బెంగళూర్, మార్చి 31,
వారిది మామూలు పెళ్లి కాదు. ఆదర్శ వివాహం. అతనో ధనిక రైతు. వ్యవసాయం మినహా మరో వ్యాపకం తెలీదు. నిత్యం పొలం పనుల్లో ఫుల్ బిజీ. పంటనే పెళ్లాంగా.. సాగునే సంతానంగా భావించేవాడు. అలా రైతుగా బాగానే సంపాదించాడు. గ్రామంలో ధనికులకే అసూయ పుట్టేలా.. అందమైన పే..ద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు. జీవితం సాఫీగా, హాయిగా సాగిపోతోంది. ఏ చీకూచింతా లేకుండా గడిచిపోతోంది. కానీ, ఒక్కటే ఆయన లైఫ్‌లో లోటు. వయసు మీదపడినా.. మిడిల్ ఏజ్ దాటిపోయినా.. ఆయనకు ఇంకా పెళ్లి కాకపోవడం. అప్పటికే బాగా లేట్ అయిపోవడంతో ఆయన సైతం ఇక పెళ్లి చేసుకో కూడదని అనుకున్నాడు. అలానే సింగిల్‌గా ఉండిపోయారు. అలాంటి ఆ రైతు జీవితంలోకి పరిచయం పేరుతో అడుగుపెట్టింది పొరుగు ఊరు పిల్ల. అప్పటికే ఆమెకు పెళ్లి అయిపోయింది. భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచీ ఆమె ఒంటరిగా ఉంటోంది. ఆమె ఈ రైతు గురించి తెలుసుకొని మెళ్లిగా దగ్గరైంది. మంచి మాటలు చెప్పి మంచిక చేసుకొని తనతో పెళ్లికి ఒప్పించింది. మొదట పెళ్లికి అతను ఒప్పుకోకపోయినా.. ఆమె ఎలాగోలా అతన్ని మెప్పించి ఒప్పించింది. అలా లేటు వయసులో లేటెస్ట్‌గా.. ఓ ఆలయంలో ఆమె మెడలో మూడుముళ్లు వేశాడు ఆ రైతు. అప్పట్లో వారి పెళ్లికి ఫుల్ పబ్లిసిటీ వచ్చింది. ఆమె అందంగా, వయసులో ఉండటం, అతను సాదాసీదాగా వయసు మళ్లి ఉండటంతో.. సోషల్ మీడియాలో వారి పెళ్లి ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. ట్రోల్ కూడా అయ్యాయి. కొన్నాళ్లు వాళ్లిద్దరూ హ్యాపీ. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్టెడ్. కట్ చేస్తే.. ఆ తాజాగా ఆ రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. భార్యపై అనుమానాలకు కారణమైంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో, బెంగళూరు- హాసన జాతీయ రహదారిలోని చౌడనకుప్పెలో జరిగింది. అతని పేరు శంకరణ్ణ. వయసు ఐదు పదుల పైనే. ఆమె మేఘనా. జస్ట్ 25 ఇయర్స్. వారి పెళ్లి ఓ సెన్సేషన్. ఇప్పుడు అతని చావు అంతే సంచలనం. ఆస్తి కోసమే అతన్ని ఆమె పెళ్లి చేసుకుందంటూ అప్పట్లో అనేక మంది విమర్శలు చేశారు. అవేమీ పట్టించుకోకుండా శంకరణ్ణ తన భార్యను అపురూపంగా చూసుకునేవారు. ఇలాంటిది ఇప్పుడిలా అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇంట్లో గొడవలే ఆయన సూసైడ్‌కి కారణంగా తెలుస్తోంది. గ్రామంలో తాను ఉండలేనని.. బెంగళూరులో కాపురం పెట్టాలని శంకరణ్ణపై మేఘనా ఒత్తిడి చేసేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఉన్న ఆస్తిని విక్రయించి బెంగళూరులో స్థిరపడాలని ఆమె తరచూ పోట్లాడేదని అంటున్నారు. ఓవైపు వృద్ధురాలైన తల్లిని కాదని.. భార్య మాటలు విని.. ఆస్తిని ఎలా అమ్మేదంటూ ఆయన తీవ్రంగా మనోవేదన పడేవారని అంటున్నారు. సోమవారం రాత్రి కూడా ఇదే విషయమై భార్యాభర్తలకు గొడవ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. గొడవ తర్వాత ఇంటి నుంచి కోపంగా బయటకు వెళ్లిన శంకరణ్ణ.. మంగళవారం ఉదయం చెట్టుకు వేలాడుతూ కనిపించారు. అలా ఆయన అందమైన జీవితం సడెన్‌గా విషాదాంతమైంది. శంకరణ్ణ మృతదేహం దగ్గర ఓ లేఖను గుర్తించారు పోలీసులు. మరింత దర్యాప్తు చేస్తున్నారు. పాపం శంకరణ్ణ.. వయసు మీదపడినా బ్యాచ్‌లర్‌గా దర్జాగా బతికిన ఆయన.. పెళ్లి తర్వాత మనఃశాంతి దూరమై.. ఇప్పుడిలా ఏకంగా ప్రాణాలే తీసుకోవడంతో.. ఆయన గురించి తెలిసిన వారంతా బాధపడుతున్నారు. సోషల్ మీడియాలో శంకరణ్ణ జీవితంపై చర్చ జరుగుతోంది.