హైదరాబాద్, ఏప్రిల్ 8,
ఈ ఏడాది మే లో జరగనున్న తెలంగాణ పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లా విద్యాశాఖాధికారులను మంత్రి సబితారెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉందని, వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని స్పష్టం చేశారు. కాగా ఏప్రిల్ 6న రాష్ట్ర విద్యా సంచాలకుల కార్యాలయంలో అన్ని జిల్లా విద్యాశాఖాధికారులతో ఆమె సమీక్ష జరిపారు. కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో టెన్త్ పరీక్షలను ఈసారి ఆరు పేపర్లతోనే నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.పరీక్ష సమయాన్ని అరగంట పెంచామని, మొత్తం సిలబస్‌లో 70 శాతంలోనే ప్రశ్నలుంటాయని, అధికంగా ఛాయిస్ కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి పరీక్షలు సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. రానున్న విద్యా సంవత్సరం నాటికి పాఠశాలల్లో మార్పు కనిపించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి వరకూ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నందున అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు ఉపాధ్యాయులందరికీ అవసరమైన శిక్షణను విద్యాసంవత్సరం ప్రారంభం నాటికల్లా పూర్తిచేయాలని ఆదేశించారు. టెట్ పరీక్ష నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.