న్యూఢిల్లీ, ఏప్రిల్ 1,
రెండు రోజుల క్రితం ఉదయం అన్ని టీవీ ఛానెళ్లు బ్రేకింగ్ న్యూస్‌తో హోరెత్తాయి. సీఎం కేసీఆర్ సడెన్‌గా ఢిల్లీ వెళ్తున్నారనేది ఆ బ్రేకింగ్ సారాంశం. బేగంపేట విమానాశ్రమంలో స్పెషల్ ఫ్లైట్ రెడీగా ఉందంటూ విజువల్స్ కూడా చూపించాయి. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ కూడా హస్తిన వెళ్తున్నారంటూ సెంటిమెంట్ జత చేశాయి. అలా టీవీ ఛానెళ్లు చేసిన హడావుడికి జనాలు హడలిపోయారు. అవునా, కేసీఆర్ మళ్లీ ఢిల్లీ వెళ్తున్నారా? ఎందుకు అంటూ ఆసక్తి కనబరిచారు. పంటి నొప్పి.. చికిత్స.. డాక్టర్.. హాస్పిటల్ అంటూ ఓ వర్షన్ వినిపించాయి ఛానెల్స్. అయ్యో అనుకున్నారు కొందరు. ఇక, కేసీఆర్ ఢిల్లీ టూర్ వెనుక పొలిటికల్ సినారియో కూడా చెప్పాయి మరికొన్ని ఛానెల్స్. ఇంత హంగామా జరిగితే.. అంత హడావుడి చేస్తే.. అసలు కేసీఆర్ ఢిల్లీనే వెళ్లలేదు. ఇవాళ కాదు రేపు అంటూ ఆ తర్వాత వివరణలు వచ్చాయి. ఆ రేపు కూడా తుస్సు మనిపించారు. ముఖ్యమంత్రి అసలు హస్తినకే పోలేదు. ఎందుకు? పదే పదే ఎందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలు క్యాన్సిల్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కూడా ఇలానే జరిగింది. కేటీఆర్ అమెరికా వెళ్లగానే.. సీఎస్‌తో, మంత్రులతో ఫాంహౌజ్‌లో సడెన్ మీటింగ్ పెట్టారు. ఆ తర్వాత ఫలానా రోజున టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ ఉంటుందని.. మంత్రులతో కలిసి కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వరిపై లొల్లి లొల్లి చేస్తారని.. మోదీ అపాయింట్‌మెంట్ అడుగుతారని.. ఇలానే బ్రేకింగ్ న్యూస్‌లు వచ్చాయి. అప్పుడు కూడా ఇప్పటిలానే కేసీఆర్ ఢిల్లీ టూర్ క్యాన్సిల్ అయింది. ముఖ్యమంత్రి ఇక్కడే ఉన్నారు.. మంత్రులను మాత్రం హస్తిన పంపించారు. మోదీ అపాయింట్‌మెంట్ అసలు అడగనే లేదు. ఇటీవల కాలంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన రెండుసార్లు రద్దు కావడానికి కారణం ఏంటి? ఎందుకిలా జరుగుతోందనేది మరింత ఇంట్రెస్టింగ్ పాయింట్.
లేటెస్ట్ టూర్ క్యాన్సిల్‌పై ఢిల్లీలోని అత్యున్నత వర్గాల నుంచి ఓ విషయం తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్.. ఢిల్లీలో ఉండే ఆర్ఎస్ఎస్‌కు చెందిన ప్రముఖ నాయకుడు కృష్ణ గోపాల్ అపాయింట్‌మెంట్ కోసం ట్రై చేశారని సమాచారం. ఆయన టైమ్ ఇస్తారని భావించి.. కేసీఆర్ ఢిల్లీ టూర్ ఫిక్స్ చేసుకున్నారు. అయితే, ఆర్ఎస్ఎస్ మేటర్ కావడంతో విషయం బయటకి పొక్కకుండా.. పంటి నొప్పి అంటూ.. మీడియా అటెన్షన్ డైవర్ట్ చేశారని అంటున్నారు. కృష్ణ గోపాల్ సాయంతో హోంమంత్రి అమిత్‌షాతో మాట్లాడాలనేది కేసీఆర్ యోచనగా తెలుస్తోంది. అయితే, తనను కలిసేందుకు కేసీఆర్‌కు సమయం ఇచ్చిన కృష్ణ గోపాల్.. ఆ తర్వాత ఏమైందో ఏమో ఆ అపాయింట్‌మెంట్ రద్దు చేసుకున్నారట. అందుకే, అంతా సిద్ధమయ్యాక కూడా, మీడియాలో అంతగా బ్రేకింగ్‌లు నడిచాక కూడా.. కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఆకస్మికంగా రద్దు అయిందని అంటున్నారు. మర్నాడు కూడా గట్టిగా ట్రై చేసినా.. కృష్ణ గోపాల్ మాత్రం తెలంగాణ సీఎంకు టైమ్ ఇవ్వలేదని చెబుతున్నారు. ఇదంతా ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న ఆఫ్ ది రికార్డ్ సమాచారం. ఇంతకీ కేసీఆర్ ఆ ఆర్ఎస్ఎస్ నేతలో అమిత్‌షాతో ఏం మాట్లాడాలని అనుకున్నారు? అంత బలంగా లాబీయింగ్ చేయాల్సిన విషయం, అవసరం ఏమొచ్చింది? ఏమై ఉంటుంది? అనే చర్చ కూడా జరుగుతోంది. అందులో అనేక ఆసక్తికర అంశాల ప్రస్తావన వస్తోంది. ఇటీవల, కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితమైన కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీపై తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఐటీ రైడ్స్ జరిగాయి. అందులో పలు కీలక పత్రాలు, పలువురు బినామీల పేర్లు వెలుగు చూశాయని అంటున్నారు. ప్రభుత్వ పెద్దల గుట్టు.. ఆ ఐటీ రైడ్స్‌లో రట్టు అయినట్టు తెలుస్తోంది. ఐటీ నుంచి ఆ వివరాలు ఈడీకి కూడా వెళ్లాయని అంటున్నారు. ఆ విషయం తెలిసే కేసీఆర్ ఉలిక్కిపడుతున్నారని అంటున్నారు.ఇప్పటికే బీజేపీ వర్గమంతా కేసీఆర్‌ను ఈడీ, సీబీఐ, కేసులు, ఆధారాలు అంటూ బాగా బెదిరించే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి మాత్రం దమ్ముంటే ఈడీ రైడ్స్ చేయండంటూ మీడియా ముందు బీజేపీకి సవాళ్లు విసురుతూ పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. లోలోన మాత్రం సీన్ మరోలా ఉందని చెబుతున్నారు. ఆ గుబులుతోనే.. కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌పై దాడుల తర్వాత కేసీఆర్‌లో వర్రీ పెరిగిందని.. కేటీఆర్ కూడా ఇరుక్కునే పరిస్థితి ఉందటంతో మరింత బెదురు మొదలైందని అంటున్నారు. కేటీఆర్ అమెరికా వెళ్లగానే ఫాంహౌజ్‌లో భవిష్యత్ కార్యచరణపై అత్యవసర మీటింగ్ పెట్టిన కేసీఆర్.. మళ్లీ కేటీఆర్ యూఎస్ నుంచి తిరిగిరాగానే.. ఢిల్లీ టూర్ పెట్టుకున్నారని.. ఆ ఆర్ఎస్ఎస్ లీడర్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు చెప్పించాలని ప్రయత్నించారని.. అయితే అది వర్కవుట్ కాకపోవడంతో హస్తిన పర్యటన రద్దు చేసుకున్నారని సమాచారం. పరిస్థితి చూస్తుంటే.. త్వరలోనే కేసీఆర్, కేటీఆర్‌లకు గట్టి షాక్ తప్పకపోవచ్చని అంటున్నారు.