విజయవాడ, ఏప్రిల్ 9,
గురువారం అర్ధరాత్రి నుంచీ ఏపీలోని పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించింది వైసీపీ సర్కార్. వారాంతపు సెలవులతో పాటు వారంలో మరో రోజు పవర్ హాలిడే ప్రకటించాలని జగన్ రెడ్డి సర్కార్ అర్ధరాత్రి ఆదేశాలిచ్చింది. నిరంతరాయంగా పనిచేసే పరిశ్రమలైతే.. అవి వాడుకునే విద్యుత్ లో 50 శాతం మాత్రమే వినియోగించుకోవాలనే నిబంధన పెట్టింది.ఏపీ ఖజానాలోని నిధులన్నీ విచక్షణా లేకుండా.. ఇష్టం వచ్చినట్లు వాడేసి, ఆనక అప్పుల మీద అప్పులు చేసి, అవి కూడా రాష్ట్ర ఆదాయానికి మించి చేసేసి, ఆపైన బాండ్లను అయినకాడికి కుదవపెట్టేసి, ప్రభుత్వ విభాగాల ఖాతాల్లోని డబ్బులన్నీ తీసేసి, అతి చిన్న గ్రామపంచాయతీల్లోని నిధులూ లాగేసి, సర్పంచ్ ల చేతుల్లో చిప్పలు పెట్టి అడుక్కునేలా చేసిన వైసీపీ సర్కార్ గొప్పల చిట్టా గురించి చెప్పుకునేందుకు ఇంతకన్నా సంగతులేమి ఉంటాయి? అని ఏపీ ప్రజలు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇవన్నీ చాలవన్నట్లు.. ఇప్పుడు తాజాగా పరిశ్రమలపైనా వైసీపీ సర్కార్ క్షుద్ర దృష్టి పడింది. ఇప్పటికే విద్యుత్ కోతల కారణంగా ఉత్పత్తి తగ్గిపోయి విలవిల్లాడుతున్న పరిశ్రమలపై పవర్ హాలిడే బండను కూడా జగన్ సర్కార్ వేయడంపై సర్వత్రా ఆందోళన, ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. అసలే ఉత్తత్తులు తగ్గిపోయి, ఆర్థికంగా నష్టపోయి, కార్మికులు, సిబ్బందికి నెలవారీ జీతాలు ఇచ్చే దారి కనిపించక యజమానులు అల్లాడిపోతున్నారు. తాము నెలంతా కష్టపడి చేసిన పనికి సమయానికి జీతాలు రాక ఇక్కట్లు పడుతున్న కార్మికులు, సిబ్బంది నకనకలాడిపోతున్నారు. ఇప్పటికే అటు పరిశ్రమలు, ఇటు కార్మికులు, సిబ్బంది ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటుంటే.. మూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా ఇప్పుడే పవర్ హాలిడే అమలు చేయాలంటూ జగన్ రెడ్డి సర్కార్ పిడుగు లాంటి ఆదేశాలివ్వడమేంటనే ఆగ్రహం రాష్ట్ర వ్యాప్తంగా వెల్లడవుతోంది.వైసీపీ సర్కార్ చేసిన తాజా ఆదేశాల కారణంగా ఏపీలో పారిశ్రామిక ఉత్తపత్తిపై తీవ్రమైన దెబ్బ పడుతుందని పలువురి నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది. 2014కు ముందు అంటే ఎనిమిదేళ్ల నాటి పరిస్థితులు మళ్లీ ఏపీలో పునరావృతం అవుతున్నాయనే ఆవేదన జనంలో కలుగుతోంది. పరిశ్రమలకు పవర్ హాలిడే అంటే కార్మికుల ఉపాధి అవకాశాలను పెద్ద ఎత్తున దెబ్బతీసేందుకు వైసీపీ సర్కార్ తెగబడిందనే విమర్శలు వస్తున్నాయి. ఏపీకి అసలే పెట్టుబడులు రావడం లేదు. కొత్త పరిశ్రమల ఊసే లేదు. ఉన్న పరిశ్రమలు కూడా ప్రస్తుతం వాడుకుంటున్న విద్యుత్ లో 50 శాతం మాత్రమే వినియోగించుకోవాలని చెప్పడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఏపీ సర్కార్ నిర్ణయంతో కార్మికులు రోడ్డున పడే దుస్థితి వస్తుందనే కనీస పరిజ్ఞానం కూడా లేదా? అంటున్నారు.కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే రెండేళ్లు ఏపీలోని పారిశ్రామిక రంగం ఇబ్బందుల్లో కూరుకుపోయింది. కార్మికులు కూడా ఉపాధి కోల్పోయారు. ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా పరిస్థితులు చక్కబడుతున్నాయనుకుంటుంటే.. జగన్ సర్కార్ పవర్ హాలిడే పేరుతో పిడుగు వేయడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి.ఒక పక్కన రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది. మరో పక్కన విద్యుత్ సరఫరా చేసే సంస్థలకు బకాయిలు చెల్లించకుండా.. సర్కార్ వాటి చేత వాతలు పెట్టించుకుంటోంది. మరో పక్కన బహిరంగ మార్కెట్లో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తోంది. దీంతో సర్కార్ ఖజానాకు మరింత బొక్క పడుతోంది. నెత్తి మీదకు ఆర్థిక భారాన్ని మరింత పెంచుకున్న వైసీపీ సర్కార్ ఇక చేతులెత్తేసి.. పవర్ హాలిడే ప్రకటించడాన్ని అనేక మంది తూర్పారపడుతున్నారు. పవర్ హాలిడే ప్రకటించిన జగన్ సర్కార్ కే సమయం చిక్కితే హాలిడే ప్రకటించాలని ఏపీ జనం నిర్ణయించుకున్నారనే అభిప్రాయాలు సర్వత్రా వస్తున్నాయి. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పినట్లు హాలిడే సీఎం జాలీరెడ్డి మూడేళ్ల పాలన మూడు ముక్కల్లో.. క్రాప్ హాలిడే.. పవర్ హాలిడే.. జాబ్ హాలిడేలతో ఏపీలో అభివృద్ధికి శాశ్వత హాలిడే అన్న మాటలు సందర్భోచితంగా ఉన్నాయంటున్నారు.