పడవలు, లాంచీలకు భద్రత కరువు అయింది. లంచాలలో ముఖ్యమంత్రి, నారా లోకేశ్, ఇతర మంత్రులకు వాటాలు వున్నాయని వైకాపా అధినేత వై ఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబుపై విచారణ జరపాలని అయన డిమాండ్ చేసారు. బుధవారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా రామారావు గూడెం వద్ద మీడియాతో మాట్లాడారు. గోదావరి, కృష్ణా నదులపై జరుగుతోన్న పడవ, లాంచీల ప్రమాదాలు సర్కారు హత్యలే అని అయన అన్నారు. ఈ దుస్సంఘటనలకు ముఖ్యమంత్రి, మంత్రులు బాధ్యత వహించాలి. కేవలం ఆరు నెలల్లో మూడు దుస్సంఘటనలు చోటు చేసుకున్నాయి. నదులపై భద్రత లేని పడవలు, లాంచీలు యథేచ్చగా తిరుగుతున్నాయి. వాటిలో ఏ ఒక్కటికీ ఫిట్నెస్ లేదు. ముఖ్యమంత్రి అధికార నివాసానికి సమీపంలో గత నవంబరులో కృష్ణా నదిలో పడవ ప్రమాదం జరిగింది. ఈఘటనలో 21 మంది మరణించారు. అయిదు రోజుల కింద మరో పడవ గోదావరి నదిపై వెళుతోన్న పడవ అగ్ని ప్రమాదానికి లోనయ్యింది. అందులోని 40 మంది ప్రయాణీకులు ఆ పడవ నుంచి బయట పడి ప్రాణాలు దక్కించకున్నారు. లేని పక్షంలో చని పోయి ఉండేవారని అయన అన్నారు. నిన్న లాంచీ గోదావరి నదిలో మునిగి పోయిన ఘటనలో అమాయకులైన గిరిజన ప్రయాణీకులు మృతి చెందారు. పుష్కరాల సమయంలో కూడా చంద్రబాబు నిర్వాకం వల్ల 29 మంది భక్తులు తొక్కిసలాటలో కన్ను మూశారు. ఈఘటనలపై ప్రభుత్వం నామ మాత్రంగా విచారణకు ఆదేశిస్తోంది. విచారణ నివేదికలపై ఎలాంటి చర్యలు లేవని అయన అన్నారు. వాస్తవానికి విచారణలను ఎవరిపై వేయాలి? ముఖ్యమంత్రి ఆయన కుమారుడు మంత్రులపై విచారణలు జరగాలని అయన అన్నారు. ఈఘటనలకు బాధ్యులు వారే. ముందు వారిపై విచారణలు వేసి చర్యలు తీసుకోవాలి. నిన్నటి ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు తక్షణం నష్టపరిహారం ఇవ్వాలని అయన అన్నారు. ఒక్కో కుటుంబానికి రూ 25 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అయన అన్నారు.