YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

కివీస్‌ను చిత్తు చేసిన అఫ్ఘానిస్థాన్..

 కివీస్‌ను చిత్తు చేసిన అఫ్ఘానిస్థాన్..

- న్యూజిలాండ్‌పై అఫ్ఘాన్ సంచలన విజయం..

- 202 పరుగుల తేడాతో..

బ్యాటింగ్, బౌలింగ్‌తో వెన్నువిరిచిన పసికూన

 అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్‌లో పెను సంచలనం నమోదైంది. పసికూన అఫ్ఘానిస్థాన్ జట్టు.. 202 పరుగులు భారీ తేడాతో పటిష్ఠ న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లే ఓవల్ వేదికగా జరిగిన మూడో సూపర్ లీగ్ క్వార్టర్ ఫైనల్‌లో అఫ్ఘానిస్థాన్ బ్యాటింగ్, బౌలింగ్ ధాటికి న్యూజిలాండ్ దగ్గర సమాధానం లేకపోయింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్ఘానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 309 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రహ్మానుల్లా (69, 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్‌(68, 5 ఫోర్లు, ఒక సిక్సర్)లు శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించి పటిష్ఠ పునాది వేశారు.

అప్పటికే అర్ధ సెంచరీ చేసి జోరు మీదున్న రహ్మానుల్లాను సందీప్ పాటిల్ వెనక్కు పంపి న్యూజిలాండ్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే రహ్మానుల్లా తర్వాత వచ్చిన ఇక్రమ్ అలీ ఖిల్ (4)ను ఫెలిక్స్ ముర్రే ఔట్ చేసి రెండో దెబ్బ కొట్టాడు. అయితే, ఆ తర్వాత వచ్చిన బాహీర్ షా (67 నాటౌట్ , 4 ఫోర్లు).. మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్‌తో జత కలిసి న్యూజిలాండ్ బౌలింగ్‌కు ఎదురొడ్డి నిలిచాడు. ఆరంభంలో నిదానంగా ఆడినా ఆ తర్వాత జోరు పెంచేందుకు ప్రయత్నించిన ఇబ్రహీం జద్రాన్‌ను సందీప్ పాటిల్ ఔట్ చేసి మరో బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన దర్విష్ రసూలి (3), నిసార్ వహ్దత్ (20, 4 ఫోర్లు) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరినా.. వారి తర్వాత వచ్చిన అజ్మతుల్లా మాత్రం న్యూజిలాండ్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. కేవలం 23 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. అయితే, ఊపు మీదున్న అజ్మతుల్లా అదే ఊపులో బెన్ లాక్రోజ్ బౌలింగ్‌లో మరో భారీ షాట్ ఆడబోయి రచిన్ రవీంద్ర చేతికి చిక్కాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి బాహీర్ షా.. ఫోర్ కొట్టి ఇన్నింగ్స్‌ను ముగించాడు.

అనంతరం 310 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. ఏ దశలోనూ అఫ్ఘానిస్థాన్‌కు పోటీ ఇవ్వలేకపోయింది. కేవలం 28.1 ఓవర్లు మాత్రమే ఆడి 107 పరుగులకే కుప్పకూలింది. 20 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన న్యూజిలాండ్‌ను మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కతేనే క్లార్క్ (38, 3 ఫోర్లు, సిక్సర్), డేల్ ఫిలిప్స్ (31, 5 ఫోర్లు) ఆదుకునే ప్రయత్నం చేసినా వారి పోరాటం ఓటమి అంతరాన్ని కాస్తంత తగ్గించగలిగిందే తప్ప.. ఓటమిని మాత్రం తప్పించలేకపోయింది. ఆ ఇద్దరు మినహా ఎవరూ చెప్పుకోదగిన స్కోరు చేయలేకపోయారు. నలుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్ అయ్యారు. ఇక, న్యూజిలాండ్‌ను ముజీబ్ జాద్రాన్, ఖాయిస్ అహ్మద్‌లు చావు దెబ్బ కొట్టారు. ముఖ్యంగా ముజీబ్ 8.1 ఓవర్లు వేసి 3 మెయిడెన్లతో 14 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు కీలక వికెట్ల పడగొట్టాడు. ఖాయిస్ అహ్మద్ కూడా నాలుగు వికెట్లు కూల్చాడు. ప్రధానంగా జట్టు ఇన్నింగ్స్‌కు కొంత వరకు వెన్నెముకగా నిలిచిన కతేనే క్లార్ట్, డేల్ ఫిలిప్స్‌ను ఔట్ చేశాడు. అఫ్ఘాన్ ఇన్నింగ్స్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడి.. న్యూజిలాండ్ బౌలింగ్‌ను ఊచకోత కోసిన అజ్మతుల్లాకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. 

Related Posts