విజయవాడ, ఏప్రిల్ 6,
ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీలిక వైపుగా అడుగులు వేస్తోందా? ఇంతవరకు తెరచాటున, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చంకెక్కి కూర్చున్న, వైసీపీ అనుకూల వర్గం, ఇప్పుడు బహిరంగంగానే వైసీపీకి బీ’టీమ్ అనిపించుకునేందుకు ఆరాట పడుతోందా? అందుకూ అవుననే సమాధానమే వస్తోంది. అలాగే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్,తెలుగు దేశం పార్టీతో చేతులు కలిపితే, ఆయనతోనూ తెగతెంపులు చేసుకునేందుకు సిద్డమవుతోందా, అంటే అందుకూ అవుననే సమాధానమే వస్తోంది. నిజానికి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మొదటినుంచి కూడా తెలుగు దేశం, వ్యతిరేక స్టాండ్ తీసుకోవడం తెలిసిన విషయమే.అదేమిటో కానీ, సోము వీర్రాజు ప్రభుత్వం మారి మూడు సంవత్సరాలు అయినా.. ఇంకా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అనే భ్రమల్లో ఉన్నట్లు వ్యవహరిస్తున్నారు అని పించేలా చంద్రబాబు పైనే ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని ప్రకటించడం ద్వారా పవన్ కళ్యాణ్ ఇప్పటికే టీడీపీతో పొత్తు పక్కా, అనే సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో బీజేపీ రోడ్ మ్యాప్ గురించి మట్లాడడం ద్వారా 2014లో లాగా మళ్ళీ బీజేపీ, తెలుగు దేశం, జనసేన ఉమ్మడిగా పనిచేయాలనే సంకల్పాన్ని వ్యక్తపరిచారు. ఈ నేపధ్యంలోనే సోము వీర్రాజు వర్గం, ‘ఒంటరి పోరాటం’ అనే కొత్త రాగం ఎత్తుకుంది.నిజానికి బీజేపీ కేంద్ర నాయకత్వం, పొత్తుల గురించి ఇప్పుడే మాట్లాడవద్దని, ఎన్నికలు వచ్చినప్పుడు, అప్పటి పరిస్థితిని బట్టి కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని, అంతవరకు జనసేనతో కలిసి వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనచేయాలని ఆదేశించింది. అయితే, వీర్రాజు వర్గం, అందుకు విరుద్ధంగా, అధికారంలో ఉన్న వైసీపీని వదిలేసి టీడీపీ వ్యతిరేక ప్రచారం సాగిస్తున్నారు. నిజానికి, ఏపీలో బీజేపీకి ఉన్న బలం ఎంతో అందరికీ తెలిసిన విషయమే. బీజేపీ రాష్ట్రంలో ఎవరితో అయినా పోటీ పడగలదు అంటే, అది ఒక్క నోటా’తో మాత్రమే. అయినా, సోము వీర్రాజు ఎక్కువగా ఉహించుకుంటున్నారో ఏమో కానీ, అవసరమైతే ఒంటరిగా పోటీ చేస్తాం’ అని బింకాలు పోతున్నారు. ఒంటరిగా పోతే ఏమవుతుందో, తెలియని విషయం కాదు. బీజేపీ 2019 ఎన్నికలో ఒంటరిగానే పోటీ చేసింది. ఒక్క సీటు కాదు ఒక్క సీట్లో డిపాజిట్’ కూడా రాలేదు.అయినా ఒంటరిగా పోటీ చేస్తామంటే అది వేరే విషయం, కానీ, అరాచక పాలనతో రాష్ట్రాన్ని వినాశనం దిశగా పరుగులు తీయిస్తున్న వైసీపీకి మేలు చేసే విధంగా ప్రవర్తించడం, ఏమిటని పార్టీలోనే చర్చ మొదలైంది. జనసేన పార్టీని కూడా దూరం చేసే వ్యూహాన్ని సోము వీర్రాజు అమలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ – జనసేన పొత్తులో ఉన్నా కేవలం సోము వీర్రాజు వ్యవహారశైలి వల్లనే ఆ రెండు పార్టీలు కలసి పని చేయలేకపోతున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. సోము వీర్రాజు అనుసరిస్తున్న వైసీపీ అనుకూల ధోరణిని, పార్టీలోని మెజారిటీ వర్గం వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సోము వీర్రాజును అధ్యక్ష పదవి నుంచి తప్పించాలనే డిమాండ్ రోజు రోజుకు బలం పుంజుకుంటోంది. అలాగే, ఆయన తీరు మార్చుకోవాలని బీజేపీలోని ఓ వర్గం కోరుతోంది, కాదంటే, పార్టీకి గుడ్ బై చెప్పేందుకు కూడా సిద్డంవుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే అసలే అంతంత మాత్రంగా ఉన్న కమల దళం, ఎన్నికలకు ముందే వాడి పోవడం ఖామని అంటున్నారు.