న్యూఢిల్లీ, ఏప్రిల్ 1,
ఉక్రెయిన్‌పై రష్యా దాడి రెండో నెలలోకి ప్రవేశించింది. ఐదు వారాలుగా ఎడతెరపి లేకుండా సాగుతున్న దాడులకు ఉక్రెయిన్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించటం పెద్ద కష్టం కాదు. జరుగుతున్న రక్తపాతానికి ఉక్రెయిన్ ప్రజలు హడలిపోతున్నారు. పిల్లలకు స్కూళ్లు లేవు. వైద్యం లేదు. ముఖ్యంగా వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దేశంలో ఏ ప్రాంతం కూడా సురక్షితం అని చెప్పలేని పరిస్థితి నెలకొంది. రాజధాని కీవ్‌లో దాదాపు కోటి మంది సురక్షిత ప్రాంతాలను వెతుక్కోవటానికి ఇల్లు వీడి వెళ్లిపోయారు. వారిలో చాలా మంది ఉక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాలకు వలసపోగా.. దాదాపు 35 లక్షల మంది దేశ సరిహద్దులు దాటారు. వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు. 60ఏళ్ల లోపు పురుషులు దేశంలోనే ఉండాలని ఉక్రెయిన్ ప్రభుత్వం కోరిందిదేశమైతే దాటుతున్నారు కానీ అక్కడ ఏం చేయాలో, ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. ఈ కష్ట కాలంలో సాయం చేసే చేతుల కోసం చూస్తున్నారు. పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడి సాయం అర్థించాల్సి వస్తోంది. ఇది మానవ అక్రమ రవాణా మాఫియాకు అవకాశంగా మారింది. మహిళలు, చిన్నారులను లక్ష్యంగా చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో కూడా ఉక్రెయిన్ చుట్టు పక్కల ప్రాంతాలలో మానవ రవాణా ముఠాలు చురుకుగా ఉంటాయి. కానీ ఇప్పుడు యుద్ధ కల్లోలం వారి అవకాశాలను పెంచింది.ఈ పరిస్థితులలో దేశం విడిచిన చిన్నారులు ప్రమాదంలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఉక్రెయిన్ ను దాటుతున్న చాలామంది చిన్నారుల వెంట పెద్ద వాళ్లు లేకపోవటం మరింత ఆందోళన కలిగిస్తోంది. చాలామంది చిన్నారులు తప్పిపోతున్నారు. ఒంటరిగా సరిహద్దులు దాటుతున్న వారిలో చాలా మంది ఆచూకీ లేకుండా పోతున్నారు.ఉక్రెయిన్ సరిహద్దులకు అవతల ఇప్పుడు శరణార్ధులే ఎక్కువగా కనిపిస్తున్నారు. చాలా శరణార్ధి శిబిరాలు వెలిశాయి. ఆ శిబిరాలలో ఎక్కువగా మహిళలు, పిల్లలు ఒంటరిగా నిస్సహాయ స్థితిలో కనిపిస్తున్నారు. అక్కడస్వచ్ఛంద కార్యకర్తలు వారికి ఆహారం, దుప్పట్లు ఇచ్చి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తారు. అయితే అక్కడ నిజమైన వాలంటీర్లతో పాటు కొందరు నకిలీ కార్యకర్తలు కూడా ఉంటారు. అందమైన మహిళలకు గాలం వేయటమే వారి పని.ఉక్రెయిన్ శరణార్థులకు పోలిష్ గానీ, ఇంగ్లీష్ గానీ రాదు. ఏం జరుగుతుందో వాళ్లకు చెప్పేవాళ్లు లేరు. పైగా ఆ శరణార్థి శిబిరాలలోకి ఎవరైనా వెళ్లవచ్చు. దానిని అవకాశంగా తీసుకుని కొందరు వ్యక్తులు అందమైన అమ్మాయిల కోసం వెతుకుతారు. వారి కదలికలపై అనుమానం వచ్చి వచ్చిన వారు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. దాంతో ఇప్పుడు శరణార్థి శిబిరాల వద్ద పోలీసుల సంచారం కూడా పెరిగింది. మొదట్లో శరణార్థులకు సహాయం చేస్తామంటూ ప్లకార్డులు పట్టుకుని వాలంటీర్లుగా నటించిన వారు ఇప్పుడు ఎక్కువగా కనిపించడం లేదు. అయినా ఇప్పటికీ అలాంటి వారు చాలామంది వాలంటీర్ల రూపంలో ఉన్నారు.శరణార్థులు ఆయా దేశాలలో ఎక్కడ ఉంటున్నారో నకిలీ వాలంటీర్లు తమ నెట్‌వర్క్ ద్వారా ముందు తెలుసుకుంటారు. తరువాత వారిని కలిసి పరిచయం చేసుకుంటారు. సురక్షిత ప్రాంతాలకు చేరుస్తామని, తమతో రావాలని అంటారు. వినకపోతే బలవంత పెడతారు. అయితే కొందరు మహిళలు ఎలాగోలా వారి వలకు చిక్కకుండా బయటపడుతున్నారు. కానీ చాలా మంది అమాయక మహిళలు ట్రాప్‌లో పడుతున్నారు.అసలే యుద్ధం వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది. కుటుంబాలు చెల్లా చెదురయ్యాయి. ఇప్పటికే అనేక కష్టాలు పడి రక్షణ కోసం వెళుతున్న వారిని హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియా వెంటాడుతోంది. దాంతో వారు భయం భయంగా బతకాల్సి వస్తోంది. అలాంటి వారిని ఆదుకునేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లటంలో సాయపడుతున్నాయి. ఇలాంటి సంస్థలలో ఎక్కువగా మహిళా వాలంటీర్లు ఉండటం బాధితులకు ధైర్యాన్నిస్తోంది. అలాగే వారి ట్రాప్‌లో పడవద్దంటూ ఉక్రెయిన్ ప్రభుత్వం రేడియో ప్రచారం చేస్తూ సరిహద్దులు దాటుతున్న వారిని అలర్ట్ చేస్తోంది.యుద్ధం ముగిసిన తరువాత తాము సొంత దేశానికి వెళ్లిపోతామని చాలా మంది శరణార్థులు అంటున్నారు. అయితే అది ముగియటానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. అప్పటి వరకు వారు ఉండటానికి చోటు, తినడానికి తిండి, పిల్లలకు స్కూలు ఉండాలి. అలాగే బతకడానికి ఏదైనా పని కావాలి. ఈ విషయంలోనే వారు ప్రమాదంలో పడుతున్నారు.శరణార్థులకు అందుతున్న సాయం పూర్తిగా నిజాయితీతో కూడినదని చెప్పలేం. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారు కూడా ఉన్నారు. ఉక్రెయిన్ శరణార్థులకు పోలండ్, జర్మనీ, యూకేలలో చాలామంది చాలామంది ఆశ్రయం ఇస్తున్నారు. ఇందులో చాలామంది మనసులో ఏ చెడు ఉద్దేశాలు లేకపోవచ్చు. కానీ అందరివీ మంచి ఉద్దేశాలని కూడా చెప్పలేం. ఆశ్రయం ఇచ్చిన వారిలో కొందరు శరణార్థి మహిళల గుర్తింపు పేపర్లను తమ వద్ద ఉంచుకుని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు. వారితో ఊడిగం చేయించుకోవాలని చూస్తున్నారు. లైంగిక దోపిడీకి కూడి పాల్పడుతున్నారు. ఇప్పుడు ఇలాంటివి ఇలాంటివి సర్వసాధారణం అయ్యాయి. యుద్ధం ఉన్నా లేకున్నా ఎక్కడైనా ఇవి జరుగుతాయి. కానీ ఉక్రెయిన్ నుంచి పెద్ద ఎత్తున మహిళలు వస్తుండటంతో ఈ దురాగతాలు పెరిగాయి.మరోవైపు ఈ బాధల నుంచి త్వరగా బయటపడాలన్న తొందరలో కొందరు యువతులు తప్పటడుగులు వేసి ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారు. తెలియని వ్యక్తులు పిలిచినా వెళుతున్నారు. తాము వెళుతున్నది పులిబోనులోకి అనే విషయం అప్పుడు వారికి తెలియదు. అలాంటి వారి ట్రాప్‌లో పడవద్దంటూ బాధిత యువతులు తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా సందేశం పంపుతున్నారు. ఏదేమైనా విషాదం నుంచి కూడా లబ్ధి పొందాలనుకోవటం పెద్ద విషాదం.