శ్రీకాకుళం
జిల్లాలో జలం కోసం గురువారం బీజేపీ ఉత్తరాంధ్ర జనపోరు యాత్ర ప్రారంభించింది. ఈ సందర్బంగా హిరమండలంలో ఏర్పాటు చేసిన బీజేపీ జనపోరు యాత్ర సభలో పురందేశ్వరి మాట్లాడుతూ బీజేపీ ప్రజలకు సేవ చేయటం కోసమే అధికారంలోకి రావాలని భావిస్తుందన్నారు. మిగతా పార్టీలకు బీజేపీకి చాలా వ్యత్యాసం ఉందన్నారు. ‘సబ్ కా సాత్..సబ్ కా వికాస్’ తమ నినాదమని, ప్రజలు మోదీ నాయకత్వాన్ని విశ్వసించారన్నారు.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో ప్రజలు బీజేపీకి అధికారాన్ని ఇచ్చారని పురందేశ్వరి అన్నారు. వైసీపీ ప్రభుత్వం వంశధార నిర్వాసితులను పట్టించుకోవటం లేదని విమర్శించారు. నిర్వాసితులకు న్యాయం చేస్తామని జగన్ పాదయాత్రలో చెప్పారని, అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచిపోయాయని, ఏం న్యాయం చేశారని ఆమె ప్రశ్నించారు. వంశధార ప్రాజెక్ట్ కోసం భూములు ఇచ్చిన రైతులు వలస వెళ్తున్నారని, మమ్మల్ని ప్రజలు ఆశీర్వదించకపోయినా ప్రజల పక్షాన పోరాడుతామని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ చలవేనన్నారు. కేంద్రం సహకరించకపోతే ఈ సంక్షేమ పథకాలు ఎలా కొనసాగుతాయని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో పేదల ఇళ్లు నిర్మించి వైసీపీ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటోందని పురందేశ్వరి విమర్శించారు.