YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దాహం కేకలు

దాహం కేకలు

జిల్లాను తాగునీటి సమస్య వీడటం లేదు. ఈ ఏడాది కరవు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు నానాటికీ మరింత పెరుగుతున్నాయి. జిల్లాలో 2,378 ఆవాస ప్రాంతాలు ఉంటే సగానికి పైగా ఆవాసాల్లో తాగునీటి సమస్య నెలకొంది. పొదిలి, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి తదితర ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు నెలకున్నాయి. ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలపై ప్రభుత్వం తీవ్రంగా ఉండటంతో అధికారులు వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చేయటానికి నానా హైరానా పడుతున్నారు. గ్రామీణ నీటి సరఫరా అధికారులను ప్రధానంగా పశ్చిమ ప్రాంతానికి పంపించారు.  నిత్యం గ్రామాల్లో తిరిగి ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తితే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా 15 మంది  క్షేత్రస్థాయి అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నా అందుబాటులో ఉన్న సిబ్బందినే ప్రత్యేక విధులకు నియమించారు. నిత్యం గ్రామాల్లో పర్యటించి తాగునీటికి ఇబ్బంది వస్తే జిల్లా కేంద్రానికి నివేదిక పంపేలా చర్యలు తీసుకున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ తీవ్రంగా ఉండటంతో తాగునీటి పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ తదనుగుణంగా చర్యలు తీసుకుంటున్నా సమస్య తీవ్రత తగ్గటం లేదు. నాగార్జున సాగర్‌ కాలువల నుంచి వేసవి తాగునీటి అవసరాలకు 2.5 టీఎంసీల నీటిని విడుదల చేశారు. కాలువల్లో గండ్లు, ఇతర సమస్యలతో నికరంగా 1.3 టీఎంసీల నీరు వేసవి చెరువుల్లోకి చేరినట్లుగా అధికారులు చెబుతున్నారు.

నాగార్జున సాగర్‌ కాలువల పరిధిలో మొత్తం 229 తాగునీటి చెరువులు ఉన్నాయి. వీటిలో నీటి నిల్వ సామర్థ్యం 2,085.91 ఎంసీఎఫ్‌టీ కాగా వేసవిలో వచ్చిన నీటితో నింపుకొంటే 1,584.96 ఎంసీఎఫ్‌టీల నీరు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా 500.95 ఎంసీఎఫ్‌టీ నీరు లోటు ఉంది. 229 చెరువులకు గాను 174 చెరువులనే నింపుకోగలిగారు. కొమ్మమూరు కాలువ పరిధిలో 22 చెరువులకు 141.98 ఎంసీఎఫ్‌టీకిగాను 128 ఎంసీఎఫ్‌టీ నింపారు. గుండ్లకమ్మ జలాశయం పరిదిలోని 40 చెరువులకు 79.37 ఎంసీఎఫ్‌టీ నీటిని నింపారు. గుండ్లకమ్మ పరిధిలో ఇంకా 32 ఎంసీఎఫ్‌టీ నీరు లోటు ఉంది. కేవలం 28 చెరువులకే నీరు అందించారు. నల్లమడ వాగు పరిధిలో తొమ్మిది చెరువులు ఉంటే 21.30 ఎంసీఎఫ్‌టీ నీరు నింపాల్సి ఉంది. జిల్లాలోని వివిధ వనరుల కింద ఉన్న చెరువులకు పూర్తిస్థాయిలో నీటిని అందించలేకపోయారు. మొత్తంగా పరిశీలించినప్పుడు ఈ వేసవి తాగునీటి గండం నుంచి గట్టెక్కాలంటే 600 ఎంసీఎఫ్‌టీల నీరు ఇంకా తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో శ్రీశైలం జలాశయం నుంచి నీరు వచ్చే అవకాశం లేదు. ఇక వర్షాలు కురిస్తేనే తాగునీటికి తిప్పలు తప్పేది.

జిల్లాలో తాగునీటి అవసరాల నుంచి గట్టెక్కేందుకు ట్యాంకర్లతో నీటిని రవాణా చేయటానికి ప్రణాళిక తయారు చేశారు. ప్రస్తుతం జిల్లాలోని 299 ఆవాస ప్రాంతాల్లో తాగునీటిని ట్యాంకర్లతో రవాణా చేస్తున్నారు. మొత్తం 33 మండలాల్లో తాగునీటి సమస్య నెలకొంది. పది నియోజకవర్గాల్లో తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోజూ 3,020 ట్రిప్పుల ద్వారా ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు. 486 ట్యాంకర్లను గ్రామాల్లో ఏర్పాటు చేశారు. కంభం మండలంలోని లింగోజిపల్లిలో, ఔరంగాబాద్‌ గ్రామాల్లో ప్రైవేటు బోర్లను అద్దెక్కి తీసుకొని నీటిని రవాణా చేస్తున్నారు. ఎద్దడి జటిలమయ్యే కొద్దీ ట్రిప్పులను పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. జూన్‌ నాటికి రోజుకు 4,87,716 ట్రిప్పుల ద్వారా నీటిని రవాణా చేయటానికి రూ.30.69 కోట్లు ఖర్చు పెట్టటానికి ప్రణాళిక తయారు చేశారు. వీటితో పాటు ప్రైవేటుగా బోర్లను అద్దెకు తీసుకున్నందుకు రూ.1.6 లక్షలు, వేసవి చెరువులకు నీటిని మోటార్ల ద్వారా నింపినందుకు రూ.4.52 కోట్లు ఖర్చు చేశారు. వేసవిలో రూ.35.23 కోట్లను ఖర్చు చేయనున్నారు. పూర్వపు బకాయిలను చెల్లించేందుకు రూ.39.92 కోట్లు గత ఏడాది బడ్జెట్‌ నుంచి నిధులను విడుదల చేస్తే అందులో రూ.11.95 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాది తాగునీటి నిధులను ఆచి తూచి ఖర్చు చేస్తున్నారు. బోర్లను ఫ్లషింగ్‌ చేయటానికి ఇంకా చర్యలు తీసుకోలేదు. చెడిపోయిన బోర్ల మరమ్మతులకు చర్యలు తీసుకోలేదు. ఓపెన్‌ వెల్‌, డీప్‌బోర్ల లోతు పెంచేందుకు చర్యలు తీసుకోకపోవటం గమనార్హం. జిల్లావ్యాప్తంగా 25,756 బోర్లు ఉంటే వాటిలో 6,030 బోర్లు చెడిపోయాయి. కొన్ని బోర్లు వట్టిపోయాయి. భూగర్భ జలాలు బాగా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే బోర్లకు నీరు అందటం లేదు. మే నాటికి మరో రెండు వేల బోర్లు వట్టిపోయే అవకాశం ఉంది

Related Posts