కర్నూలు, మార్చి 31,
కరోనా మొదటి దశ ఉద్ధృతిలో భాగంగా ఎక్కువగా ప్రభావితమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. ముఖ్యంగా రాయలసీమ ముఖద్వారంగా చెప్పుకునే కర్నూలు (Kurnool) జిల్లాలో అయితే ఇబ్బడిముబ్బడిగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా భారీగానే నమోదయ్యాయి. కరోనాకు ముందు ఢిల్లీలో జరిగిన ఓ మత కార్యక్రమానికి కర్నూలుకు చెందిన వారు అధికంగా పాల్గొనడం, అప్పుడే వైరస్ వ్యాప్తి చెందడంతో జిల్లాలో కరోనా వైరస్ వేగంగా విజృంభించింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కఠిన ఆంక్షలు, నిబంధనలు విధించింది. చాలారోజుల వరకు కానీ పరిస్థితి అదుపులోకి రాలేదు. కొవిడ్ మొదటి దశ అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న జిల్లా అధికారులు రెండో వేవ్, మూడో వేవ్ సమయాల్లో కరోనా నియంత్రణకు గట్టి చర్యలు తీసుకున్నారు. దీంతో మహమ్మారి పూర్తిగా అదుపులోకి వచ్చింది. ఇప్పుడు ఆ జిల్లాలో కరోనా క్రియాశీలక కేసులు సున్నాకు చేరుకోవడం గమనార్హం.కాగా వారం రోజుల (23వ తేదీ) నుంచి కర్నూలు జిల్లాలో కొత్త కరోనా కేసులేవీ నమోదు కావడం లేదు. 23వ తేదీ నాటికే అక్కడ కేవలం ఒకరు మాత్రమే కరోనాతో బాధపడుతున్నారు. అది కూడా నిన్న రికవరీ జాబితాలో చేరిపోవడంతో జిల్లాలో యాక్టివ్ కేసుల సంఖ్య జీరోకు చేరుకుంది. ఇక తాజాగా ఏపీలో మొత్తం 15 కరోనా కేసులు నమోదయ్యాయి. గత వారం రోజుల ట్రెండ్‌ను కొనసాగిస్తూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. యాక్టివ్ కేసులు కూడా సున్నా వద్దనే ఉన్నాయి. దీంతో జిల్లా ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు