విజయవాడ, ఏప్రిల్ 7
ఆంధ్రప్రదేశ్ లో బూతుల మంత్రి ఎవరంటే.. ఎవరైనా ఠక్కున చెప్పేది పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అని. అంతలా ఉంటాయి మరి ఆయన మీడియాలో కూడా మాట్లాడే బూతులు. కొద్ది రోజుల క్రితం కొడాలి నాని.. ‘మంత్రి పదవి నుంచి తప్పిస్తే నా విశ్వరూపం చూపిస్తా’ అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. అంటే కేబినెట్ రీ షఫిల్ లో తనకు ఉద్వాసన తప్పదని కొడాలి నాని ఫిక్సయ్యారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వ్యాఖ్యల ద్వారా సీఎం వైఎస్ జగన్ రెడ్డికి కొడాలి నాని హెచ్చరిక చేశారా? అనే సందేహాలు కొందరి నుంచి వ్యక్తం అవుతున్నాయి. అసలే బూతుల్లో ఆయన మాస్టర్.. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్నా తన సహజ ధోరణిని విడిచిపెట్టలేదు. ఎప్పుడు ఏ సమయం, సందర్భం వచ్చినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, టీడీపీ నేతలను బూతుపదాలు వాడకుండా మాట్లాడిన పాపాన పోలేదు. అలాంటి బూతుల మంత్రి ఇప్పుడు తనకు మంత్రి పదవి లేకపోతే విశ్వరూపం చూపిస్తాననడం వెనుక ఆయనలో పెరిగిపోతున్న అసహనమే కారణమా? అంటున్నారు. ఇంతకాలంగా మంత్రి పదవిని అనుభవిస్తున్న కొడాలి నానికి ఇప్పుడు ఉద్వాసన తప్పకపోవచ్చట. అందుకే ఇంతకాలమూ టీడీపీ నేతలను తన ధోరణిలో నోటికొచ్చినట్లు మాట్లాడిన కొడాలిలో మరింతగా అసహనం పెరిగిపోతోందంటున్నారు. నిజానికి గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని గతంలో కొంత పట్టు సాధించారు. సొంత వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే.. అడపా బాబ్జీ కొడాలి నానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో ఇంతకాలం కొడాలి నానికి మద్దతుగా ఉన్న బాబ్జీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఇప్పుడు వ్యతిరేకం అయ్యారంటున్నారు. దాంతో పాటు ఇంతకాలం జూనియర్ ఎన్టీఆర్ అండ, ఆయన ఫ్యాన్స్ మద్దతు కొడాలికి ఉండేవి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నానిని పక్కన పెట్టారనే వార్తలు వస్తున్నాయి. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా కొడాలి నానికి సహజంగానే ఉండదంటున్నారు. దానికి తోడు వచ్చే ఎన్నికల్లో కొడాలి నానికి వైసీపీ టిక్కెట్ వచ్చినా.. టీడీపీ నుంచి ఈసారి బలీయమైన కాపు సామాజికవర్గం నుంచి కానీ, నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న యాదవ వర్గానికి గానీ టిక్కెట్ వస్తే.. కొడాలి నానికి విజయావకాశాలు తగ్గిపోతాయంటున్నారు. దానికి తోడు ఈ సారి గుడివాడ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తన అభ్యర్థిని బరిలో దింపితే కాపు సామాజివర్గం ఓట్లు తప్పకుండా నానికి పడే అవకాశాలు ఉండదంటున్నారు. ఇలాంటి అంశాల వల్ల కూడా కొడాలి నానిలో ఫ్రస్టేషన్ మరింత పెరిగిపోయి ఉంటుందంటున్నారు. అందుకే.. తనను మంత్రి పదవి నుంచి తప్పిస్తే విశ్వరూపం చూపిస్తానంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడి ఉండొచ్చంటున్నారు. గుడివాడ నియోజకవర్గంలో తనకు తిరుగు ఉండదని భావించిన కొడాలి నానికి తాజాగా మారుతున్న పరిస్థితులతో అసహనం పెరిగిపోతోందంటున్నారు. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం ఆవిర్భావం నుంచీ తెలుగుదేశం పార్టీ కంచుకోట. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు ఈ నియోజకవర్గం నుంచే తొలిసారి ఎన్నికయ్యారు. గుడివాడ నియోజకవర్గంలో టీడీపీకి ఉన్న పట్టు కారణంగానే కొడాలి నాని గతంలో గెలిచారంటారు. గతంలో గుడివాడలో కొడాలి నాని పట్టు సాధించడం వెనుక సొంత బలం, వైఎస్ జగన్ ప్రభావం, జూనియర్ ఎన్టీఆర్ అండ కారణం అంటారు. వీటిని చూసుకునే ఎలాంటి వారిపైనైనా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడారంటారు. ఇప్పుడు కొడాలి నానికి ఒక్కొక్కరి నుంచీ మద్దతు చేజారిపోతోందంటున్నారు. అందుకే కొడాలిలో అసహనం, ఆవేశం పెరిగిపోతున్నాయి అంటున్నారు. దీనికి తోడు ఇప్పుడు తాజా పరిణామాల్లో మంత్రి పదవి కూడా పోతే ఇక తన మాట చెల్లుబాటు కాదని, నియోజకవర్గంలో పట్టు కోల్పోతాననే ఆందోళన కొడాలి నానిలో కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తం మీద బూతుల మంత్రికి గుడివాడ నియోజవర్గంలో భవిష్యత్ గడ్డుకాలం అవుతుందనే అంచనాలు రాజకీయ వర్గాలు, పొలిటికల్ పండితుల నుంచి వస్తున్నాయి.