ఒంగోలు, ఏప్రిల్ 1,
సహజ కలయిక, కృత్రిమ గర్భోత్పత్తి ఇంజక్షన్ల ద్వారా ఆవులు గర్భం దాలుస్తాయి. ఒక్కో ఆవు తన జీవితకాలంలో 9 నుంచి 15 దూడల వరకు జన్మనిస్తుంది. వాటి సంఖ్యను పెంచేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. అందుకు మనుషుల్లో అవలంబిస్తున్న సరోగసీ విధానాన్ని పశువుల్లోనూ ప్రవేశపెట్టడంలో విజయవంతమయ్యారు. ఈ ‘ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్’ సాంకేతికతను ప్రకాశం జిల్లాచదలవాడ పశుక్షేత్రంలో వినియోగిస్తున్నారు. దీంతో అతరించిపోతున్న ఒంగోలు, పుంగనూరు లాంటి జాతుల పశువుల సంతతిని పెంచవచ్చని భావిస్తున్నారు. గరిష్ఠంగా 15 దూడలకు జన్మనిచ్చిన తర్వాత సహజసిద్ధమైన కలయిక వల్ల కానీ, కృత్రిమ గర్భోత్పత్తి వల్ల కానీ ఆవులు గర్భం దాల్చడం కష్టమవుతుంది. గాయాలపాలైనా, వయసుపైబడినా గర్భం నిలవదు. అలాంటి ఆవులు ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ సాంకేతికత ద్వారా దూడలకు జన్మనివ్వవచ్చు. ఏ జాతి పశువులకు చెందిన అండాన్ని ప్రవేశపెడితే అదే జాతి దూడ జన్మిస్తుంది. తల్లి లక్షణాలు మాత్రం వాటికి రావని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం మేలురకానికి చెందిన ఒంగోలు జాతి పశువులు అంతరించిపోతున్నాయి. దీంతో నాణ్యమైన పశువుల నుంచి వీర్యాన్ని సేకరించి పిండాభివృద్ధి చేస్తున్నారు. దీన్ని పశువుల గర్భంలోకి ఎక్కించి దూడలకు జన్మనిచ్చేలా చేస్తారు. ఈ విధానం వల్ల ఒక్కో ఆవు తన జీవితకాలంలో 50 దూడల వరకు జన్మనిచ్చే అవకాశం ఉంటుంది. మేలుజాతి ఆంబోతుల వీర్యాన్ని మరో మేలు జాతి ఆవు అండంలో ప్రవేశపెట్టి పిండాన్ని అభివృద్ధి చేస్తారు. ఎదకు వచ్చిన స్థానిక ఆవుల గర్భంలో ఆ పిండాన్ని ప్రవేశపడతారు. దీని ద్వారా మేలు జాతి పశువులు అభివృద్ధి చెందుతాయి. స్థానిక పశువుల్లో మేలు జాతి లక్షణాలు పెంపొందించవచ్చు. వాటిలో వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చు. రైతులకు పాల ఉత్పత్తిలో, వ్యవసాయంలో లబ్ధి చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. చదలవాడ పశుక్షేత్రంలో దేశీయ ఆవులు 300 వరకు ఉన్నాయి. సరోగసీ ద్వారా వెయ్యి వరకు మేలుజాతి రకాలను ఉత్పత్పి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.