YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు వ్యూహాలు

కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు వ్యూహాలు

హైదరాబాద్, ఏప్రిల్ 7,
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజులుగా ఢిల్లీలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అప్పాయింట్మెంట్ కోసం ఆయన ఎదురు చూస్తున్నారని అధికార, అనధికార వర్గాల సమాచారం. అదలా ఉంటే, తెలంగాణ సీఎం ఢిల్లీలో ఉండగానే, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీతో ఓ గంట సేపు చర్చలు జరిపారు. జగన్ రెడ్డి ప్రధానితో ఏమి చర్చించారు, ఏమిటి అనే విషయం పక్కన పెడితే, అదే సమయంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌’కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఆమె ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీతో సమావేసమయ్యారు. రాష్ట్రంలో గత కొంత కాలంగా, తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా గవర్నర్’ ను అవమాన పరుస్తున్నారనే చర్చ జరుగుతున్న నేపధ్యంలో ఈ భేటి  ప్రాధాన్యతను సంతరించుకుంది. అదొకటి అలా ఉంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ఉండగానే, ప్రధాని నరేంద్ర మోడీ ఇటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిని, అటు తెలంగాణ గవర్నర్’ను ప్రత్యేకంగా ఢిల్లీకి  పిలిపించుకుని చర్చలు జరపడం అనేక ఉహాగానాలకు తావిచ్చేలా ఉందని రాజకీయ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ముందుగా ప్రధాని అప్పాయింట్మెంట్ తీసుకుని ఢిల్లీ వెళ్ళారని ప్రచారం జరుగుతున్నా ఏపీ సీఎం కూడా పీఎంఓ పిలుపు మేరకే ఢిల్లీ వెళ్ళారని అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి  ఉన్న నేపధ్యంలో, ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామలు ఆసక్తికరంగా మారాయి. ప్రధాన మంత్రి, సమతామూర్తి శ్రీ రామానుజుల విగ్రహావిష్కరణనకు హైదరాబాద్’ వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి కనీస మర్యాద పాటించలేదు. కనీస మర్యాదను పాటించకే పోవడం ఒకెత్తు అయితే, ప్రధాని పర్యటనకు వ్యతిరేకంగా తెరాస నాయకులు ప్రదర్శనలు నిర్వహించారు. ఇక అక్కడి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దూరం పెరుగుతూనే వుంది. అదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్’తోనూ కయ్యానికి కాలు దువ్వుతున్న వైనమే కనిపిస్తోంది. గణతంత్ర దినోత్సవ వేడుకలు మొదలు ఉగాది వేడుక వరకు రాజ్ భవన్’ లో జరిగిన ఏ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ఎవరూ హాజరుకాలేదు. అదే విధంగా మేడారం జాతర మొదలు గవర్నర్ దంపతుల యాదాద్రి దర్శనం వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ ఫాలో కాలేదు. ఇప్పుడు ఢిల్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, హైదరాబాద్, అవమాన తిరస్కార క్రమంలో జరుగతున్న పరిణామాల లేక ఇంకేదైనా ఉందా అనేది ఇప్పుడు కీలక అంశంగా మారింది. ఏ నేపధ్యంలో దూకుడు పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్’కు ముకుతాడు బిగించేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో లా అండ్ ఆర్డర్ గవర్నర్ అధికార పరిధిలోకి వస్తుంది. అదే విధంగా, భవనాల పంపకాలు ఇతర వ్యవహరాల్లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం గవర్నర్’ కు కొన్ని విశేష అధికారాలు ఇచ్చిందని అంటున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అటు ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని లైన్లో పెట్టి, గవర్నర్ ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్’కు చెక్ పెట్టేందుకు కేంద్రం పావులు కదుపుతోందని, అందులో భాగంగానే, ప్రధాని మోడీ ఏపీ సీఎం, తెలంగాణ గవర్నర్’ ను ఒకేసారి ఢిల్లీ పిలిపించి చర్చలు జరిపారని, ఒక విధంగా తెలంగాణ ముఖ్యమంత్రిని కట్టడి చేయడంతో పాటుగా, గవర్నర్ పవర్స్ ఏమిటో  రుచి చూపడం కూడా మోడీ, అమిత్ షా వ్యూహంగా చెపుతున్నారు. అయితే ఏది ఏమైనా, కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తదుపరి వ్యూహం ఏమిటి, కేంద్రం ప్రతివ్యూహం ఏమిటి అనే దానిపైనే, భవిష్యత్ పరిణామాలు ఆధారపడి ఉంటాయని అంటున్నారు.

Related Posts