శ్రీకాకుళం, ఏప్రిల్ 9,
వేసవి కారణంగా దేశమంతటా అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అడవుల్లో తీవ్రమైన కార్చిచ్చులు సంభవించే అవకాశాలు ఉన్నాయని ఇంధనం, పర్యావరణం, నీటి వనరుల పర్యవేక్షణ మండలి విడుదల చేసిన అధ్యయనం హెచ్చరికలు జారీ చేసింది. భారతదేశంలో 30 శాతం జిల్లాల్లో తీవ్ర కార్చిచ్చులు సంభవించే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. ముఖ్యంగా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా, ఒడిశాలోని కుందమాల్ జిల్లాలకు కార్చిచ్చుల ముప్పు ఉందని వార్నింగ్ ఇచ్చింది.వరదల నుంచి అనావృష్టికి, అనావృష్టి నుంచి వరదలకు మార్పులు సంభవించే ప్రాంతాల్లో గడిచిన రెండు శతాబ్దాల్లో 89 శాతం కార్చిచ్చులు సంభవించినట్లు సీఈఈడబ్ల్యూ నివేదిక వెల్లడించింది. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా కార్చిచ్చులు చెలరేగడం సహజమేనని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కార్చిచ్చులను నియంత్రించడానికి ప్రభుత్వాలు అధిక నిధులు కేటాయించాలని అభిప్రాయపడింది. అన్యాక్రాంతమైన అటవీ భూముల పునరుద్ధరణ, అటవీ విస్తీర్ణం పెంచడం ద్వారా కార్చిచ్చులను అడ్డుకోవచ్చని.. అడవి బిడ్డల జీవన ఆధారాన్ని కాపాడుకోవచ్చని సీఈఈడబ్ల్యూ ప్రతినిధి అవినాష్ మహంతి సూచించారు.అటు ఇప్పటికే కార్చిచ్చుల కారణంగా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది. మన తప్పిదాల కారణంగా అమెజాన్ అడవులు పునరుద్ధరణకు నోచుకోవడం లేదు. ఇలాగే జరిగితే అడవుల స్థాయి బాగా తగ్గిపోయి గడ్డిమైదానాలుగా మారే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. తొమ్మిది దేశాలలో దాదాపు 50 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అమెజాన్ అడవులకు ఇప్పుడు గడ్డు రోజులు వచ్చాయి.