కర్నూలు, ఏప్రిల్ 1,
మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ తాజాగా ఒంటరయ్యారనే టాక్ కర్నూలు జిల్లాలో మస్త్ మస్త్‌గా వైరల్ అవుతోంది. గత కొంతకాలంగా కోర్టు కేసులతో పాటు పలు వివాదాలు ఆమెను చుట్టుముట్టాయి. దాంతో ఆమె పలు సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భూమా ఫ్యామిలీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్లు సమాచారం. ఆ క్రమంలో భూమా ఫ్యామిలీతో పాటు వారి బంధువర్గం.. అఖిల ప్రియను పూర్తిగా పక్కన పెట్టినట్లు ఓ టాక్ అయితే జిల్లా వ్యాప్తంగా నడుస్తోంది. అందుకు ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలే సాక్ష్యమనే ప్రచారం కూడా మరోవైపు సాగుతోంది. ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ తల్లిదండ్రులు భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిల విగ్రహాలను సదరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ భూమా కిషోర్ రెడ్డి.. తన సొంత స్థలంలో ఏర్పాటు చేశారు. అయితే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి భూమా అఖిల ప్రియను తప్పించి.. మిగతా వారందరికి ఆహ్వానాలు వెళ్లాయని తెలుస్తోంది.
అయితే తన తల్లిదండ్రుల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పిలుపు లేకపోయినా.. అఖిల ప్రియ వెళ్లడమే కాదు.. కిషోర్‌రెడ్డి కంటే ముందే ఆ విగ్రహాలను ఆమె ఆవిష్కరించారని సమాచారం. ఈ నేపథ్యంలో భూమా ఫ్యామిలీలోని వారంతా అఖిల ప్రియను పూర్తిగా బహిష్కరించారట. మరోవైపు.. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడి నిశ్చితార్థం.. ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు.. అఖిల ప్రియ, ఆమె సోదరుడు జగత్ విఖ్యాతరెడ్డికి తప్ప.. మిగతా వారందరికీ ఆహ్వానాలు వెళ్లాయట. భూమా ఫ్యామిలీకి కాటసాని రామిరెడ్డి సమీప బంధువు. అయితే ఆయన కూడా అఖిల ప్రియను పిలువకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారినట్లు తెలుస్తోంది. కాటసాని రామిరెడ్డి అల్లుడు నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అనే విషయం తెలిసిందే. భూమా బ్రహ్మానందరెడ్డికి అఖిల ప్రియ సోదరి అవుతుంది. అలాగే భూమా నాగిరెడ్డికి ఎంతో ఆత్మీయుడైన ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జస్వితరెడ్డి నిశ్చితార్థ వేడుక కూడా అఖిల ప్రియకు పిలుపు రాలేదట. దీంతో భూమా అఖిల ప్రియను భూమా ఫ్యామిలీతోపాటు ఆమె బంధువర్గం పూర్తిగా దూరం పెట్టారనే విషయం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.