YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చివరి ప్రయత్నాల్లో సీనియర్లు

 చివరి ప్రయత్నాల్లో సీనియర్లు

విజయవాడ, ఏప్రిల్ 7,
ఏప్రిల్ 11న ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సీఎం కేసీఆర్ ముహూర్తం నిర్ణయించారు. ఆ ప్రకారం ఆయన పనులను చకచకా చక్కబెడుతున్నారు. ముందుగా ప్రకటించినట్లు ప్రస్తుతం కేబినెట్లో ఉన్న పలువురు సీనియర్లకు ఉద్వాసన చెబుతారనే లీకుల్ని సీఎం జగన్ ఇచ్చారు. దాంతో తమ చేతిలో పదవి లేకపోతే పరువు పోయినట్టే అని పలువురు సీనియర్ మంత్రులు తెగ బాధపడిపోతున్నారని అంటున్నారు. మంత్రి హోదాలో తమ తమ జిల్లాల్లో ఓ వెలుగు వెలిగిన వారు ఇప్పుడు ‘తీసేసిన మంత్రులు’గా ఎలా తిరగ గలమని, నియోజకవర్గం ప్రజలకు ముఖం ఎలా చూపించాలని కిందా మీదా అవుతున్నారంటున్నారు.ఈ నేపథ్యంలో మంత్రి పదవుల నుంచి తమకు ఉద్వాసన తప్పదని రూఢి చేసుకున్న కొందరు మంత్రులు ఇన్ డైరెక్ట్ గా కొద్ది రోజులుగా సీఎం జగన్ కు నిరసన, ఆక్రోశం, ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఒక మంత్రి తాను మంత్రి పదవిలో లేకపోతే ‘విశ్వరూపం’ చూపిస్తానంటారు. మరో మంత్రి తనకు ‘ఇదే చివరి సమావేశం’ అంటారు. మరో మంత్రి తనను పదవి నుంచి పీకేసినా.. తమ జిల్లా నుంచి మరెవ్వరికీ కేబినెట్ బెర్త్ కల్పించవద్దంటారు. మరో మంత్రి అయితే.. తనకు పదవి పీకేసి, తన తమ్ముడికి ఇస్తున్నారని బాధగా చెబుతున్నారు. మరో మంత్రి అయితే.. ఇక జగమొండి జగన్ కు ఏమి చెప్పినా వేస్ట్ అనుకున్నారో ఏమో ‘రోజా’ను మంత్రి చేయొద్దంటూ మెలిక పెడుతున్నారని తెలుస్తోంది.కొత్త కేబినెట్ కొలువు దీరేందుకు మరి కొద్ది రోజులే మిగిలి ఉండడంతో కొందరు సీనియర్ మంత్రుల ‘దింపుడు కళ్లం ఆశ’ను చంపుకోలేక చివరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారనే సమాచారం వస్తోంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తదితరులకు ఉద్వాసన తప్పదని పాలక వైసీపీ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది.చివరిసారిగా సీనియర్ మంత్రులు కొందరు సీఎం జగన్ కు రాయబారాలు నడుపుతున్నట్లు ఊహాగానాలు గుప్పుమంటున్నాయి. ‘అందితే జట్టు అందకపోతే కాళ్లు’ అనే విధంగా కొందరు సీనియర్లు జగన్ ను ప్రత్యక్షంగానో పరోక్షంగానో బతిమాలుకుంటున్నారట. తమను కేబినెట్ లో కొనసాగనిచ్చేందుకు ససేమిరా అని జగన్ అంటే మాత్రం తమ తమ జిల్లాల్లోని తమ వ్యతిరేకవర్గం నుంచి ఎవరికీ మంత్రి పదవి ఇవ్వొద్దంటూ ప్రాధేయపడుతున్నారంటున్నారు. తమకు ఉన్న పోస్టు పోయి.. తమకు వ్యతిరేకవర్గంగా కొనసాగున్న వారిని అందలం ఎక్కిస్తే.. తమ పరిస్థితి ఎంత హీనంగా మారిపోతుందో అనే భయం కొందరు సీనియర్లలో పట్టుకుందంటున్నారు.కొందరు సీనియర్ మంత్రులు తమ ప్రత్యర్థులకు ఇవ్వొద్దని చెబుతుంటే.. మరి కొందరైతే తమను కేబినెట్ నుంచి తప్పిస్తే.. తమ జిల్లాకే చెందిన మరో మంత్రికి ఉద్వాసన చెప్పకపోతే ఎలా అంటున్నారట. కేబినెట్ నుంచి తీసేస్తే ఇద్దర్నీ తీసేయాలని, లేదంటే ఇద్దర్నీ కొనసాగించాలంటూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి మెలిక వేస్తున్నట్లు సమాచారం. ఎందుకుంటే ప్రకాశం జిల్లా నుంచే బాలినేని, ఆదిమూలపు సురేష్ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు తనను పీకేసి, ఆదిమూలపు సురేష్ ను కొనసాగించాలనేది సీఎం జగన్ ఉద్దేశంగా ఉందంటున్నారు. అలాంటి నిర్ణయం సీఎం చేయకుండా బాలినేని తన స్థాయిలో పావులు కదుపుతున్నారట. తనను, సురేష్ ను కూడా కేబినెట్ నుంచి తొలగించి, ఇద్దరూ కొత్తవారికే అవకాశం ఇవ్వాలంటూ ఆయన మరో ప్రతిపాదన కూడా పెట్టారట. ఒక పక్కన తనకు మంత్రి పదవి పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తూనే మరో పక్కన బాలినేని మెలికలు పెట్టడం సీఎం జగన్ కు ఇబ్బందిగా మారిందంటున్నారు.నెమ్మదస్తుడిగా పేరు పొందిన ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేరు కూడా ఉద్వాసన జరిగే జాబితాలో ఉందంటున్నారు. దీంతో ఆయన కూడా పదవిని కాపాడుకునేందుకు చాపకింద నీరులా చివరి ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు.ఏదేమైనా.. కొత్త కేబినెట్ లో ఎవరెవరికి బెర్త్ కన్ఫామ్ చేయాలో సీఎం జగన్ ఇప్పటికే ఒక డెసిషన్ కు వచ్చారని, ఎవరెన్ని యత్నాలు చేసినా పెడచెవిన పెడతారనే ఊహాగానాలు వస్తున్నాయి. తాను అనుకున్నదే చేసి తీరుతారంటున్నారు. కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం చేసే సమయం దగ్గర పడుతున్న కొద్దీ అటు సీనియర్లలోనూ, ఇటు ఆశావహుల్లో కూడా గుండె వేగం పెరిగిపోతోందంటున్నారు. మహిళల విషయానికి వస్తే చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ఛాన్స్ ఇస్తారో.. లేదంటే పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనికి చోటు ఇస్తారో అనే ఉత్కంఠకు ఏప్రిల్ 11న తెరపడుతుంది.

Related Posts