YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎండకాలం మించిన రాజకీయ వేడి

ఎండకాలం మించిన రాజకీయ వేడి

హైదరాబాద్, ఏప్రిల్ 1,
లంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ఢిల్లీ వెళ్లి జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించేందుకు తహతహలాడి పోతున్నారు. ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వదిలి ఢిల్లీలో వాలిపోదామా అనే ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారు. అందుకోసం ఆయన ఏకంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్’ కిశోర్’తో డీల్ సెట్ చేసుకున్నారు. ఆ విషయం కూడా ఆయనే చెప్పారు. అయితే, పీకేతో మనీ డీల్ ఏమీ లేదని, ఆయన ఫ్రీ’గా సేవలు అందిస్తున్నారని చెప్పుకొచ్చారు అనుకోండి అది వేరే విషయం. కేసీఆర్ అలా ఢిల్లీ వైపు చూస్తుంటే, ఢిల్లీ నేతలు తెలంగాణ మీద కన్నేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటమి మొదలు రోజురోజుకు బలహీనమవుతున్నతెరాసని ఓడించి, అధికారాన్ని, సొంతం చేసుకునేందుకు ఎప్పటినుంచో తెలంగాణపై కన్నేసిన బీజేపీ నాయకత్వం ఇక ఇప్పుడు మరింత జోరుగా రాష్ట్రంలో పాగావేసే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఓ వంక సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టిన కమల దళం జాతీయ నాయకత్వం త్వరలో జనంలోకి దూసుకు పోయేందుకు సిద్డంమవుతోంది. ముఖ్యంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిని పెట్టినట్లు తెలుస్తోంది. నిజానికి, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అమిత్ షా తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా తెలంగాణపై దృష్టి కేంద్రీకరిస్తారని పార్టీ నాయకులు ఎప్పటినుంచో చెపుతూనే ఉన్నారు.ఇప్పడు అందులో భాగంగానే, అమిత్ షా, ఏప్రిల్‌లో రెండు సార్లు రాష్ట్రంలో పర్యటించేందుకు ప్రణాళిక సిద్దమైంది. బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్, ఏప్రిల్ 14 నుంచి రెండో విడత పాదయాత్రను ప్రారంభిస్తున్నారు. ఈ యాత్రను అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే, శ్రీరామనవమి రోజు భద్రాచలంలో స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. అదే రోజున అయన హైదరాబాద్’ పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయాన్ని కూడా సందర్శించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. ఏప్రిల్‌ పర్యటనలో అమిత్ షా బీజేపీ తెలంగాణ మిషన్’ విషయంలో అందరికీ క్లారిటీ ఇస్తారని, ఇక అక్కడి నుంచి కార్యాచరణ ప్రారంభమవుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షా వచ్చి వెళ్ళిన తర్వాత బీజేపీ జాతీయ నాయకులూ, కేంద్ర మంత్రులు తెలంగాణ పై దండయాత్ర కొనసాగుతుందని, బండి యాత్ర సాగినంత కాలం ఒకరి వెంట ఒకరుగా కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు యాత్రలో పాల్గొంటారని తెలుస్తోంది.
బీజేపీ విషయం అలా ఉంటే, అంతర్గత కుమ్ములాటలతో సతమత‌మ‌వుతున్న, టీపీసీసీ అధుక్షుడు రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ అధిష్టానం సర్వాధికారాలు ఇచ్చిన నేపధ్యంలో, ఆయన ఏప్రిల్ నెలలో రైతు సమస్యలతో పాటు, విద్యార్ధులు, నిరుద్యోగుల సమస్యల్పి పెద్ద ఎత్తున ఆందోళనలు ప్లాన్ చేస్తున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టింది మొదలు, పార్టీలో జోష్ పెంచేందుకు, శ్రమిస్తూనే ఉన్నారు. అయితే, సీనియర్లు కొందరు, అసమ్మతి కార్యక్రమాలకు తెర తీయడంతో, లంక మేత గోదావరి ఈత’ నట్లుగా ఫలితం లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి ప్రజల్లో, పార్టీ క్యాడర్’లో విశ్వాసం పెంచేందుకు, ఒక భారీ కార్యక్రమం తీసుకున్న వెంటనే సీనియర్, నాయకులూ అసమ్మతి రాగం ఎత్తుకోవడంతో, రేవంత్ పడిన కష్టం పలచనై పోయింది. అయితే ఇప్పుడు అధిష్టానం రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో, సీనియర్ల ‘సెగ’ సగం అయినా తగ్గుతుందని, అంటున్నారు. అలాగే, ఏప్రిల్’లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియ గాంధీ, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించడమే కాకుండా, రేవంత్ రెడ్డికి ఫుల్ పవర్స్ ఇచ్చారు. అలాగే, అసమ్మతి సెగలు రాజేస్తున్న సీనియర్ లీడర్స్’కు సోనియా, రాహుల్ కనీసం అప్పాయింట్మెంట్ అయినా ఇవ్వకుండా, స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో రేవంత్ వర్గంలో  ఉత్సాహం మరింత పెరిగింది. ఏప్రిల్ యుద్దానికి సై అంటున్నాయి. మరోవంక, పంజాబ్’ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కూడా, తెలంగాణ పై దృష్టిని కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ నెల 14 న రాష్ట్రంలో పార్టీ  నాయకురాలు ఇందిర శోభన్ పాదయాత్రను కేజ్రి వాల్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. సో ఏప్రిల్ నెలలో ఎండలే కాదు, రాజకీయ వేడి మండి పోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Related Posts