శ్రీకాకుళం, ఏప్రిల్ 4,
ఏప్రిల్ 11న ఏపీ కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ. జగనన్న టీమ్‌లో ఎవరు ఇన్? ఎవరు అవుట్? అనే ఉత్కంఠ. మంత్రిమండలిపై ప్రజలకు ఎలాంటి ఆశలు లేకపోయినా.. ఎవరున్నా లేకపోయినా జనాలకు ఒరిగేదేమీ లేకున్నా.. వైసీపీ ఎమ్మెల్యేల్లో మాత్రం తీవ్ర ఆసక్తి నెలకొంది. ఎవరికి మంత్రిపదవి వస్తుందో.. ఎవరి పోస్ట్ ఊడుతుందోననే టెన్షన్ కొందరిలో. ఆశావహులు తెగ హైరానా పడుతుంటే.. టెన్షన్‌తో మంత్రుల నరాలు తెగిపోతున్నాయి. జగనన్న మదిలో ఉందెవరో.. ఊడేదెవరో అర్థం కాక బీపీలు పెంచేసుకుంటున్నారు. ఇక కేబినెట్ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారం. జగన్ సీఎం అవగానే.. తమ్మినేనికి మంత్రిపదవి ఖాయమంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ, సీనియర్ ఎమ్మెల్యే సీతారాం స్పీకర్ పోస్టుకు పక్కా సెట్ అవుతారని జగన్ భావించారు. ఆయనకు ఇష్టం లేకపోయినా.. వద్దూ వద్దంటున్నా.. ఒప్పించి మరీ సీతారాంను స్పీకర్ ఛైయిర్‌లో కూర్చోబెట్టారు. మొదట్లో కాస్త ఇబ్బందిగానే కూర్చున్నా.. ఆ తర్వాత ముఖ్యమంత్రి డైరెక్షన్‌లో తెగ రెచ్చిపోయారు. హౌజ్‌ను వన్‌సైడెడ్‌గా నడిపిస్తున్నారనే అపవాదు మూటగట్టుకున్నారు. విపక్షం నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తినా.. తీరు మాత్రం మార్చుకోలేదు. ఇప్పుడు ఏకంగా సీటే మారిపోతానంటూ పట్టుబడుతున్నారట సీతారం. అప్పుడు ఇవ్వమంటే ఇవ్వలేదు. వద్దన్నా స్పీకర్ పోస్టు ఇచ్చారు. ఈసారైనా మంత్రి పదవి ఇవ్వండంటూ జగన్‌కు ఎప్పటినుంచో మొరపెట్టుకుంటున్నారు తమ్మినేని సీతారం. వచ్చేసారి అసెంబ్లీకి వస్తానో రానో తెలీదు.. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ స్టైల్‌లోనే జగన్‌కు రిక్వెస్టుల మీద రిక్వెస్టులు.. మెసేజ్‌ల మీద మెసేజ్‌లు పెడుతున్నారని తెలుస్తోంది. అయితే, సీతారాంకు మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలంటే.. ఆ జిల్లా పొలిటికల్ ఈక్వేషన్ కుదరాలి మరి.శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రస్తుతం ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రి సీదిరి అప్పలరాజులు కేబినెట్‌లో ఉన్నారు. కృష్ణదాస్, అప్పలరాజులో ఒకరిని మంత్రిమండలిలో కొనసాగించవచ్చనే ప్రచారం ఉంది. అదే జరిగితే ఈ జిల్లాలో కొత్తగా ఎవరికీ మంత్రి పదవి దక్కబోదు. ఇద్దరినీ తప్పిస్తే వేరొకరికి పదవి దక్కే అవకాశముంది. అప్పుడు మాత్రమే తమ్మినేని సీతారాంకు ఛాన్స్ దక్కనుంది.సీతారాంకు మంత్రి పదవి ఇస్తే.. ఖాళీ అయ్యే స్పీకర్ పదవికి ధర్మాన కృష్ణదాస్, ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావులలో ఒకరి పేరును పరిశీలించవచ్చు. వీరిలో ఒకరికి సభాపతి స్థానం ఇస్తే తమ్మినేని పేరు మంత్రి పదవి పరిశీలనలో ఉండొచ్చు. ఒకవేళ మహిళలకు ప్రాధాన్యమివ్వాలనుకుంటే రెడ్డి శాంతి పేరు పరిశీలించే అవకాశం ఉంటుంది. అప్పుడిక సీతారాం స్పీకర్‌గానే కొనసాగాల్సి ఉంటుందని అంటున్నారు.