విజయవాడ, ఏప్రిల్ 5,
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అనుమతి లేకుండా పత్రికా సమావేశం పెట్టడంపై సీరియస్ అయ్యింది. ఇందుకు సంజాయిషీ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీచేసింది. గత నెల 21న పెగాసస్‌తో పాటు తన సస్పెన్షన్ అంశాలపై మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడటంపై వివరణ కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.ఆలిండియా సర్వీస్ రూల్స్‌లోని 6వ నిబంధన పాటించకుండా మీడియా సమావేశం ఏర్పాటు చేశారంటూ ఏబీవీకి నోటీసు ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా ప్రెస్‌మీట్ పెట్టడం తప్పేనని మెమోలో పేర్కొన్నారు. నోటీసు అందిన వారంలోపు వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని సీఎస్ సమీర్ శర్మ పేర్కొన్నారు. గత నెల 21వ తేదీన ఏబీ వెంకటేశ్వర్ రావు ప్రెస్‌మీట్ నిర్వహించడం మరో వివాదానికి దారితీసింది. మరుసటి రోజే నోటీసు జారీ చేసింది ప్రభుత్వం. గత నెలలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసిన వెంకటేశ్వర్ రావు 2019 మే వరకు పెగాసెస్ సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేయలేదంటూ ప్రకటించారు. పెగాసస్‌తో పాటు తన సస్పెన్షన్ అంశాలపై ఆ రోజు మీడియా ముందుంచారు ఏబీవీ. దీనిని ఏపీ సర్కార్ సీరియస్ తీసుకుని సమాధానం ఇవ్వాంటూ నోటీసులు జారీ చేసింది.