యాదాద్రి
యాదాద్రి దేవస్థానంలో మీడియాపై ఆంక్షలు ఎత్తేయాలని కోరుతూ ఈవో గీతారెడ్డితో మాట్లాడడానికి బైకులతో కొండపైకి వెళ్తున్న జర్నలిస్టులను ఘాట్ రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. జర్నలిస్టులను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ అక్కడే నిరసన తెలపడానికి ప్రయత్నించిన జర్నలిస్టులను అరెస్ట్ చేసి యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో పీఎస్ ఎదుటే బైఠాయించి జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. జర్నలిస్టులకు మద్దతుగా స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల లీడర్లు సంఘీభావం తెలిపి ధర్నాలో కూర్చున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు మాట్లాడుతూ.. దేశంలో ఏ దేవస్థానంలో లేనివిధంగా యాదాద్రిలో మీడియాపై ఆంక్షలు పెట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి ఆలయ ప్రాశస్త్యం ప్రపంచవ్యాప్తం చేయడం కోసం దాదాపుగా రూ.1300 కోట్లతో యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ పునర్నిర్మిస్తే.. అందుకు వ్యతిరేకంగా యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అసలు కొండపైకి మీడియాను అనుమతించకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ సంకల్పానికి వ్యతిరేకంగా ఈవో గీతారెడ్డి వ్యవహరిస్తూ యాదాద్రి ఆలయాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే గీతారెడ్డిని విధుల నుంచి తొలగించి, ఐఏఎస్ క్యాడర్ ఉన్న ఆఫీసర్ ను ఈవోగా నియమించాలని డిమాండ్ చేశారు. అలాగే యాదాద్రిలో మీడియాపై నిషేధాజ్ఞలు ఎత్తేయాలని డిమాండ్ చేశారు.