YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

టచ్ మీ నాట్ అంటున్న జీవన్ రెడ్డి

టచ్ మీ నాట్ అంటున్న జీవన్ రెడ్డి

కరీంనగర్, మార్చి 31,
తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి. పార్టీకి విధేయుడు. ప్రస్తుతం ఎమ్మెల్సీ. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌పై పోటీ చేయడానికి పార్టీ నుంచి ఎవరూ ముందుకురాని సమయంలో మంత్రి పదవిలో ఉండి ఆయనపై పోటీ చేశారు. అలాంటి జీవన్‌రెడ్డి కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు టచ్‌మీ నాట్‌గా ఉంటున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌లో జరిగే ప్రతిచర్చలో జీవన్‌రెడ్డి ఉండేవారు.. ఇప్పుడు జీవన్‌రెడ్డి పార్టీలో ఉన్నారో లేరో కూడా తెలియనంతగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.పీసీపీ చీఫ్‌ ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో.. రేవంత్‌రెడ్డిని వ్యతిరేకించిన కాంగ్రెస్‌ నాయకులంతా.. జీవన్‌రెడ్డిని సమర్ధించారు. సరిగ్గా అదే సమయంలో నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక వచ్చింది. దీంతో మాజీ మంత్రి జానారెడ్డి జోక్యం చేసుకుని.. పీసీసీ చీఫ్‌ ఎంపిక ప్రక్రియను ఆపించారు. జానా కోరడం.. కాంగ్రెస్‌ అధిష్ఠానం అంగీకరించడం చకచకా జరిగిపోయింది. ఆ సమయంలో పీసీసీ చీఫ్‌గా జీవన్‌రెడ్డి పేరు ఖరారైనట్టు.. అందుకు సోనియాగాంధీ ఆమోదం తెలిపినట్టు లీకులు వచ్చాయి. కానీ.. నాగార్జున సాగర్‌ ఉపఎన్నిక తర్వాత పీసీసీ చీఫ్‌ రేస్‌లో జీవన్‌రెడ్డి పేరు లేకుండా పోయింది. అప్పటి నుంచి జీవన్‌రెడ్డి అసంతృప్తితోనే ఉంటున్నారు.మాజీ మంత్రి జీవన్‌రెడ్డికి వయసు మీద పడింది అని కొందరు.. రెడ్డి సామాజికవర్గం కూడా ఆయన్ని ఓన్‌ చేసుకోదని మరికొందరు కాంగ్రెస్‌ అధిష్ఠానానికి చెప్పినట్టు పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. వాటిని జీవన్‌రెడ్డి ఇప్పటికీ ప్రస్తావిస్తూనే ఉన్నారు. గతంలో గాంధీభవన్‌లో ఏ కార్యక్రమం జరిగినా వచ్చే ఆయన.. ఇప్పుడు రావడమే మానేశారు. ఆ మధ్య గాంధీభవన్‌లో పార్టీ సమావేశం జరుగుతుంటే.. అసెంబ్లీలో ప్రెస్‌మీట్‌ పెట్టి వెళ్లిపోయారు తప్ప.. అక్కడికి వెళ్లలేదు.ప్రస్తుతం సొంత జిల్లాలోని చొప్పదండిలో పార్టీ నేత మేడిపల్లి సత్యం.. ధర్మపురిలో అడ్లూరి లక్ష్మణ్‌ల కోసం పనిచేస్తున్నారు జీవన్‌రెడ్డి. ఈ రెండు నియోజకవర్గాలతోపాటు జగిత్యాలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లు నిర్వహిస్తున్న సమావేశాలకు కానీ.. ఇతర ఏ విషయాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు మాజీ మంత్రి. రేవంత్‌ను పీసీసీ చీఫ్‌గా ప్రకటిస్తున్న సమయంలో  రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌.. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి ఫోన్‌ చేశారట. ఆ సమయంలో ఠాగూర్‌పై జీవన్‌రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయినట్టు చెబుతారు. మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి.. అన్నీ మాకు చెప్పి చేస్తున్నారా అని ఇంఛార్జ్‌ను నిలదీశారట. తత్వం బోధపడిన ఠాగూర్‌ సైలెంట్‌గా ఉండిపోయారట.పీసీసీ చీఫ్ ఎంపిక తర్వాత జీవన్‌రెడ్డి పార్టీ లైన్‌లోనే ఉన్నా.. పాత గాయం నుంచి ఇంకా కోలుకో లేకపోతున్నారని సమాచారం. తనే పీసీసీ చీఫ్‌ అని ప్రకటించే సమయంలో ఒక పెద్దాయన ఫోన్‌తో ఆ పదవి రాలేదన్న ఆవేదనలో ఉన్నారట జీవన్‌రెడ్డి. ఆ విషయాన్ని ఎవరు కదిలించినా.. పాత గాయాన్ని చెప్పుకొంటున్నారట మాజీ మంత్రి. ఆ సంగతి ఎలా ఉన్నా.. కొందరు పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్‌ హైకమాండ్‌కు చెప్పిన మాటలే మరింత గాయం చేస్తున్నాయట.

Related Posts