YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గల్లా ఫ్యామిలీ దూరమేనా

గల్లా ఫ్యామిలీ దూరమేనా

తిరుపతి, ఏప్రిల్ 9,
గల్లా కుటుంబం సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగుతుంది. కొన్ని దశాబ్దాల పాటు ఆ కుటుంబం ప్రయాణం కాంగ్రెస్ తోనే కొనసాగింది. కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ఆ కుటుంబానికి గౌరవం ఏమాత్రం తగ్గలేదు. అయితే ఇప్పుడు మరోసారి ఆ కుటుంబం వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగుతుందా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీలోనే దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది. అన్ని రకాలుగా బలంగా.... సామాజికంగా, ఆర్థికంగా గల్లా కుటుంబం బలమైనది. గల్లా కుటుంబానికి చంద్రగిరి నియోజకవర్గం పెట్టని కోట. తమ అమరరాజా ఫ్యాక్టరీ కూడా అక్కడే ఉండటం, కార్మికుల కుటుంబాల నుంచి అన్ని సామాజికవర్గాలు ఈ కుటుంబాన్ని ఆదరించడంతో వరస విజయాలతో గల్లా కుటుంబం చంద్రగిరి నుంచి గెలుస్తూ వచ్చేది. 1989 ఎన్నికల్లో గల్లా అరుణకుమారి చంద్రగిరి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. 1994లో నారా రామ్మూర్తినాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గల్లా అరుణకుమారి విజయం సాధించారు. హ్యట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. అయితే 2014లో రాష్ట్ర విభజన జరగడంతో ఆ కుటుంబం టీడీపీలో చేరింది. 2014 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి గల్లా అరుణకుమారి టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆమె కుమారుడు గల్లా జయదేవ్ మాత్రం గుంటూరు ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లోనూ గల్లా జయదేవ్ రెండోసారి ఎంపీగా గుంటూరు నుంచి ఎన్నికయ్యారు. చంద్రగిరి లో ఇప్పటికే పులివర్తి నానిని ఇన్ ఛార్జిగా టీడీపీ అధినాయకత్వం నియమించింది. గుంటూరులోనూ గతంలో ఉన్న అనుకూల పరిస్థితులు ప్రస్తుతం లేవు. గల్లా అరుణకుమారి ఇప్పటికే తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి పొలిట్ బ్యూరో నుంచి కూడా పక్కకు వచ్చేశారు. గుంటూరు ఎంపీగా ఈసారి గల్లా జయదేవ్ పోటీ చేయడం కష్టమేనంటున్నారు. చంద్రబాబు ఆ కుటుంబాన్ని కన్వెన్స్ చేసి పోటీలో కొనసాగిస్తారా? లేదా? అన్నది రానున్న కాలంలో తెలియాల్సి ఉంది.

Related Posts