విజయవాడ, మార్చి 31,
కరెంటు చార్జీలు బాదుడే..బాదుడు. ఈ డైలాగ్ ఇంతకు ముందెప్పుడో విన్నట్టుంది కదా. అవును, విన్నారు. ఒకటి రెండు కాదు చాలాసార్లే విన్నారు. అది ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగనన్న రొటీన్ డైలాగ్. పదే కరెంట్ చార్జీలు బాదుడే బాదుడు అంటూ పదే పదే మౌకుల్లో ఊదరగొట్టి.. ప్రజలను మభ్యబెట్టి.. ఒక్క ఛాన్స్ అంటూ అందలమెక్కారు. ఇప్పుడు ఆయనే కరెంట్ చార్జీలు బాదేసి తనను నమ్మి ఓటేసిన ప్రజల నడ్డి విరగ్గొట్టారు. ఏపీలో భారీగా విద్యుత్ బిల్లులు పెంచుతూ.. సమ్మర్‌లో సామాన్యుడికి కరెంట్ షాక్ ఇచ్చారు జగనన్న. ఇదే విషయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జగన్‌రెడ్డిని నిలదీశారు. నిప్పుల్లాంటి మాటలతో కడిగేశారు.కరెంటు చార్జీలు బాదుడే.. బాదుడంటూ నాడు దీర్ఘాలు తీశాడని, ఇప్పుడు చార్జీలు భారీగా పెంచి జనానికి షాక్ కొట్టించారని లోకేశ్ మండిపడ్డారు. ‘‘మాట తప్పుడుకి బ్రాండ్ అంబాసిడర్.. మడమ తిప్పుడుకి ఐకాన్ జగన్. సీఎం పదవి కోసం జగన్ తొక్కని అడ్డదారి లేదు’’ అని లోకేష్ ఫైర్ అయ్యారు. సీఎం జగన్‌రెడ్డి మాట ఇచ్చాడంటే.. దానికి రివర్స్ చేస్తాడని.. జగన్‌రెడ్డి, ప్రజలకు వేసవి షాక్ ఇచ్చాడని.. తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేటగిరీలను రద్దు చేసి 6 స్లాబ్‌లను తీసుకొచ్చి ఏపీలో సామాన్యులపై జగన్ సర్కార్ మరో పిడుగు వేసిందని లోకేశ్ విమర్శించారు. ఒక ఏడాదిలో జగన్‌రెడ్డి ఇచ్చే అన్ని పథకాల డబ్బు.. ఏడాది కరెంట్ బిల్లులకే సరిపోనంత స్థాయిలో పెరగనుండడం ఏం బాదుడో సీఎం జగనే చెప్పాలని నిలదీశారు. టీడీపీ హయాంలో ఉచిత విద్యుత్ ఇస్తుంటే అపోహలు సృష్టించడంపైనా, 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తే ఇవ్వలేదని చెప్పిన అబద్ధాలపైనా, కరెంటు ఛార్జీలు పెంచకపోయినా బాదుడే బాదుడంటూ తప్పుడు ఆరోపణలు చేయడంపైనా జగన్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని లోకేశ్ డిమాండ్ చేశారు. ఉచిత విద్యుత్‌పై మాట తప్పి మోటార్లకు మీటర్లు బిగించినందుకు, కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారం మోపినందుకు, మిగులు విద్యుత్‌తో టీడీపీ ప్రభుత్వం అప్పగించిన విద్యుత్ ఉత్పత్తిని లోటు విద్యుత్ స్థాయికి దిగజార్చి కొరతతో కోతలు అమలు చేస్తున్నందుకు, టీడీపీ పాలనలో అమలైన సంస్కరణలతో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిచిన ఏపీ విద్యుత్ రంగాన్ని జగన్‌రెడ్డి తన విధ్వంసకర విధానాలతో సంక్షోభంలో పడేసినందుకు.. రాష్ట్ర ప్రజల్ని మన్నించమని జగన్ ప్రాథేయపడాలని లోకేశ్ డిమాండ్ దెప్పిపొడిచారు. జగన్‌రెడ్డి మాట ఇస్తే దానికి రివర్స్ చేస్తారని సెటైర్లు వేశారు లోకేశ్. ఫ్యాన్‌కు ఓటేసిన వాళ్లు ఫ్యాన్ స్విచ్ వేయాలంటేనే వణికిపోతున్నారని ఎమ్మెల్సీ అశోక్‌బాబు విమర్శించారు. బొగ్గు కేంద్రాలకు బకాయిలు, సోలార్ ఒప్పందాల రద్దుతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈఆర్‌సీ ధరలపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పవర్ మేనేజ్‌మెంట్ దేశానికే ఆదర్శమన్నారు. జగన్ మూడేళ్లలోనే 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని అశోక్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.