విజయవాడ, ఏప్రిల్ 8,
ఏపీఎస్ ఆర్టీసీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సుల్లోనే కొరియర్, కార్గో బుకింగ్‌కు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. ఇంతకాలం కొరియర్ సెంటర్‌కు కానీ.. కార్గో బుక్కింగ్ పాయింట్‌కు వెళ్లి అక్కడ తమ పార్సల్స్ పంపించుకోవల్సి వచ్చేది. అయితే.. ఇప్పుడు నేరుగా నిర్ణీత ఆర్టీసీ బస్సులోనే కొరియర్, కార్గో బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించనుంది. ముందుగా మీరు కొరియర్ ఎక్కడికైతే పంపించాలో ఆ బస్సు వద్దకు వెళ్లి నేరుగా కండక్టర్ వద్దే పార్సిల్ బుకింగ్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసుకున్న తర్వాత వెంటనే పార్సిళ్లు గమ్యస్థానాలకు చేరుతాయి. దీని కోసం టిమ్ మెషిన్ల ద్వారా కొరియర్ బుకింగ్ చేయడం.. రశీదు ఇవ్వడం, ఇతర అంశాలపై కండక్టర్లకు ట్రైయినింగ్ ఇస్తున్నారు. కొరియర్ బుకింగ్ మొత్తాన్ని టికెట్ కలెక్షన్ల మొత్తంగా చూపించే వే బిల్లుతో కాకుండా విడిగా నమోదు చేస్తారు. కొరియర్ బుకింగ్‌లు బాగా చేసే కండక్టర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా అందించాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.ఆర్టీసీ బస్సుల్లోనే కార్గో సేవల బుకింగ్‌ను ప్రయోగాత్మకంగా మొదటగా గుంటూరు జిల్లా ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. తర్వాత నెలరోజుల్లోనే దశలవారీగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో 94 ఆర్టీసీ బస్ స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లతోపాటు 422 మంది ఏజెంట్ల ద్వారా కొరియర్, కార్గో బుకింగ్ సేవలు అందిస్తున్నారు.ఏపీఎస్ ఆర్టీసీ రోజుకు సగటున 20,500 బుకింగ్‌ల ద్వారా రూ.40లక్షల రాబడి ఉంది. కాగా 2022–23లో రోజుకు సగటున 40వేల బుకింగ్‌లతో రూ.68లక్షలు రాబడి సాధించాలని టార్గెట్ పెట్టుకుంది. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.250కోట్లు రాబడి సాధించాలని భావిస్తోంది. రాష్ట్రంలో 672 మండలాల్లోని 14,123 గ్రామాలకు ఆర్టీసీ బస్సు సేవలు అందిస్తోంది.