YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

లక్ష్యానికి దూరంగా సేకరణ

లక్ష్యానికి దూరంగా సేకరణ

విజయవాడ, ఏప్రిల్ 6,
రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్‌ సీజన్‌లో రైతాంగం నుంచి కేవలం 38,71,976 టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించింది. సేకరించిన ధాన్యం విలువ రూ.7,532.74 కోట్లు. రైతాంగం నుంచి 50 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన కేవలం పేపర్లకే పరిమితమైంది. దీనివల్ల రైతాంగం తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. దళారుల చేతిలో దారుణంగా మోసానికి గురవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. జనవరి రెండో వారం నుంచి ఖరీఫ్‌ ధాన్యం సేకరణ మందగించింది. అప్పటికే రూ.3 వేల కోట్లు వరకు రైతులకు ప్రభుత్వం బకాయిలు పెట్టింది. 21 రోజుల గడువు దాటినా చెల్లించలేని పరిస్థితుల్లో అధికారులు సర్వర్లను నిలిపివేశారని రైతులు ఆరోపించారు. అయినా అధికారులు తమకేం పట్టనట్లు మిన్నకుండిపోయారు. విమర్శలు వెల్లువెత్తడంతో మార్చి నెలలో కొంచెంకొంచెం సేకరించిన ప్రభుత్వం లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. మిల్లర్లు, దళారులు రైతులను దోచుకునేందుకు ప్రభుత్వమే మార్గం తెరిచినట్లయ్యింది. క్వింటా ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.1,960 (ఎ గ్రేడ్‌), రూ.1,940 (సాధారణ రకం). మిల్లర్లు, దళారులు రైతుల నుంచి రూ.1,500లకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో వరికుప్పలు నూర్చలేదు. కొన్నిచోట్ల ధాన్యం కళ్లాల్లో ఉన్నప్పటికీ, కొనేవారు లేక దళారులకు అమ్మి మోసపోలేక ప్రభుత్వం కొనకపోతుందా? అని రైతులు ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఖరీఫ్‌ ధాన్యం సేకరణ పూర్తయ్యిందని, రబీ ధాన్యం సేకరణ ప్రారంభంతో రుజు వైంది. ప్రతి గింజా కొనుగోలు చేస్తామని మంత్రులు, అధికారులు చేసిన వ్యాఖ్యలు ప్రకటనలకే పరిమితం కావడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు.2021-22 ఖరీఫ్‌ ధాన్యం 36.74 లక్షల ఎకరాల్లో సాగైంది. దీని నుంచి 83 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. దీనిలో ప్రభుత్వం 5,312 రైతుభరోసా కేంద్రాల నుంచి 38.71 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసింది. దీనివల్ల 6,02,170 మంది రైతులు మాత్రమే మద్దతు ధర పొందారు. వీరిలో 5,21,384 మంది రైతులకు మాత్రమే రూ.6,885.42 కోట్లు ప్రభుత్వం ధాన్యం డబ్బులు చెల్లించింది. మరో 80,786 మందికి రూ.647.32 కోట్లు చెల్లింపులు పెండింగులో ఉన్నాయి. ఇది రూ.800 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. తమ వద్ద ఉన్న ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని వరి కుప్పలు ఇంకా నూర్చని రైతులు వేడుకుంటున్నారు.

Related Posts