కాకినాడ, మార్చి 31,
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో కాకినాడ సిటీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇందుకు కారణం కూడా ఉంది. పవన్ కల్యాణ్ ప్రతి మీటింగ్‌లోనూ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై మండిపడుతున్నారు.. విమర్శలు చేస్తున్నారు. ఆ మధ్య జనసేన ఆవిర్భావ సభలో కూడా ఎమ్మెల్యే ద్వారంపూడి తీరు మారకపోతే భీమ్లానాయక్ ట్రీట్మెంట్ ఇస్తానని హెచ్చరించారు. ఆ ప్రకటనతో వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కాకినాడ సిటీ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. జనసేనసభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే ద్వారంపూడి కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాకినాడ లేదా ఇంకెక్కడి నుంచి పోటీ చేసిన జనసేనానిని ఓడిస్తానని శపథం చేశారు.కాకినాడపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో ఉన్న సామాజికవర్గాలు.. ఇప్పటి వరకు గెలిచిన అభ్యర్థుల గురించి రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. ఆ లెక్కన చూస్తే పవన్ కల్యాణ్ కాకినాడలో పోటీ చేయకపోవచ్చన్నది కొందరి వాదన. 70 ఏళ్లలో కాకినాడ నుంచి కాపు సామాజికవర్గం ఒక్కసారే గెలిచిందని చెబుతున్నారు. ప్రధాన పార్టీలు కూడా కాకినాడ అసెంబ్లీ సీటును కాపులకు ఇవ్వలేదు.కాకినాడలో కాపులు గెలవడం అంత ఈజీ కాదు. తూర్పు గోదావరి జిల్లా కాపు సామాజికవర్గానికి పెట్టని కోట అయినప్పటికీ కాకినాడ సిటీ అసెంబ్లీకి వచ్చే సరికి లెక్కలు సరిపోవడం లేదు. కాకినాడ లోక్‌సభకు మాత్రం పార్టీలు ఏవైనా కాపు అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు తాత మల్లిపూడి పళ్లంరాజు మాత్రమే 1955లో కాకినాడ సిటీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దానికి ముందుకానీ.. తర్వాతగానీ ఆ సామాజికవర్గం నుంచి ఒక్కరూ గెలవలేదు.కాకినాడ సిటీ నియోజకవర్గంలో 2 లక్షల 55 వేల 716 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో కాపు సామజికవర్గం ఓటర్లు 28.6 శాతం. ఇక్కడ గెలుపోటములను నిర్ణయించేది కూడా కాపు సామాజికవర్గమే. కానీ.. కాపు అభ్యర్థి నిలుచుంటే గెలవడం లేదు. విచిత్రం ఏంటంటే.. కాకినాడ పార్లమెంట్ పరిధిలోని మిగిలిన ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాపు అభ్యర్థులకు ఓటర్లు పట్టం కడతారు కానీ.. కాకినాడ సిటీలో సీన్ రివర్స్. కాకినాడ రూరల్‌లో మంత్రి కురసాల కన్నబాబు, పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప, తునిలో దాడిశెట్టి రాజా, జగ్గంపేటలో జ్యోతుల చంటిబాబు, పిఠాపురంలో పెండెం దొరబాబు, ప్రత్తిపాడులో పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కాకినాడ ఎంపీ వంగా గీత కూడా కాపు సామాజికవర్గమే. ఈ లెక్కలు చూశాకే ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది.అసెంబ్లీ ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయారు పవన్ కల్యాణ్. ఈసారి తూర్పుగోదావరి జిల్లా నుంచి పోటీ చేస్తారనే ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. కాకినాడ మినహాయించి మూడు సీట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్టు టాక్. వాటిల్లో పిఠాపురం, కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్ పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో కాపుల ప్రభావం ఎక్కువ. ఈ మూడింటిలో ఎక్కడ నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేసినా వార్ వన్‌సైడ్‌గా ఉంటుందనేది జనసేన నేతల అంచనా. మరి.. జనసేనాని ఏం చేస్తారో చూడాలి.