ఒంగోలు, మార్చి 31,
ఏపీ రాజకీయాల్లో ఒకప్పుడు కీలకమైన ఆ నేత.. ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి అనంతర పరిస్థితులు ఆయన్ను రాజకీయాలకు దూరం చేశాయి. ఆయన భార్య జాతీయస్థాయిలో కీలకంగా ఉండటంతో తనకెందుకు వచ్చిన రాజకీయాలు అని అనుకున్నారు. కానీ.. కుమారుడి కోసం ఆ ఆలోచన మార్చుకున్నట్టు టాక్. ఇంతకీ ఆయన దారేది? ఎవరా నాయకుడు?దగ్గుబాటి వెంకటేశ్వరరావు. మాజీ సీఎం చంద్రబాబు కంటే సీనియర్‌గా తెలుగుదేశం పార్టీలో ఆయన ప్రస్థానం కొనసాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతోపాటు ప్రస్తుతం ప్రధాన పార్టీలలో కొనసాగుతున్న పలువురు రాజకీయ నేతలు దగ్గుబాటు ఆశీస్సులతో ఎదిగిన వారే. టీడీపీని వీడాక కాంగ్రెస్‌లో చేరారు దగ్గుబాటి. 2004, 2009లో ప్రకాశం జిల్లా పర్చూరు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. తన రాజకీయ జీవితంలో మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా.. ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా.. మరోసారి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయాలను శాసించారు దగ్గుబాటి.రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు దగ్గుబాటి ప్రకటించారు. తన ఫ్యామిలీ నుంచి పురందేశ్వరి ఒక్కరే రాజకీయాల్లో ఉంటారని ఆయన చెప్పారు. కానీ.. మారిన పరిణామాలతో 2019లో వైసీపీలో చేరారు. పర్చూరు నుంచి తన కుమారుడు హితేష్ చెంచురామ్‌ను పోటీకి దింపాలని చూశారు. అయితే కుమారుడికి అమెరికా పౌరసత్వ సమస్య ఎన్నికల నాటికి క్లియర్ కాకపోవడంతో దగ్గుబాటే బరిలో దిగాల్సి వచ్చింది. వైసీపీ తరఫున పోటీ చేసిన ఆయన తొలిసారి ఓడిపోయారుదగ్గుబాటి పురందేశ్వరి 2004, 2009లో బాపట్ల, విశాఖ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత బీజేపీలోకి వెళ్లారు పురందేశ్వరి. ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2019లో దగ్గుబాటి వైసీపీలో చేరే సమయానికి ఆమె బీజేపీలో ఉండటం.. తరచూ వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తుండటంతో.. ఇద్దరూ ఒకే పార్టీలో ఉండాలని.. చేరో పార్టీలో ఉంటూ విమర్శలు చేయడం సరికాదని వైసీపీ పెద్దలు చెప్పడంతో.. దగ్గుబాటి అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అడపాదడపా కారంచేడులో తన వ్యక్తిగత కార్యక్రమాల్లో కనిపిస్తుండటంతప్ప ప్రజల్లోకి వచ్చింది లేదు.ఈ ఏడాది సంక్రాంతికి తన ఇంటికి వచ్చిన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను వీడియో తీస్తూ ఎంజాయ్ చేశారు దగ్గుబాటి. బాలయ్య నాలుగు రోజులపాటు అక్కా బావల దగ్గరే ఉండటంతో.. వారిని టీడీపీలోకి ఆహ్వానిస్తారేమోనని అనుకున్నారు. కానీ.. అలాంటి సంకేతాలు రాలేదు. రాజకీయ విభేదాలతో తోడల్లుళ్లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు ప్రత్యర్థుగా మారిపోయారు. కుటుంబ కార్యక్రమాల్లోనూ పెద్దగా కలిసింది లేదు. కానీ.. ఎన్టీఆర్ పెద్ద కూతురు ఉమామహేశ్వరి కుమార్తె వివాహ వేడుకలో దగ్గుబాటి, చంద్రబాబు ఆప్యాయంగా మాట్లాడుకోవడంతో ఇద్దరూ కలిసిపోతారనే టాక్ మొదలైంది. ఈ క్రమంలో జరుగుతున్న ప్రచారమే ఆసక్తిగా ఉందిదగ్గుబాటి కుమారుడు హితేష్ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. చీరాలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆయన కుమారుడు నిజంగానే టీడీపీలోకి వెళ్తారా? రెండు కుటుంబాలు కలిసిపోతాయా? అనే ప్రశ్నలు ఉన్నాయి. అయితే ఇప్పటి రాజకీయాలు తనకు సరిపడవని పలు సందర్భాలలో దగ్గుబాటి చెప్పుకొచ్చేవారు. రాజకీయ వారసుడిగా హితేష్‌ను MLAగా పోటీ చేయించాలన్న ఆలోచననూ విరమించుకున్నారట దగ్గుబాటి. విపరీతంగా డబ్బులు ఖర్చు చేయాల్సి ఉండటం.. అడ్డమైనవారికి అణిగిమణిగి ఉండటం వంటివి తమ ఒంటికి పడవని చెబుతున్నారట. అంతేకాదు.. హితేష్ వ్యాపారం చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారని.. అతన్ని రాజకీయాల్లోకి దించి పాడు చేయడం అనవసరం అంటున్నారట. పురందేశ్వరి ఎలాగూ బీజేపీలో జాతీయ నేతగా ఉన్నారు. ఆమె ఒక్కరే ఫ్యామిలీ నుంచి యాక్టివ్‌గా ఉండాలనేది ఆయన అభిమతం.కుటుంబాన్ని.. సొంత వ్యాపారాలను చూసుకోవడానికి ఎవరో ఒకరు అందుబాటులో ఉండాలని భావించి దగ్గుబాటి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారనేది అనుచరుల మాట. అయితే నిజంగానే ఆయన సైలెంట్‌గా ఉన్నారా? లేక వ్యూహాత్మకా అనేది ప్రశ్న. భవిష్యత్‌లో మళ్లీ మనసు మార్చుకుంటారా? చెప్పిన మాటకే కట్టుబడతారో చూడాలి.