ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు... ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో ఇప్పుడివే ఊహాగానాలు బాగా చక్కర్లు కొడుతున్నాయి. అదేంటీ.. 151 అసెంబ్లీ సీట్లతో తిరుగులేని మెజార్టీతో జెండా ఎగరేసిన వైసీపీ, ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ముందస్తు ఎన్నిలకు వెళ్లాల్సిన అగత్యం ఏమి ఉంటుందనే డౌట్ కొందరికి రావచ్చు. అయితే.. రాజకీయ వర్గాల్లో మాత్రం 'ముందస్తు ఎన్నికల' అంశమే రోజురోజుకూ చర్చనీయాంశంగా మారుతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెడుతున్న కొత్త కొత్త పథకాలు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనతోనే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారువాస్తవానికి అంత భారీ మెజార్టీతో అధికార పగ్గాలు చేపట్టిన వైసీపీ అధినేత జగన్ రెడ్డికి ముందస్తు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుందని ఎవరూ ఊహించలేరు. అయితే.. జగన్ రెడ్డి గద్దెనెక్కాక చేసిన, ఇప్పటికీ చేస్తున్న కొన్ని తప్పిదాలు, అనాలోచిత నిర్ణయాలు ఆయన సర్కార్ పై జనంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత ముంచుకు వస్తుండడమే ముందస్తు ఆలోచన చేయడానికి కారణం అంటున్నారు. పైగా జగన్ సర్కార్ చేస్తున్న అనవసర ఖర్చుతో ఖజానా ఖాళీ అయిపోయింది. 'అయినవాడికి ఆకులో.. కానివాడికి కంచంలో' చందంగా వైసీపీ సర్కార్ మారిపోయిందంటున్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఆశతో జగన్ ఇచ్చిన హామీలే ఇప్పుడు ఆయన దుంప తెంచుతున్నాయంటున్నారు. నిధుల లేమి కారణంగా ఎంతో గొప్పగా ప్రకటించిన నవరత్నాల అమలు తలకు మించిన భారంగా మారిందంటున్నారు.ఏపీకి కావాల్సినంత ఆదాయం వస్తున్నప్పటికీ.. సరైన ఆర్థిక క్రమశిక్షణ లేనితనంతో ఏపీలో వైసీపీ సర్కార్ నిధుల కొరతకు కారణం అయిందంటున్నారు. ఆదాయం వస్తున్నా.. మాటిమాటికీ ఖజానా ఖాళీ అయిపోతుండడంతో అనేక చెల్లింపులు సమయానికి చేయలేని స్థితిలోకి ఏపీ సర్కార్ వెళ్లిపోయింది. ఫలితంగా రాష్ట్రంలో అనేక పనులు, పథకాలు పెండింగ్ లో పడిపోతున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ వ్యాప్తంగా రోడ్లు ఎంత దారుణంగా తయారయ్యాయో చెప్పనలవి కాదని అంటున్నారు. అంతకు ముందు చేసిన అనేక పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు రోడ్లు వేసేందుకు ససేమిరా అంటున్నారటఇక ఏపీ రాజధాని అమరావతి విషయంలో జగన్ రెడ్డి సర్కార్ మూడుముక్కలాట ఇప్పటికీ మానుకోలేదు. ఒక పక్కన అమరావతే రాజధాని అని కేంద్రం నిర్ధారిస్తూ భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించినా.. మరో పక్కన కోర్టు అమరావతినే రాజధానిగా పేర్కొంటూ తీర్పు చెప్పినా.. మొట్టికాయలు వేసినా 'నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు' అన్నట్లు జగన్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. రాజధాని ప్రాంత రైతుల్ని రెండేళ్లకు పైగా ఉసురుపెట్టిన వైసీపీ సర్కార్ పై వారంతా గుర్రుగానే ఉన్నారు. సమయం వచ్చినప్పుడు సరైన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారంటున్నారు. 'ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరింద'న్నట్లు ఒక్క రాజధాని నగరాన్నే పూర్తిచేయలేని జగన్ రెడ్డి సర్కార్ ఏకంగా మూడు రాజధానుల్ని నిర్మిస్తామనడాన్ని ప్రతిఒక్కరూ తప్పుపడుతున్నారు.కొందరు మంత్రుల మాట తీరు, మరికొందరి నిష్క్రియా పరత్వం, రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలోనూ అభివృద్ధి పనులు అసలే జరగని విధానంతో జనం విసిగిపోతున్నారు. తెలుగుదేశం హయాంలో 90 శాతం పూర్తయిన టిడ్కో ఇళ్లను అందజేయకుండా తాత్సారం చేస్తున్న వైనంతో లబ్ధిదారులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ రెడ్డి సర్కార్ అనాలోచిత నిర్ణయాలు, వైసీపీ నేతల దౌర్జన్యాలతో ఏపీకి వచ్చిన పలు సంస్థలు వెనక్కి వెళ్లిపోతున్న తీరుతో జనంలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పేరుతో వేలాది మంది నిరుద్యోగులతో అతి తక్కువ వేతనంతోనే రెండేళ్లుగా వెట్టి చాకిరీ చేయిస్తుండడంతో వారంతా విసిగివేసారి పోతున్నారు. సచివాలయ వ్యవస్థ నెపంతో ఇంతవరకు ఏపీలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా.. ఒక్కరికీ కూడా ఉద్యోగం రాకుండా చేసిన వైసీపీ సర్కార్ అంటే నిరుద్యోగులు గుర్రుగా ఉన్నారు.మరో పక్కన వన్ టైమ్ సెటిల్మెంట్ పేరుతో ఎప్పుడో గత ప్రభుత్వాలు నిరుపేదలకు ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు పదివేల రూపాయలు వసూలు చేస్తున్న జగన్ రెడ్డి సర్కార్ పట్ల లబ్ధిదారులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఒక పక్కన నిత్యావసర వస్తువుల ధరలు, మరో పక్కన పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకూ పెరిగిపోతూ సామాన్యులు, మధ్యతరగతి ప్రజలనే కాకుండా ధనవంతులు కూడా లబోదిబోమనే దుస్థితి దాపురించింది. మద్యం ధరలు పెంచడం, విద్యుత్, ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచేయడం, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం లాంటి ఎన్నెన్నో విషయాల్లో ఏపీ జనంలో వైసీపీ సర్కార్ పట్ల రోజు రోజుకూ వ్యతిరేకత పెరిగిపోతోంది.అందువల్లే తమ పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల ప్రజల్లో మరింత వ్యతిరేక పెరగక ముందే, ఆగ్రహం కట్టలు తెంచుకునే వరకూ ఆగడం కంటే ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముందస్తు ఎన్నికల ద్వారా అయినా.. మరింతగా డ్యామేజ్ పెరిగిపోకుండా చూసుకోవాలని నిర్ణయానికి జగన్ రెడ్డి సర్కార్ వస్తున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ కొత్తగా 'తల్లీబిడ్డల ఎక్స్ ప్రెస్' పేరుతో పథకాన్ని ప్రారంభించారనే అభిప్రాయాలు వస్తున్నాయి. ముందు చెప్పిన పథకాలను అమలు చేయకుండా కొత్త పథకాల పేరుతో మసిపూసి మారేడుకాయ చేయాలని జగన్ రెడ్డి సర్కార్ ఎత్తులు వేస్తోందని పలువురు ఎత్తిపొడుస్తున్నారు.