YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

రక్షిత మంచినీరెక్కడ..?

రక్షిత మంచినీరెక్కడ..?

వేసవి తన ప్రతాపం చూపుతోంది. తాగునీటి అవసరం అధికమయ్యింది. జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో 2,150కుపైగా రక్షిత నీటి పథకాలున్నాయి. శుద్ధి చేసిన జలాలను ప్రజలకు అందించాలి. అధికారులు వాటి నిర్వహణ ఆయా పంచాయతీలకు అప్పగించారు. చాలా చోట్ల క్లోరినేషన్‌ చేయకుండానే తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ప్రజలు ఈ నీటిని తాగకుండా ప్రైవేటుగా ఏర్పాటు చేసిన నీటిశుద్ధి కేంద్రాలపైనే ఆధారపడుతున్నారు. అవి కూడా నిబంధనలు పాటించకుండానే నడిచిపోతున్నాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో  1,200 పైగా నీటిశుద్ధి కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిల్లో అన్ని రకాల అనుమతులు తీసుకొని పనిచేస్తున్నవి కేవలం 14 మాత్రమే.

నిబంధనల ప్రకారం పథకాలను 15రోజులకోసారి శుభ్రపరిచి   క్లోరినేషన్‌ చేయించాలి. శుభ్రపరిచినట్లు ట్యాంకు వద్ద సూచిక ఏర్పాటు చేయాలి. ఆ దిశగా ఎక్కడా అమలు కావడం లేదు. కొన్ని పథకాలనే ఏళ్లతరబడి పట్టించుకోకుండా వదిలేశారు. సరఫరా చేస్తున్న నీటిని శుభ్రపరిచేందుకు ప్రతి పంచాయతీకి కిట్లు పంపిణీ చేశారు. ఒక్కోదానికి రూ. 2,500 వెచ్చించారు. ప్రతీదాంట్లో పలు రకాల రసాయనాలు ఉంటాయి. వాటితో నీటి నాణ్యత, పీహెచ్‌ విలువ, తదితర అంశాలను పరీక్షించి  శుద్ధంగా ఉందని నిర్ధారించిన తరువాతే ప్రజలకు సరఫరా చేయాలి. జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీలకు కిట్లు పంపిణీ చేసినా వాటిని వినియోగిస్తున్న దాఖలాలు లేవు. వీటి వినియోగంపై పంచాయతీ సిబ్బందితోపాటు కార్యదర్శులకు శిక్షణ అందించారు. నిర్వహణతోపాటు పర్యవేక్షణకు గ్రామీణ నీటి సరఫరా విభాగ సిబ్బంది, డ్వాక్రా మహిళలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలతో కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. పర్యవేక్షణ లేదు.. పైగా ఎక్కడా వినియోగించడం లేదు.

విజయవాడలోని రెవెన్యూ, ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు కేంద్రాలపై దాడులు చేశారు. 11 ప్లాంట్లలో అపరిశుభ్ర వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు తేలడంతో వాటిని సీజ్‌ చేశారు. బోరు వేసేందుకు కూడా అనుమతి లేదు. వ్యాపార నిర్వహణకు ఎటువంటి లైసెన్సు కూడా తీసుకోలేదని తేలింది. బీఐఎస్‌ ధ్రువీకరణ పత్రం అసలే లేదు. తూనికలు, కొలతల శాఖ నుంచి అనుమతి తీసుకోలేదు. కొత్తపేటలోని బ్రాహ్మణ వీధిలోని ఓ ప్లాంటులో మురుగు కాలువలోనే మంచినీటి బోరు వేసినట్లు గుర్తించారు. ‌్ర విజయవాడలోని కొన్ని ప్లాంట్లలోని నీటి నమూనాలను తీసి పరీక్షలకు పంపించారు. ఆటోనగర్‌లోని ఓ శుద్ధి కేంద్రంలోని నీరు తాగేందుకు పనికిరాదని తేలింది. ఇందులో క్రిములు ఉన్నట్లు బయటపడింది.

మచిలీపట్నం, తిరువూరు, కైకలూరు, పెడన, ఇబ్రహీంపట్నంలోని చాలావరకూ ప్లాంట్లలో క్యాన్లకు వేసే లేబుల్‌లో కనీస సమాచారం ఉండడం లేదు.  విజయవాడ ఇన్‌కంట్యాక్స్‌ కాలనీలోని నీటిశుద్ధి కేంద్రంలో నీరు సురక్షితం కాదని తేలింది. పీహెచ్‌ ప్రమాణాలకు లోబడి లేదని రుజువైంది. గన్నవరంలోని ప్లాంటులో నీరు తాగడానికి పనికిరావని తేల్చారు.

జిల్లాలోని అన్ని మండలాల పరిధి గ్రామాల్లో ప్రస్తుతం తాగునీటి చెరువులను నీటితో పూర్తిగా నింపారు.  రక్షిత పథకాల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. పర్యవేక్షణ కొరవడటంతో    ప్రజలు కేవలం తాగునీటేతర అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో నీరు రంగుమారి సరఫరా అవుతున్నాయి. కృత్తివెన్ను లాంటి తీర ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు నెలకొన్నాయి.

Related Posts