YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రోజా జిల్లాల జగడం

రోజా జిల్లాల జగడం

తిరుపతి, ఏప్రిల్ 6,
ఉగాది పర్వదినం పురస్కరించుకుని.. జగన్ ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల ఫ్యాన్ పార్టీలోని ఎమ్మెల్యేలకు కొత్త నొప్పులు మొదలైనాయట. అయితే.. తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలపై తామే పెదవి విప్పితే.. తమ ప్రభుత్వం పరువు తాడేపల్లి ప్యాలెస్‌కూ కూత వేటు దూరంలో ఉన్న కృష్ణానదిలో పడి కొట్టుకు పొతుందని జగన్ పార్టీ ఎమ్మెల్యేలంతా నోటి మీద వేలేసుకుని మరీ అమ్మఓడి పథకం ద్వారా లబ్ధి పొందుతున్న విద్యార్థిలాగా సైలెంట్‌గా కూర్చున్నారట. అయితే ఇదే అంశంపై నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తన నియోజకవర్గం నగరిని.. కొత్తగా ఏర్పాటైన తిరుపతి జిల్లా పరిధిలోకి తీసుకు వెళ్లాలని శతధా ప్రయత్నించిందని.. ఆ క్రమంలో ఈ పంచాయతీని ఆమె ... సీఎం జగన్ వద్దకి ఒకటి రెండు స్లారు కాదు.. ముచ్చటగా మూడు సార్లు స్వయంగా తీసుకు వెళ్లిందట. అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం.. తనదైన శైలిలో.. ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారని సమాచారం. చిత్తూరు జిల్లా రెండుగా అయింది. ఒకటి చిత్తూరు జిల్లాలనే కాగా.. మరొకటి తిరుపతి జిల్లాగా ఏర్పాటు అయింది. అయితే చిత్తూరు జిల్లాలో రోజా నియోజకవర్గం నగరితోపాటు జి. నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి.. రోజాకి రాజకీయ వైరం ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదే విషయం సీఎం జగన్‌కి కూడా తెలుసన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అదీకాక.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా చాలా సీనియర్.. చంద్రబాబు సొంత ఇలాకా కుప్పంలో.. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఫ్యాన్ జెండా రెపరెపలాడిందంటే.. అదంతా.. పెద్దిరెడ్డి వారి చలవేనన్న విషయం కూడా తెలుగు ప్రజలందరికీ తెలిసిందే. జగన్ రాజకీయ ప్రత్యర్థి.. చంద్రబాబు రాజకీయా భవితవ్యానికి పెద్దిరెడ్డి వారితో చెక్ పెట్టించాలనే కృత నిశ్చయంతో సీఎం జగన్ ఉన్నారు. అందుకే ఆ విషయంలో పెద్దిరెడ్డి వారి మాట.. జగనన్నకి చద్దన్నం మూట అన్న సంగతి ఆ పార్టీలోని కీలక నేతలకే కాదు.. ఆర్కే రోజాకు కూడా బాగా తెలుసు. అందుకే.. తన జిల్లాలో పెద్దిరెడ్డి వారు ఉంటే.. తనకు రాజకీయంగా దెబ్బ అని విషయం రోజాకి బాగా అర్థమైందీ. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గాన్ని తిరుపతికి తరలించుకుపోవాలని.. సీఎం జగన్‌ను కలిసి ఎన్ని సార్లు విన్నవించుకున్నా.... ఫలితం లేకపోవడంతో.. ఆర్కే రోజా ఆందోళన రోజుకు రోజుకు తీవ్రమవుతోందట. ఇదే అంశంపై మళ్లీ జగన్‌ను కలిసి.. విన్నవించుకునేందుకు.. ఈ ఆర్కే రోజా వారు.. రోజూ తాడేపల్లి ఫ్యాలెస్ చుట్టు ప్రదక్షణాలు చేస్తున్నారనే చర్చ కూడా సదరు ప్యాలెస్ సాక్షిగా వైరల్ అవుతోంది. కొత్త కేబినెట్‌లో మంత్రి వచ్చినా.. రాకపోయినా... ఫర్వలేదు కానీ.. తన నియోజకవర్గాన్ని మాత్రం శ్రీవారి జిల్లాలో కలపాలంటూ తన సన్నిహితుల వద్ద రోజా తన మనస్సులోని మాటకు బయటపెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల రోజా.. పలు దేవాలయాలను వరుసగా కీ ఇచ్చిన బొంగరంలా చుట్టేస్తోంది. జగన్ కేబినెట్‌లో చోటు కోసమే ఆమె ఈ దేవాలయాల ప్రదక్షణ అంటూ అటు మీడియాలోనే కాదు..ఇటు సోషల్ మీడియాలో సైతం తెగ వైరల్ అవుతోంది. కానీ రోజా దేవాలయాల ప్రదక్షణ వెనక ఇంత కథ ఉందా ? అని నగరిలోని ఆ పార్టీ నేతలే ముక్కన వేలేసుకుంటున్నారట. ఇప్పటికే నగరి నియోజకవర్గంలోని అయిదు మండలాల్లోని రోజా వ్యతిరేకవర్గాన్ని ఒకే తాటిపైకీ తీసుకురావడంలో.. పెద్దిరెడ్డి వారు వేసిన పాచికా .. పారింది. దీంతో ఆర్కే రోజా ఎంత ఉక్కిరి బిక్కిరి అవుతున్నారో అందరికీ తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో ఆర్కే రోజా.. మనస్సులోని కోరికను సీఎం జగన్ తీరుస్తారా? అంటూ పెద్దిరెడ్డి వర్గం వారు వ్యంగ్యంగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. ఆర్కే రోజాను సీఎం జగన్ బాగా ఫిక్ చేశారంటూ ఆదే వర్గం వారు లోలోన సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి రోజా కోరికను సీఎం జగన్ తీరుస్తాడా? అంటే ఏమో చూడాలని ఆమె వర్గం వారు వెయ్యి కళ్లతో తిరుపతి జిల్లాలోని శ్రీవారిపైపు ఆశగా ఎదురు చూస్తున్నారు.

Related Posts