తిరుపతి, ఏప్రిల్ 4,
ఏపీ సీఎం జగన్ రెడ్డి కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించడం మాటేమో గానీ.. అమాత్య పదవి తనకు దక్కుతుందో లేదో.. ఒకవేళ వస్తే ఏ పోర్టుఫోలియో వస్తుందో అనే సందేహాలు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాలో బాగా పెరిగిపోతున్నట్లున్నాయి. జిల్లాల ఈక్వేషన్లు, కులాల సమీకరణాలతో తనను కేబినెట్ పదవి వరించే ఛాన్స్ వస్తోందో రాదో అనే గుబులు కూడా రోజాలో గూడుకట్టుకుంటోందంటున్నారు. జగన్ తొలిసారి కేబినెట్ ను ప్రకటించినప్పుడే రెండున్నరేళ్లకు మంత్రివర్గాన్ని మారుస్తానని చెప్పారు. జగన్ చెప్పిన కొత్త కేబినెట్ ప్రకటించాల్సిన సమయం ఇప్పుడు రానే వచ్చింది.నగరి నియోజకవర్గంలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా.. వైసీపీ చీఫ్ జగన్ తో తనకు ఉన్న చనువుతో అప్పుడే కేబినెట్ బెర్త్ ఆశించారు. అయితే.. అప్పటి సమీకరణాల కారణంగా రోజాకు నిరాశే ఎదురైంది. ఆ తర్వాత కొంతకాలానికి ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చి రోజాను సీఎం జగన్ కాస్త చల్లబరిచారని చెబుతారు. అయితే.. తాజాగా కేబినెట్ రీషఫిల్ లో అయినా తనకు బెర్త్ కన్ ఫాం అని రోజా నమ్ముకున్నారు. ఆ దిశగా రోజాకు జగన్ నుంచి హామీ లభించిందని చెబుతున్నారు.కానీ.. ఏ కారణం చేతనైనా తనకు మంత్రి పదవి ఇప్పుడైనా దక్కకపోతే ఎలా అనే భయం రోజాను వెంటాడుతున్నట్లుంది. అందుకే ఆమె మార్చి నెల మొదటి నుంచీ ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ దేవాలయాలను సందర్శిస్తున్నారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎలాగైనా తనకు కేబినెట్ బెర్త్ దక్కేలా చేయాలని కనిపించిన దేవుళ్లు, దేవతలను మొక్కులు మొక్కుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్కే రోజా శుక్రవారం తెలంగాణలోని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. చాలా కాలం తర్వాత తాను స్వయంభూ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే అవకాశం వచ్చిందని రోజా అన్నారు. యాదాద్రి వైభవాన్ని చూసి మురిసిపోయారు.అంతకు ముందు నుంచే ఆర్కే రోజా ఏపీలోని పలు దేవాలయాలను క్రమం తప్పకుండా దర్శించుకోవడం గమనార్హం. ఇటీవలే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని సువర్ణముఖినది తీరంలో వెలసిన వాయులింగేశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవార్లను రోజా దర్శించుకున్నారు. ముక్కంటి సేవలో పాల్గొన్నారు. పనిలో పనిగా తనకు మంత్రి పదవి దక్కేలా చూడమని స్వామి, అమ్మవార్లను కోరుకున్నారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.మహాశివరాత్రి రోజునే శ్రీకాళహస్తితో పాటు పలు ఇతర ఆలయాలను కూడా ఆర్కే రోజా సందర్శించారు. సత్యవేడు నియోజకవర్గంలోని సురుటుపల్లిలో వెలసిన చరిత్రాత్మక దేవాలయం శ్రీ పల్లి కొండేశ్వరస్వామిని దర్శించుకుని, పూజలు నిర్వహించారు. తన సొంత నియోజకవర్గంలోని నగరి మండలంలో ఉన్న బుగ్గ అగ్రహారంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కాశీవిశ్వేశ్వర- అన్నపూర్ణాదేవి ఆలయంలో పూజల్లో రోజా పాల్గొన్నారు. పుత్తూరు పట్టణంలోని చరిత్రాత్మక శ్రీ కామాక్షిదేవి సమేత సదాశివేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు.మార్చినెల 11న కృష్ణా జిల్లా విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి శుక్రవారం పూజలో రోజా పాల్గొన్నారు. మార్చి 17న ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని బాలా త్రిపురసుందరీదేవి- త్రిపురాంతకేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేశారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్చి 26న కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకుడి సేవలో రోజా పాల్గొన్నారు. కాణిపాకం దేవాలయానికి గోమాతను బహూకరించి, గోపూజ చేశారు. స్వామిని దర్శించుకున్న తర్వాత ఆలయం వెనక ఉన్న నక్షత్ర వనంలో తన నక్షత్రానికి గల వృక్షానికి ప్రత్యేకంగా పూజలు చేశారు. చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో తిరుమల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో కలిసి టీటీడీ కల్యాణ మండపాన్ని ఆర్కే రోజా ప్రారంభించారు.రోజాకు సీఎం జగన్ మటన్, చేపలు, రొయ్యల మినిస్ట్రీ ఇస్తారని, టెన్షన్ పడొద్దని సోషల్ మీడియా వేదికగా కొందరు సెటైర్లు వేస్తున్నారు. మరో పక్కన ప్రస్తుత హోం మంత్రి మేకతోటి సుచరితకు ఉద్వాసన చెప్పి రోజాకు ఆ మంత్రి పదవి ఇస్తారనే పుకార్లు షికారు చేస్తుండడం గమనార్హం.ఎన్ని ఆలయాలు దర్శించుకున్నా, ఎందరు దేవుళ్లకు మొక్కులు మొక్కినా ఎమ్మెల్యే రోజాకు ఎక్కడో ఏదో అనుమానం తన్నుతున్నట్టుంది. పెద్దిరెడ్డి తన మంత్రి పదవికి చెక్ పెడతాడేమో అనే డౌటనుమానం ఆమెను వేధిస్తోంది. అందుకే ఈ సారైనా మంత్రి పదవి దక్కించుకోవాలని జగన్ దగ్గర తన ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో పాటు దేవుళ్లు, దేవతల ఆశీస్సుల కోసం రోజా తాపత్రయ పడుతున్నారని అంటున్నారు.