న్యూఢిల్లీ, ఏప్రిల్ 7,
కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి మూడు రాజధానులా? ఇదెలా సాధ్యం? ఇది మూర్ఖపు నిర్ణయం అంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. మహారాష్ట్రలో రెండు శాసన రాజధానులు ఉన్నాయి.. వాటినే మేము వృధా అనుకుంటున్నాం.. అలాంటిది మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్ ఎలా సమర్ధించుకుంటారు? అని పవార్ ప్రశ్నించారు. మూడు రాజధానులపై పార్లమెంట్‌లో చర్చకు వస్తే అమరావతికే మద్దతు పలుకుతామని.. తనను కలిసిన అమరావతి రైతులకు హామీ ఇచ్చారు శరద్ పవార్.రాజధాని రైతులు ఢిల్లీలో తమ ఆకాంక్షను అందరికీ తెలియజేస్తున్నారు. మూడు రాజధానులంటూ సీఎం జగన్ ఆడుతున్న మూడు ముక్కలాట గురించి హస్తినలో అన్ని పార్టీల నేతలకు వివరిస్తున్నారు. తాజాగా, కాంగ్రెస్ సీనియర్ నేత కొప్పుల రాజుతో జేఏసీ నేతలు సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కోరారు.ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులతో అమరావతి రైతులు సమావేశమయ్యారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థల కార్యాలయాలను ఏర్పాటు చేయాలని, బిల్డ్ అమరావతికి సహకరించాలని అభ్యర్ధించారు. బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, వైసీపీ ఎంపీ రఘురామరాజు తదితరులను జేఏసీ నేతలు కలుసుకున్నారు. దాదాపు 120 మంది అమరావతి జేఏసీ ప్రతినిధులు ఢిల్లీ వెళ్లారు. బృందాలుగా విడిపోయి పార్టీల నేతలు, మంత్రులను కలుస్తున్నారు. అమరావతే ఏకైక రాజధాని అని హైకోర్టు తీర్పు ఇచ్చిందని, అమరావతి అభివృద్ధికి సహకరించాలని వినతి పత్రాలు ఇస్తున్నారు.