హైదరాబాద్, ఏప్రిల్ 7,
గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ వివాదం ముదిరి తారా స్థాయికి చేరుకుంది. రానున్న రోజుల్లో రాజ్ భవన్ – ప్రగతి భవన్ మధ్య ఎలాంటి వాతావరణం ఉండబోతుంది. రాజ్యాంగబద్ధమైన పదవి రాజకీయాల్లో వివాదంగా మారితే, రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రాజేసింది. దీనిపై టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నదీ.. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.దేశంలో గవర్నర్లకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య వివాదాలు కొత్తేమీ కాదు. చాలా రాష్ట్రాల్లో గతంలో ఇలాంటి వివాదాలు తారాస్థాయికి చేరి విమర్శలు దాటి ధర్నాలు రాస్తారోకోలు చేసుకునే వరకు కూడా వెళ్లాయి. అయితే, కొద్ది రోజుల క్రితం వరకు పుదుచ్చేరిలో కిరణ్ బేడి ఆ రాష్ట్ర గవర్నర్ గా ఉన్నప్పుడు.. ఆ ప్రభుత్వం పూర్తిగా లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవస్థనే వ్యతిరేకించింది. కిరణ్ బేడీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి నారాయణ స్వామి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ వర్సెస్ అక్కడి గవర్నర్ మధ్య వివాదం నిత్యకృత్యంగా మారింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇలాంటి పరిస్థితి కొత్తదనే చెప్పాలి.తెలంగాణలో చివరికి సుదీర్ఘంగా గవర్నర్‌గా పనిచేసిన నరసింహానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రతి విషయంలోనూ గవర్నర్ సలహా తీసుకున్నారు సీఎం కేసీఆర్. అన్ని కార్యక్రమాలకు గవర్నర్‌ను పెద్దదిక్కుగా వ్యవహరించమని కోరేది టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఆ తర్వాత వచ్చిన తమిళసై విషయంలో మాత్రం మొదట్లో మామూలుగానే ఉన్నా.. ఆ తర్వాత విభేదాలు మొదలయ్యాయి. తమిళిసై పూర్తిగా భారతీయ జనతా పార్టీ మైండ్ సెట్ గవర్నర్‌గా టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావించారు. అసలు తిరకాసు ఇక్కడే మొదలైంది. ఈ విషయంలో గవర్నర్‌కు కేసీఆర్ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ మొదలైంది. ఆ తరువాత అనేక అంశాలకు సంబంధించి ఇది స్పష్టంగా కనిపించింది.
ఏకంగా భారత గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని, జనవరి 26న రాజ్‌భవన్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులు ఎవరూ హాజరుకాకపోవడం.. తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు వెళ్లిన గవర్నర్‌కు సరైన స్వాగతం లభించకపోవడం, స్థానిక మంత్రులు మేడారంలో గవర్నర్‌తో పాటు ఉండకపోవడంతో వివాదం మరింత రాజుకుంది. వీటన్నింటిపై బీజేపీ- టీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది. మరోవైపు, ప్రభుత్వం కూడా గవర్నర్ స్పీచ్ లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ముగించింది. ఇందుకు సాంకేతిక కారణాలను చూపించింది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు, రాజ్‌భవన్ అధికారికంగా జరిగిన ఉగాది వేడుకలకు ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ హాజరు కాలేదు. ఉగాది వేడుకల రోజే బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు గవర్నర్ తమిళ సై…ఇక తాజాగా ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు, హోంమంత్రి అమిత్ షాను కలిసి తెలంగాణ ప్రభుత్వ పని తీరును వివరించారు గవర్నర్. ప్రధానిని కలిసి అనంతరం ఆమె రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలందరూ చూస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ వారికి ఉన్న గ్యాప్ వేరు ఇకపై జరగబోయే విషయాలు వేరు అంటున్నారు గవర్నర్ వ్యవస్థపై అవగాహన ఉన్న విశ్లేషకులు. రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిని రాజకీయ కోణంలో చూడ్డమే వివాదాల కారణమని.. గవర్నమెంట్, గవర్నర్ మధ్య దూరం మరింత పెరిగితే అనేక అంశాల్లో అడ్డంకులు ఉంటాయని అంటున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ఆర్డినెన్స్‌లు, అనేక బిల్లులు గవర్నర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. గవర్నర్‌కు సంబంధించిన ప్రోటోకాల్, పర్యటనలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సి ఉంటుంది. ఒకరికొకరు సహకరించకపోతే ఇది తెలంగాణ లాంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు ఇబ్బందికరంగా మారుతుందని అంటున్నారు.