హైదరాబాద్, ఏప్రిల్ 4,
సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ఉలుకుపలుకు లేకుండా, అర్జెంట్‌గా హస్తిన బయలుదేరి వెళ్లారు. సడెన్‌గా కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారంటూ చర్చ జరుగుతోంది. వరిపై యుద్ధం అంటూ ఇప్పటికే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాలుగు రోజుల కార్యచరణ ప్రకటించారు. ఏప్రిల్ 11న హస్తినలో లొల్లి లొల్లి చేసేందుకు గులాబీ దళం షెడ్యూల్ రిలీజ్ చేసింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ వరిపై ఆందోళనలు చేసేందుకు పార్టీ కేడర్‌ను రెడీ చేస్తున్నారు. ఇలా వరిపై పోరుబాట పట్టనున్న సమయంలో కేసీఆర్ హస్తిన పర్యటన ఆసక్తి రేపుతోంది. ఆరోగ్య కారణాల రిత్యా కేసీఆర్ ఢిల్లీ వెళ్లారంటూ చెబుతున్నారు. పంటి నొప్పికి దంత వైద్యున్ని కలిసేందుకే హస్తిన వెళ్లారని అంటున్నా అదంత నమ్మశక్యంగా లేదు. మరి, కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు? అనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్.వరి వర్రీ మొదలైనప్పటి నుంచీ మోదీపై-బీజేపీపై తెగ విరుచుకుపడుతున్నారు కేసీఆర్. సందర్భం లేకున్నా.. సృష్టించుకొని మరీ మోదీని, కమలనాథులను కుమ్మేస్తున్నారు. ప్రెస్‌మీట్లతో పదే పదే విరుచుకుపడుతున్నారు. మరి, ఢిల్లీ వెళ్లి ఏం చేస్తారనేది ఆసక్తికరం. ప్రధాని మోదీని కలుస్తారని అంటున్నారు. ఇప్పటికే పీఎం మోదీ అపాయింట్‌మెంట్ అడిగారని తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి కలుస్తానంటూ కేసీఆర్ నుంచి రిక్వెస్ట్ వెళ్లిందట. మోదీ అనుమతి కోసం హస్తినలో ఎదురుచూస్తున్నారట కేసీఆర్. మరి, ప్రధాని మోదీ.. కేసీఆర్‌ను కలిసేందుకు టైమ్ ఇస్తారా? ఇస్తే.. వారిద్దరి మధ్య ఏం చర్చ జరుగుతుంది?