న్యూఢిల్లీ, ఏప్రిల్ 1,
రష్యా ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా వంట నూనెల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఉక్రెయిన్ ప్రపంచంలోనే అతిపెద్ద పొద్దుతిరుగుడు ఉత్పత్తి చేసే దేశంగా ఉంది. భారతదేశంలో పొద్దుతిరుగుడు నూనెను ప్రాసెస్ చేయడానికి అవసరమైన ముడిసరుకులో 70 శాతం ఉక్రెయిన్ నుంచి, 20 శాతం రష్యా నుంచి వస్తుంది. అయితే ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో సరఫరాలో కనీసం 25 శాతం లేదా 4-6 లక్షల టన్నుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ కొరతవల్ల ఇతర ఎడిబుల్ ఆయిల్‌ధరలు కూడా ప్రభావితం కావచ్చు. దేశంలో ఏటా 230 నుంచి 240 లక్షల టన్నుల వంటనూనెల వినియోగం జరుగుతోంది. ఇందులో రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ వాటా 10 శాతం కాగా, ఇందులో 60 శాతం డిమాండ్ దిగుమతుల ద్వారా సమకూరుతోంది. ప్రస్తుతం, రష్యా, ఉక్రెయిన్ మధ్య వివాదం నెలకు పైగా కొనసాగుతోంది. సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందనే దానిపై ఇంకా అనిశ్చితి ఉంది.దేశీయ ఎడిబుల్ ఆయిల్ ప్రాసెసింగ్ కంపెనీలు బలమైన బ్యాలెన్స్ షీట్ కలిగి ఉన్నాయని.. ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా స్వల్పకాలిక సరఫరా అంతరాయాలను ఎదుర్కోవచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ గురువారం తెలిపింది. అయితే ఇది కంపెనీల ఉత్పత్తి ప్రణాళికపై ప్రభావం చూపనుంది. భారతదేశానికి ఏటా 22-23 లక్షల టన్నుల ముడి పొద్దుతిరుగుడు నూనె అవసరం. పొద్దుతిరుగుడు దిగుమతుల్లో ఉక్రెయిన్ (70 శాతం) అతిపెద్ద వాటాను కలిగి ఉంది. రష్యా (20 శాతం) తరువాత, అర్జెంటీనా, ఇతర దేశాల నుంచి భారతదేశం కూడా పొద్దుతిరుగుడును కొనుగోలు చేస్తుంది. మొత్తంమీద, ఉక్రెయిన్, రష్యాలు ఏటా ఒక మిలియన్ టన్నుల ముడి పొద్దుతిరుగుడు నూనెను ఎగుమతి చేస్తుండగా, అర్జెంటీనా 7 లక్షల టన్నులతో మూడవ స్థానంలో ఉందని క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది.క్రిసిల్ నివేదిక ప్రకారం, దేశీయ ఎడిబుల్ ఆయిల్ ప్రాసెసింగ్ కంపెనీలు సాధారణంగా 30 నుంచి 45 రోజుల వరకు ముడిసరుకును ఉంచుతాయి. కాబట్టి అవి తక్కువ వ్యవధిలో ప్రస్తుత సంక్షోభం ప్రభావాన్ని ఎదుర్కోగల అవకాశం ఉంది. అయితే ఈ ఉద్రిక్తత కొనసాగితే ధరల ప్రభావం చూపడం ప్రారంభమవుతుంది. ఇప్పటికే వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి