విశాఖపట్టణం, ఏప్రిల్ 5,
విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో కశ్మీర్, ఊటి అందాలు కనువిందు చేస్తున్నాయి. చింతపల్లి ఏజెన్సీలో ప్రయోగాత్మకంగా చేపట్టిన పూలసాగు..సక్సెస్ ఫుల్గా సాగుతోంది. విరబూసిన రంగురంగుల పూలతో ఇక్కడి వ్యవసాయ పరిశోధన కేంద్రం కొత్త సొబగులు అద్దుకుంటోంది. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అమలు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాజెక్టు ఇప్పుడు విజయవంతంగా సాగుతోంది. స్థానిక రైతులు అధిక ఆదాయం పొందేందుకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టును గతేడాది ప్రారంభించారు. గిరిజన రైతులు అధిక ఆదాయం కోసం వేరే మార్గాలను అనుసరించకుండా.. పూలు, ఇతర పంటల సాగుపై ప్రణాళికలతో ఈ పూల సాగు చేస్తున్నారు.శాస్త్రవేత్తలతో కలిసి ఇక్కడి పరిశోధన కేంద్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ విధానం అమలు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా పూల సాగుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎకరం విస్తీర్ణంలో వివిధ రకాల పూలమొక్కలు సాగు చేస్తున్నారు. గ్లాడియోలస్, తులిప్, గులాబీలు, జర్బరా, డాలీఫ్లవర్స్ వంటి అనేక రకాల పూల మొక్కలను సాగుచేస్తున్నారు. ఈ పూల సాగును పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలోనే చేపడుతున్నారు. ఇక్కడి గిరిజనులు గంజాయి సాగు వైపు వెళ్లకుండా అధిక ఆదాయం వచ్చే పూలు, ఇతర పంటల సాగువైపు అడుగులు వేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రకశ్మీర్, లంబసింగి, ఆంధ్ర ఊటీ అరకు పర్యాటక పరంగా దినదినాభివృద్ధి చెందుతుంది. ఈ క్రమంలో ఇక్కడకు పర్యాటకుల తాకిడి పెరిగింది. గిరిజన రైతులు పూలసాగు ద్వారా మార్కెటింగ్ చేస్తూ అధిక ఆదాయాన్ని పొందవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ పూలసాగును పూర్తిగా ఆర్గానిక్ పద్దతిలోనే చేపడుతున్నారు.