హైదరాబాద్, ఏప్రిల్ 5,
తెలంగాణ గవర్నర్ తమిళిసైను అర్జెంట్‌గా ఢిల్లీ రమ్మంటు కబురు చేసింది కేంద్రం. సోమవారం సాయంత్రమే పాండిచ్చేరి నుంచి హైదరాబాద్ వచ్చిన గవర్నర్.. రాత్రి ఫ్లైట్‌కే హస్తిన వెళ్లాల్సి ఉండగా అది కుదరలేదు. మంగళవారం ఉదయం తమిళిసై ఢిల్లీ ఎంట్రీ. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు పీఎం మోదీతోనూ గవర్నర్ మీటింగ్. మరి, ఇంత అర్జెంట్‌గా గవర్నర్ తమిళిసైని కేంద్రం ఢిల్లీకి ఎందుకు రమ్మన్నట్టు? అంత అత్యవసర పని ఏమున్నట్టు? ఇప్పటికే సీఎం కేసీఆర్ హస్తినలో ఉండగా.. ఇప్పుడు తమిళిసైని సైతం ఢిల్లీకి పిలిపించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. రాజ్‌భవన్‌కు, ప్రగతి భవన్‌కు మధ్య విపరీతమైన గ్యాప్ వచ్చేసింది. రిపబ్లిక్ వేడుకల నుంచి ఉగాది సెలబ్రేషన్స్ వరకూ.. గవర్నర్ బంగ్లాలో అడుగుపెట్టనేలేదు సీఎం కేసీఆర్. గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సెషన్ నిర్వహించి రాజ్‌భవన్‌ను సవాల్ చేశారు. తమిళిసై సైతం తగ్గేదేలే అంటూ.. త్వరలోనే ప్రజాదర్బార్ నిర్వహిస్తానంటూ.. సర్కారును పరోక్షంగా సవాల్ చేశారు. దీంతో ముఖ్యమంత్రి వర్సెస్ గవర్నర్ ఎపిసోడ్ తారాస్థాయికి చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో.. సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి, పీఎం మోదీ అపాయింట్‌మెంట్ కోసం పడిగాపులు పడుతున్న టైమ్‌లో.. గవర్నర్ తమిళిసైని సైతం అర్జెంట్‌గా రమ్మంటు కేంద్రం పిలిపించడం రాజకీయంగా ఏదో కీలక పరిణామం జరగబోతోందనే అనుమానం కలుగుతోందని అంటున్నారు. గవర్నర్ తమిళిసైతో.. కేంద్ర హోంమంత్రితో పాటు, ప్రధాని సైతం మాట్లాడుతారంటూ తెలుస్తోంది. సో.. వాళ్లు ఏం మాట్లాడతారు? గవర్నర్ నుంచి ఏం ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు? అనేది ఆసక్తికరంగా మారింది. రెండు పరిణామాలు జరిగే అవకాశం ఉందని ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి. కేసీఆర్-తమిళిసై మధ్య రాజీ కుదిర్చేందుకే గవర్నర్‌ను హఠాత్తుగా హస్తిన రమ్మన్నారనేది ఓ వర్షన్. ఇప్పటికే రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య చాలా దూరం పెరిగిందని.. వైరం బాగా ముదిరిందని.. ఇదేమంత మంచి పరిణామం కాదని.. కేసీఆర్, తమిళిసైలకు స్పష్టం చేసేందుకే ఢిల్లీ జోక్యం చేసుకోనుందని అంటున్నారు. కాదు కాదు.. కాంప్రమైజ్ అయ్యేదే లే.. ఢిల్లీ దూకుడే అంటూ ఇంకో వాదన. కేసీఆర్ అవినీతిపై దర్యాప్తుకు రంగం సిద్ధం అవుతోందని.. ఇప్పటికే ఇటీవల కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌పై జరిగిన ఐటీ దాడుల్లో కేసీఆర్-కేటీఆర్‌లకు వ్యతిరేకంగా ఆధారాలు లభించాయని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే సీబీఐ, ఈడీ రైడ్స్ జరగనున్నాయని ఢిల్లీ వర్గాల్లో టాక్. అదే జరిగితే.. తెలంగాణ అదుపు తప్పకుండా చూసేలా, అంతా కంట్రోల్‌లో ఉండే విధంగా పర్యవేక్షించేలా.. రాష్ట్ర పరిస్థితులపై సరైన సమయంలో సరైన విధంగా గవర్నర్ స్పందించేలా దిశానిర్దేశం చేసేందుకే తమిళిసైను అర్జెంట్‌గా ఢిల్లీ రమ్మన్నారని కూడా అంటున్నారు. మొత్తానికి సీఎం కేసీఆర్ హస్తినలో ఉన్న సమయంలోనే, గవర్నర్ తమిళిసైను సైతం పిలిపించడం.. మరోవైపు ఏపీ సీఎం జగన్ సైతం ఢిల్లీ పర్యటన.. ఇలా వరుస పరిణామాలు చూస్తుంటే.. ఏదో కీలక రాజకీయమైతే జరగబోతోందని సూచిస్తోంది.