అనంతపురం, ఏప్రిల్ 7,
వైసీపీ నేతలంటేనే మనీ మైండెడ్. ఎక్కడ కాసులు ఉంటాయా లాగేసుకుందామా అన్నట్టే ఉంటుంది వారి యవ్వారం. అందుకే అంటుంటారు యదా రాజా తదా నేత అని. ఇప్పటికే కాంట్రాక్టులు, ఇసుక, మట్టి, ఖనిజాలు ఇలా అన్నిటినీ దోచేసుకుంటున్న అధికార పార్టీ నాయకులు.. తాజాగా సొంత పార్టీ నేతలనూ లూటీ చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సొంతపార్టీ కౌన్సిలరే ఆమె ఇంటి ముందు బైఠాయించడం సంచలనంగా మారింది ఎన్నికల్లో కల్యాణదుర్గంలో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు ఉషశ్రీ చరణ్. ఆ సమయంలో ఎన్నికల ఖర్చు కోసమంటూ.. ప్రస్తుతం 9వ వార్డు వైసీపీ కౌన్సిలర్‌గా ఉన్న ప్రభావతి నుంచి ఒక కోటి 56 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఆ అప్పులో రూ.కోటి తిరిగి ఇచ్చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇంకో కోటి రూపాయలు అడిగి తీసుకున్నారు. అంటే మొత్తం అప్పు అలానే ఉంది. ఆ తర్వాత కొన్నాళ్లకు.. ప్రభావతి అడగ్గా అడగ్గా.. రూ.90 లక్షలు తిరిగి ఇచ్చారు. ఇంకా తమకు రూ.66 లక్షలు తిరిగి ఇవ్వాలని అడితే కొందరు అనుచరులను ఉసిగొల్పి భయపెడుతున్నారని కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్‌పై 9వ వార్డు వైసీపీ కౌన్సిలర్ ప్రభావతి దంపతులు ఆందోళనకు దిగారు. సొంతపార్టీ ఎమ్మెల్యేనే తమకు ద్రోహం చేస్తే.. ఇక దిక్కెవరని ఆవేదన చెందుతున్నారు.తమకు జరిగిన అన్యాయంపై కౌన్సిలర్ ప్రభావతి.. ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నించగా.. ఎమ్మెల్యే మనుషులు, పోలీసులు ప్రభావతికి సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించేశారు. ఆ ఆ తర్వాత ఎమ్మెల్యే అనుచరులు తమను వెంబడించి.. మున్సిపల్ ఆఫీసు దగ్గర తమపై దాడికి ప్రయత్నించారని కౌన్సిలర్ దంపతులు భయాందోళనతో నిరసన తెలిపారు. అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగివ్వాలని అడిగినందుకు ఇలా చేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో సీఎం జగన్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని.. ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ నుంచి తమ డబ్బులు ఇప్పించాలని.. వైసీపీ కౌన్సిలర్ ప్రభావతి దంపతులు డిమాండ్ చేస్తున్నారు