వివేక్ వెంకటస్వామికి రాజ్యసభ ఆఫర్. వినగానే ఆసక్తి రేపే విషయమే. తెలంగాణలో బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలేగా మరెలా రాజ్యసభకు పంపించగలరనే అనుమానం రావొచ్చు. బహుషా తెలంగాణ నుంచి కాకుండా.. ఏ యూపీనో, అస్సోం నుంచో పంపిస్తారేమో అనుకోవచ్చు. కానీ, ఆ ఆఫర్ బీజేపీ నుంచి కాకుండా టీఆర్ఎస్ నుంచి వచ్చిందట. అందుకే ఇది ఇంట్రెస్టింగ్ న్యూస్. వీ6 న్యూస్ ఛానెల్, వెలుగు పేపర్‌కి వివేక్ వెంకటస్వామి ఓనర్. ఆ రెండు మీడియాలు నిత్యం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ ఓ ఆట ఆడుకుంటాయి. ప్రభుత్వ వ్యతిరేక వాయిస్‌ను బలంగా వినిపిస్తూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల మోస్ట్ పాపులర్ ప్రోగ్రామ్, ఫుల్ వ్యూయర్ షిప్ ఉన్న తీన్మార్ వార్తలల్ల.. ప్రతీరోజూ కేసీఆర్‌ను, సర్కారును కుమ్మేసే కార్యక్రమం నడుస్తుంటుంది. వీ6 ఛానెల్, వెలుగు పేపర్‌లు.. కేసీఆర్ ఇమేజ్‌ను బాగా డ్యామేజ్ చేస్తుంటాయి. ఇక, హుజురాబాద్ ఎలక్షన్ టైమ్‌లో ఈటలకు ఆ మీడియా ఫుల్‌గా సపోర్ట్ చేయడమూ ఆయన గెలుపునకు ప్రధాన కారణమని అంటారు. కేసీఆర్‌కు తెలంగాణలో ప్రధాన శత్రువులు ఎవరంటే.. రేవంత్‌రెడ్డి-కాంగ్రెస్, బండి సంజయ్-బీజేపీల తర్వాత వీ6 అనే చెబుతుంటారు.అందుకే, .. వీ6, వెలుగును దారిలోకి తెచ్చుకునేందుకు పెద్ద ప్లాన్ వేశారని తెలుస్తోంది. గతంలో వివేక్ వెంకటస్వామి టీఆర్ఎస్‌లోనే ఉండేవారు. ఆయనను కాదని బాల్క సుమన్‌కు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వడంతో వివేక్ అలిగి వెళ్లిపోయారు. టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరారు. కమలం పార్టీలో జాతీయ నేతగా ఎదిగారు. పార్టీలో పలుకుబడి అయితే బానే ఉంది కానీ, పవర్ మాత్రమే అనుకున్నంత లేకపోవడం, కమలదళంలో కోల్డ్‌వార్‌తో ఆయన పూర్తిస్థాయిలో సంతృప్తిగా లేరని అంటుంటారు. వివేక్‌ను ఓసారి కిషన్‌రెడ్డి వర్గం అని.. మరోసారి బండి సంజయ్ టీమ్ అంటూ.. ఆయనకు తెలీకుండానే ఆయన చుట్టూ రాజకీయం జరిగిపోతుంటుంది. వివేక్ చేతిలో బలమైన మీడియా ఉండటంతో.. కవరేజ్ కోసమైనా అంతా ఆయనకు అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. అయినా, ఏదో తెలీని లోటు. తాజాగా, తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. అవి మూడూ టీఆర్ఎస్‌వే. వాటిలో ఒక సీటును కేసీఆర్.. వివేక్ వెంకటస్వామికి ఆఫర్ చేసినట్టు సమాచారం. గతంలో ఏ ఎంపీ టికెట్ కోసమైతే వివేక్.. కేసీఆర్‌ను వీడిపోయారో.. ఇప్పుడు అదే పార్లమెంట్ సీటును గులాబీ బాస్ ఇస్తానంటుండటం ఆసక్తికరం. వివేక్ తండ్రి దివంగత వెంకటస్వామి కాంగ్రెస్‌లో ఏఐసీసీ స్థాయి నేత. వివేక్ కుటుంబానికి ఢిల్లీలోనే పరపతి ఎక్కువ. అందుకే, వివేక్ సైతం రాష్ట్ర స్థాయిలో కాకుండా.. హస్తిన రాజకీయాలపైనే ఆసక్తి. ఇక రాజ్యసభ సీటు రూపంలో వివేక్ వీక్‌నెస్‌ను కేసీఆర్ టార్గెట్ చేశారని.. ఎంపీ సీటు ఎరేసి.. వివేక్‌ను, ఆయనతో పాటు వీ6, వెలుగు మీడియాను తనవైపు తిప్పుకోవాలనే ఎత్తుగడ వేశారని అంటున్నారు. అయితే, బీజేపీలో వివేక్‌కు ఇప్పుడు అంతా బాగుంది. ఆయనకు అధిక ప్రాధాన్యం కూడా ఉంది. బీజేపీలో ఉంటే కింగ్‌లా ఉండొచ్చు.. అదే కేసీఆర్ చెంతన చేరితే బానిసలా పడుండాల్సి వస్తుండి. ఈ విషయం ఈటలలానే, టీఆర్ఎస్ మాజీ సభ్యుడైన వివేక్‌కూ బాగా తెలుసు. గత చేదు అనుభవాలు కూడా ఆయనకు బాగానే గుర్తున్నాయి. కరివేపాకులా వాడి పడేయడంలో కేసీఆర్‌ను మించినవారు ఉండరు. అందుకే, టీఆర్ఎస్ నుంచి వస్తున్న రాజ్యసభ ఆఫర్‌పై వివేక్ వెంకటస్వామి విముఖంగా ఉన్నారని తెలుస్తోంది. కేసీఆర్ ట్రాప్‌లో పడేందుకు ఆయనేమైనా అనామకుడా? వీ6, వెలుగు ఓనర్.. వివేక్ వెంకటస్వామి.