగు దశల్లో పాదయాత్ర కొనసాగించాలని పార్టీ యోచిస్తోంది.రెండవ దశ ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి నుండి ప్రారంభం కానుంది. తొలి దశలో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేటతో సహా ఎనిమిది జిల్లాల్లోని 19 అసెంబ్లీ, ఆరు పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొత్తం 35 బహిరంగ సభల్లో బండి సంజయ్ పాల్గొన్నారు. రెండవ దశ దాదాపు 60 రోజుల పాటు కొనసాగుతుంది. మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు పార్లమెంటు నియోజకవర్గాలను కవర్ చేస్తుంది. ఏప్రిల్ 14న అమిత్ షా రెండో విడతను జెండా ఊపి ప్రారంభిస్తారు. జనగాంలో జరిగే పాదయాత్రలో జేపీ నడ్డా పాల్గొంటారు. గతంలో జనగామలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ బీజేపీని అస్తిత్వం లేని పార్టీ అన్నారు. అదే నియోజకవర్గంలో బీజేపీ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది.మరోవైపు బీజేపీ ఐటీ సెల్ కూడా ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఐటీ సెల్‌లు, సోషల్ మీడియా వింగ్‌లు అంతర్భాగంగా ఉంటాయి. తెలంగాణలో కూడా బీజేపీ తన ఐటీ సెల్‌ను బలోపేతం చేసే పనిలో ఉంది. ఐటీ సెల్ అనేది రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు ఉన్న ఓ ప్రణాళికాబద్ధమైన నిర్మాణం. బీజేపీ ఐటీ సెల్‌లో మొత్తం 4000 మంది నిరంతకం పనిచేస్తుంటారు. ఇది వాట్సాప్‌ను ప్రధాన కమ్యూనికేషన్ మోడ్‌గా ఉపయోగిస్తుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్ వంటి ఇతర సోషల్ మీడియా వేదికలను కూడా ప్రచారం కోసం వాడుకుంటారు.తెలంగాణ బీజేపీ ఐటీ సెల్ గత 6 ఏళ్లుగా పార్టీ ఆన్‌లైన్ ఉనికిని బలోపేతం చేసే ప్రయత్నాల్లో ఉంది. అతి పెద్ద వాలంటీర్ నెట్‌వర్క్ బీజేపీకి పెద్ద బలం. జిల్లా, స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఫేస్‌బుక్ పేజీలు ఉన్నాయి. దాదాపు 50 పేజీలు చురుకుగా పనిచేస్తున్నాయి.అలాగే, ఆ పార్టీకి వందలాది అనధికారిక పేజీలు ఉన్నాయి. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండే వాలంటీర్లు వాటిని నిర్వహిస్తున్నారు.స్థానిక ఐటీ సెల్‌ను గైడ్ చేసేందుకు ఒక కేంద్ర బృందాన్ని ఎన్నికలు జరిగే రాష్ట్రానికి పంపుతారు. ప్రతి ఎన్నికలకు ముందు ఇలాగే చేస్తారు. ఈసారి కూడా త్వరలో హైదరాబాద్‌కు ఓ బృందం రానుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. బీజేపీ గెలుపు అవకాశాలు ఉన్న నియోజకవర్గాలపై ఐటీ సెల్ ఎక్కువ దృష్టి సారిస్తుంది. పార్టీ అంతర్గత సర్వేలు ఈ నియోజకవర్గాలు ఏవి అనే విషయాన్ని నిర్ణయిస్తాయి.పార్టీ ప్రయత్నాలు, కార్యక్రమాలను హైలైట్ చేయడంలో సాయపడే బీజేపీ అనుకూల యూట్యూబ్ ఛానెల్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. దాదాపు పది బీజేపీ అనుకూల యూట్యూబ్ ఛానెల్‌లు ప్రస్తుతం యాక్టివ్‌గా పనిచేస్తున్నాయి. కానీ ఈ విషయంలో బీజేపీ కన్నా టీఆర్ఎస్ చాలా ముందుంది. 80 శాతం యూట్యూబ్ ఛానెళ్లు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పనిచేస్తున్నాయి. ఏది ఏమైనా రాబోయే ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారనున్నాయనటంలో సందేహం లేదు. 543 మంది సభ్యుల లోక్‌సభలో తొమ్మిది సీట్లు మాత్రమే ఉన్న టీఆర్‌ఎస్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని గద్దె దించాలని టార్గెట్ పెట్టుకుంది. మరోవైపు 119 సభ్యుల తెలంగాణ అసెంబ్లీలో ముగ్గురు సభ్యుల బలం ఉన్న బీజేపీ 2023 ఎన్నికల్లో 70 సీట్లకు గురిపెట్టింది. ఇది కాస్త విచిత్రంగా అనిపించవచ్చు. పెద్ద లక్ష్యాలను సాధించటం కష్టం కావచ్చు.. కానీ అసాధ్యం అయితే కాదు కదా..!