ఏలూరు, ఏప్రిల్ 8,
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించుకొనేందుకు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. 2021 ఖరీఫ్ వరి నూర్పిళ్లు మొదలైనప్పటి నుంచి రైతులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ధాన్యం సేకరణకు సంబంధించిన ఆన్‌లైన్ సైట్లో నమోదు ప్రక్రియను వారం రోజుల క్రితం ప్రభుత్వం నిలిపివేసింది. రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బికె)ల్లో నమోదు లేకపోవడంతో రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడం లేదు. ధాన్యం విక్రయించిన రైతులకు నగదు చెల్లింపుల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. ఖరీప్ ధాన్యం నూర్పిళ్లు వేగవంతమయ్యే సమయంలో గత జనవరి 13, 17, 25 తేదీల్లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిశాయి. దీంతో, నల్లరేగడి భూముల్లో తేమ ఎక్కువైంది. ఖరీఫ్ వరి మాగాణుల్లో రబీలో సాగు చేసిన అపరాలు (మినుము, పెసర) పంటలు చేతికొచ్చాయి. అపరాలు నూర్పిడి పూర్తయ్యాక గత నెల 15 తర్వాత పలు ప్రాంతాల్లో వరి నూర్పిళ్లు ప్రారంభించారు. మార్చి 30న ధాన్యం సేకరణకు సంబంధించిన ఆన్‌లైన్ సైట్‌ను ప్రభుత్వం నిలిపివేసింది. ఆర్‌బికెల్లో కాంట్రాక్టు పద్ధతిలో నియమించిన డేటా ఎంట్రీ ఆపరేటర్లను తొలగించింది. దీనికితోడు వ్యవసాయ శాఖ ఇ-క్రాప్ సైట్‌కు, ధాన్యం సేకరణ సైట్‌కు అనుసంధానంలో లోపాలు ఏర్పడడంతో పలువురి రైతుల పేర్లు ఆన్‌లైన్లో కనిపించడం లేదు. ధాన్యం అమ్ముకునేందుకు అవకాశం లేకపోవడంతో వరి కుప్పలు నూర్చేందుకు కొందరు రైతులు వెనుకంజ వేస్తున్నారు. మరికొంత ధాన్యం నూర్పిడి అనంతరం కళ్లాల్లో నిల్వ ఉండి పోయింది. మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలో 800, గుడివాడ డివిజన్ పరిధిలో 200 టన్నుల వరకు రైతుల వద్ద ధాన్యం నిల్వ ఉండిపోయినట్లు జిల్లా వ్యవసాయశాఖ నివేదిక సిద్ధం చేసి ఫౌరసరఫరాల శాఖకు పంపింది.ఇప్పటి వరకు జిల్లాలో 7.6 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. దీనికిగాను రైతులకు రూ.140 కోట్లు చెల్లించాల్సి ఉంది. తాజాగా ప్రభుత్వం ధాన్యం సేకరణ సైట్‌ను నిలిపివేసింది. ధాన్యం విక్రయించిన 21 రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా, ఆచరణలో అమలు కావడం లేదు. 40 రోజులు దాటినా నగదు జమ కావడంలేదని రైతులు వాపోతున్నారు.