నెల్లూరు, ఏప్రిల్ 1,
వైయస్ జగన్ తన కొత్త కేబినెట్ కూర్పు పూర్తయిందని.. ఈ కేబినెట్‌లోకి మేకపాటి శ్రీకీర్తిని తీసుకోవాలని ఆయన నిర్ణయించినట్లు సమాచారం. ఆమెకు మంత్రి పదవి కట్టబెట్టి.. ఆ తర్వాత ఆమెను ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిపి.. గెలిపించుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే శ్రీకీర్తి ఇప్పటి వరకు ఎప్పుడు రాజకీయాల్లో లేరు.. అమె మామ మేకపాటి రాజమోహన్ రెడ్డి, చిన్నమామ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితోపాటు ఆమె భర్త మేకపాటి గౌతమ్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నా.. శ్రీకీర్తి మాత్రం.. తన కుటుంబమే లోకంగా ఉన్నారని.. అలాంటి ఆమెకు రాజకీయాల గురించి బొత్తిగా అవగాహన లేదనే ఓ టాక్ అయితే ఆత్మకూరు నియోజకవర్గంలో బలంగా నడుస్తోంది. మరోవైపు ఆమెకు రాజకీయాల పట్ల అయిష్టత ఉందని.. ఇదే విషయాన్ని మేకపాటి ఫ్యామిలీ సీఎం జగన్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. మేకపాటి కుమారుడు, కుమార్తె కూడా చిన్న వయస్సు వారే కావడం... మేకపాటి రాజమోహన్ రెడ్డి వయస్సు రీత్యా.. రాజకీయాలకు దూరంగా ఉండడం.. ఇక మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరులు సైతం రాజకీయాల పట్ల అయిష్టత వ్యక్తం చేయడం వంటి తదితర కారణాల నేపథ్యంలో శ్రీకీర్తిని రంగంలోకి దింపాలని జగన్ పార్టీలోని కీలక నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. మేకపాటి శ్రీకీర్తికి మంత్రి పదవి కట్టబెట్టడం వల్ల చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తోందనే ఓ చర్చ సైతం తాడేపల్లి ప్యాలెస్ సాక్షిగా వైరల్ అవుతోంది. ఇటీవల మేకపాటి గౌతమ్ రెడ్డి సంస్మరణ సభ జరిగింది. ఈ సభలో సీఎం జగన్ పాల్గొని.. చిన్ననాటి నుంచి గౌతమ్ రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని సభ వేదికపై నుంచి వివరించారు. అలాగే కాంగ్రెస్ పార్టీని వీడి.. తాను కొత్త పార్టీ స్థాపించినప్పుడు.. గౌతమ్ వల్లే .. ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి తనకు మద్దతుగా నిలిచారని సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. గౌతమ్ రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం కూడా తానేనంటూ సీఎం జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబానికి పార్టీతో పాటు అంతా అండగా ఉంటామని సీఎం జగన్ భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేబినెట్‌లోకి శ్రీకీర్తిని తీసుకుంటారంటూ సోషల్ మీడియాలో వైయస్ఆర్ సీపీ కేడర్ జోరుగా చర్చించుకొంటూంది. ఆమెకు పవర్ ఫుల్ శాఖను కట్టబెట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. మరోవైపు ఈ ఉప ఎన్నికల్లో మేకపాటి ఫ్యామిలీ అభ్యర్థి బరిలోకి దిగితే.. తమ అభ్యర్థిని నిలపకూడదని ఇప్పటికే ప్రతిపక్ష టీడీపీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇంకో వైపు.. ఇదే జిల్లాకు చెందిన కొవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిని కూడా జగన్ కేబినెట్‌లోకి తీసుకుంటారని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగన్ పార్టీలో ఉన్న సీనియర్లలో ఆయన కూడా ఒకరన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు వ్యవసాయ లేదా భారీ నీటి పారుదల శాఖను కేటాయించే అవకాశం ఉందని సమాచారం