YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అడ్డంగా బుక్కైన రాజయ్య

అడ్డంగా బుక్కైన రాజయ్య

వరంగల్, మార్చి 31,
బంధుప్రీతితో ఆ ఎమ్మెల్యే అడ్డంగా బుక్కయ్యారా? విషయం బయటకు రాగానే ప్రత్యర్థులు రచ్చ రచ్చ చేసేశారా? దిద్దుబాటు చర్యలు చేపట్టినా అధికారపార్టీ శాసనసభ్యుడు ఇరుకున పడ్డారా? పార్టీ అధిష్ఠానం యాక్షన్‌ ఏంటి?తాటికొండ రాజయ్య. స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే. అధికారపార్టీ శాససభ్యుడు. మాజీ డిప్యూటీ సీఎం. ఇన్ని ట్యాగ్‌లైన్లు ఉన్న ఎమ్మెల్యే రాజయ్య.. దళితబంధు విషయంలో లటుక్కున దొరికిపోయారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి అమలు చేస్తుంటే.. ఎమ్మెల్యే చేసిన పని పార్టీ పెద్దలకు మింగుడుపడటం లేదట. దళితబంధు పథకంలో ఆయన ప్రదర్శించిన బంధుప్రీతి.. రాష్ట్రవ్యాప్తంగా చర్చగా మారిపోయింది.స్టేషన్‌ ఘన్‌పూర్‌లో అర్హులైన పేదలను కాదని.. దళితబంధు పథకం తొలి విడతలోనే ఎమ్మెల్యే రాజయ్య సోదరుడు, సర్పంచైన తాటికొండ సురేష్‌ పేరు పెట్టేశారు. మరికొందరు స్థానిక ప్రజా ప్రతినిధుల పేర్లు జాబితాలో ఉండటంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకే అప్పగించింది ప్రభుత్వం. దాంతో ఎమ్మెల్యే రాజయ్య చక్రం తిప్పినట్టుగా ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే తీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పొలిటికల్‌ హీట్‌ రాజుకోవడంతో రాజయ్య దిద్దుబాటు చర్యలు చేపట్టారు.రాజయ్య సోదరుడు సురేష్‌ సహా జాబితాలో పేర్లు ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వెనక్కి తగ్గారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఒక ప్రకటన కూడా ఇచ్చేశారు. వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే రాజయ్యకు చెడ్డపేరు రావొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సర్పంచ్‌ తాటికొండ సురేష్‌, వైస్‌ MPP భర్త కందుల గట్టయ్య, జాఫర్‌గడ్‌ జడ్పీటీసీ భర్త ఇల్లందు శ్రీనివాస్‌, జాఫర్‌గడ్‌ ఎంపీపీ భర్త సుదర్శన్‌లు ప్రకటించారు. కానీ.. అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయిందన్నది స్టేషన్‌ ఘన్‌పూర్‌ టీఆర్ఎస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయట.ఈ అంశాన్ని టీఆర్ఎస్‌ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ విషయం తెలిసినప్పటి నుంచి ఎమ్మెల్యే రాజయ్య ఆందోళనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే అధికారపార్టీ ఆగ్రహం ఎలా ఉంటుందో రాజయ్య రుచి చూశారు. టీఆర్ఎస్‌ తొలిసారి అధికారం చేపట్టినప్పుడు డిప్యూటీ సీఎం పదవి దూరమైన నాటి ఘటనలు ఆయన మార్చిపోలేదట. ఇప్పుడీ సమస్య వచ్చింది. దళితబంధు జాబితా ఎలా బయటకు వచ్చిందన్నదానిపై ఎమ్మెల్యే ఆరా తీస్తున్నారట. వాస్తవానికి స్టేషన్‌ ఘనపూర్‌ టీఆర్‌ఎస్‌లో రాజయ్యకు ఇంటిపోరు గట్టిగానే ఉంది. తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే ప్రత్యర్ధులు ఈ జాబితాను బయట పెట్టారని అనుమానిస్తున్నారట. వారెవరో కనిపెట్టే పనిలో ఉన్నారట ఎమ్మెల్యే. ఆ వివరాలు అన్నీ సేకరించాక పార్టీ పెద్దలను కలిసి వివరణ ఇచ్చే ఆలోచన చేస్తున్నారట రాజయ్య. ఒకవేళ పార్టీ అధిష్ఠానం సమయం ఇవ్వకపోతే.. వాళ్లకు సన్నిహితంగా ఉండేవారికైనా చెప్పేందుకు సిద్ధపడుతున్నారట ఎమ్మెల్యే.మొత్తానికి ఎమ్మెల్యే రాజయ్యను ప్రత్యర్థులు సమయం చూసుకుని దెబ్బకొట్టారనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మరి.. ఈ సమస్య నుంచి ఎలా బయటపడతారో.. అధిష్ఠానం యాక్షన్‌ ఏంటో చూడాలి.

Related Posts