హైదరాబాద్, ఏప్రిల్ 8,
ఢిల్లీపై దండయాత్ర. వరిపై యుద్ధం. కేంద్రంతో జగడం. బీజేపీపై పోరాటం. గులాబీ దండు, రైతులతో కలిసి ఉద్యమం. ఇలా ఎన్నెన్నో మాటలు చెప్పారు. అంతన్నారు.. ఇంతన్నారు. తీరా టైమ్ వచ్చాక తుర్రుమన్నారు. తెలంగాణలో పార్టీ శ్రేణులు రోడ్డెక్కి.. రైతు నిరసన దీక్షల పేరుతో నానా రచ్చ చేస్తుంటే.. గులాబీ బాస్ కేసీఆర్ మాత్రం రాష్ట్రంలో లేకుండా పోయారు. ఢిల్లీలో మకాం వేశారు. హస్తినలో ఏం చేస్తున్నారో ఏమో.. అంతా గప్‌చుప్. మోదీ-అమిత్‌షాలను కలిసేందుకు తెగ ట్రై చేస్తున్నారని.. కానీ, వారు జగన్‌ను, తమిళిసైలకు అపాయింట్‌మెంట్ ఇస్తున్నారు కానీ.. కేసీఆర్‌ను మాత్రం గడప కూడా తొక్కనీయడం లేదు. కొందరు ఆర్ఎస్ఎస్ పెద్దలతో చెప్పించుకొని మరీ.. మోదీని ఎలాగైనా కలిసి తీరాలని కేసీఆర్ తెగ తాపత్రయం పడుతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ విషయం వదిలేస్తే.. ఇదే ఛాన్స్‌గా తెలంగాణలో గులాబీ దండు నానా హంగామా చేస్తోంది. రైతులు, వరి కొనుగోలు పేరు చెప్పి.. రాస్తారోకోలతో నానా న్యూసెన్స్ చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే హైకోర్టు సైతం సీరియస్‌గా రియాక్ట్ అయింది. అధికార పార్టీ అయినా సరే.. ధర్నాలకు పర్మిషన్ తీసుకోవాల్సిదేనని మొట్టికాయలు వేసింది. అయినా, తమ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పాడంటూ.. గులాబీ శ్రేణులు ఎక్కడికక్కడ రోడ్లపై బైఠాయిస్తున్నారు. రహదారులను దిగ్బంధిస్తున్నారు. భారీగా ట్రాపిక్ జామ్‌లకు కారణమవుతున్నారు. టీఆర్ఎస్ రాస్తారోకోలను జనం తీవ్రంగా అసహ్యించుకుంటున్నారు. రోడ్లపై వాహనాల్లో చిక్కుకుపోయిన బాధితులు అధికార పార్టీకి శాపనార్థాలు పెడుతున్నాయి. అసలు సమస్య ఏంటో చాలా మందికి తెలీనే తెలీదు. కేంద్రమేమో రా రైస్ ఎంతంటే అంత కొంటామంటోంది. కేసీఆరేమో వడ్లు కొనాలంటున్నారు. రేవంత్‌రెడ్డి ఏమో గతంలో సీఎం కేసీఆర్ పెట్టిన సంతకం వల్లే ఇప్పుడీ కష్టాలుంటున్నారు. వరిపై ఎవరు రైటో.. ఎవరు రాంగో.. ఎవరిది రాజకీయమో.. ఎవరిది పొలిటికల్ డ్రామానో.. ఓ పట్టాన అర్థం కావట్లేదని అంటున్నారు. అసలు సమస్య ఉందా? లేక, లేని సమస్యను ఉన్నట్టు చూపుతున్నారా? అనే అనుమానమూ ఉంది. ఇక, పార్టీ శ్రేణులకు నాలుగు అంచెల ఉద్యమ కార్యచరణ ప్రకటించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఆయన మాత్రం చల్లగా ఏసీ గదుల్లో సమావేశాలతో సేద తీరుతున్నారు. టీఆర్ఎస్ వర్గాలు మాత్రం రోడ్డెక్కి.. ఎండలో చెమటలు కక్కి.. వరిపై రచ్చ చేస్తున్నారు. రెండు రోజులుగా వరి పోరులో కేటీఆర్ ఎక్కడా కనిపించలేదు. గురువారం మాత్రం సిరిసిల్ల ధర్నాకు మెరుపు తీగలా వచ్చి వెళ్లిపోయారు. ఇక, కవితక్క జాడే లేదు. ట్విటర్‌లో కూస్తున్నారు కానీ, పార్టీ వర్గాలతో కలిసి, రోడ్డు మీదకు వచ్చిందే లేదు. ఇక, సంతోష్‌కుమార్ ఎప్పటిలానే అడ్రస్ లేకుండా పోయారు. హరీశ్ ఒక్కరే కాస్త ఎండకు కందిపోతున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కేడర్ అంతా.. కేసీఆర్-కేటీఆర్ చెప్పారని.. మండుటెండలో వరిపై ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ హంగామా చేస్తుంటే.. కల్వకుంట్ల కుటుంబం మాత్రం పత్తా లేకుండా పోవడంపై విమర్శలు వస్తున్నాయి. బహుషా, దొరలు ఇంటి నుంచి బయటకు రారేమో అంటున్నారు.