YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణలో రాజకీయ ఎన్నికల వేడి

తెలంగాణలో రాజకీయ ఎన్నికల వేడి

హైదరాబాద్, ఏప్రిల్ 9,
2020, 2021లో జరిగిన రెండు ఉపఎన్నికల్లో కూడా అధికార పార్టీని బీజేపీ ఓడించింది. అలాగే 2020 డిసెంబర్‌లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా అద్భుత విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయాలే బీజేపీ కేంద్ర నాయకత్వానికి కూడా సంతృప్తిని ఇచ్చాయి. ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ పనితీరును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసించారుసంజయ్‌ పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, ప్రజాసమస్యలను బలంగా జనంలోకి తీసుకుపోయే ఉద్దేశంతో గత ఏడాది పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 36 రోజుల్లో 438 కిలోమీటర్లు కాలినడక రాష్ట్రంలో పర్యటించారు. ఇప్పుడు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ఆయన తన రెండో దశ పాదయాత్ర ప్రారంభించనున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న మొదలుకానున్న ఈ యాత్ర 300 కిలోమీటర్లు సాగనుంది. యాత్ర ప్రారంభానికి అమిత్ షా హాజరయ్యే అవకాశం ఉంది.ఇది ఇలావుంటే, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తోంది. గత నెలలో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆప్ ఇప్పుడు జాతీయ స్థాయిలో విస్తరించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఢిల్లీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టనున్నారు. ఆప్‌ కూడా ఆయన యాత్రకు ఏప్రిల్ 14నే ఎంచుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఈ పాదయాత్రను ప్రారంభించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్న ప్రజలకు చేరువయ్యేందుకు తెలంగాణలోని ప్రతి మూలకు పార్టీని తీసుకువెళ్లటమే తమ లక్ష్యం అంటున్నారు భారతి. తాము ప్రకటించిన తర్వాతే బీజేపీ పాదయాత్రను ప్రకటించిందని, రాష్ట్రంలో తమ రాజకీయ స్థానాన్ని ఆప్‌ ఆక్రమించవచ్చని వారు భయపడుతున్నారని ఆయన అంటున్నారు.మరోవైపు, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర “మన ఊరు, మన పోరు” కార్యక్రమం ఈ నెలలో కూడా కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన వివిధ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ అమలు చేయని ఎన్నికల హామీలను హైలైట్ చేయడానికి ఆయన ఈ ఫిబ్రవరిలో దీనిని ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని రేవంత్‌ హామీ ఇస్తున్నారు.వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల పార్టీ బలోపేతానికి నెలన్నర రోజులుగా తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు. రాష్ట్రంలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చనే ఊహాగానాల మధ్య విపక్షాల సన్నద్ధత పెరిగింది. షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. కానీ సీఎం కేసీఆర్‌ ముందస్తుకు వెళతారని విపక్షాలు బలంగా నమ్ముతున్నాయి. అయితే సీఎం కేసీఆర్‌ ముందస్తు అవకాశాలను కొట్టిపారేయడమే కాకుండా ప్రతిపక్షాల పాదయాత్రలను పాత ఎత్తుగడగా అభివర్ణిస్తున్నారు.తెలుగు రాష్ట్రాలకు పాదయాత్రలు కొత్త కాదు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై. ఎస్. రాజశేఖర రెడ్డి 2003లో నాటి ఉమ్మడి ఏపీలో పాదయాత్ర చేశారు. నాడు ఆయన 60 రోజుల్లో దాదాపు 1500 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం నాయుడును గద్దె దింపడంలో ఈ పాదయాత్ర ప్రధాన పాత్ర పోషించింది. ఈ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. కరవు కాటకాలతో నష్టపోయిన రైతులు, వివిధ వర్గాల ప్రజల ఇబ్బందులను రాజశేఖరరెడ్డి ఈ యాత్రలో స్వయంగా తెలుసుకున్నారు. ఈ అవగాహనతోనే ఆయన 2004 అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికను రూపొందించారు.నాటి నుంచి నేటి వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో చాలా మంది నాయకులు వైఎస్ఆర్ బాటన నడుస్తున్నారు. ఈ యాత్రల ద్వారా ప్రజలకు దగ్గరై రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తున్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు 2013లో రాష్ట్రవ్యాప్తంగా 2,800 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఆయన ఏపీ సీఎం అయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి 341 రోజుల్లో 3,648 కి.మీ పాదయాత్ర చేశారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. వైఎస్ఆర్ కుమార్తె వై.ఎస్. షర్మిలకు కూడా పాదయాత్రలు కొత్తేమీ కాదు. 2019లో తన అన్న కోసం ప్రచారం చేస్తూ కొన్ని పాదయాత్రల్లో పాల్గొన్న అనుభవం ఉంది. షర్మిల గతేడాది వైఎస్ఆర్టీపీని ప్రారంభించి ప్రస్తుతం తెలంగాణలో ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. తెలంగాణలో “రాజన్న రాజ్యం” తేవాలన్నదే ఆమె లక్ష్యం. షర్మిల ఇప్పటికే 40 రోజులకు పైగా పాదయాత్ర నిర్వహించారు. ఏప్రిల్‌లో కూడా ఆమె యాత్ర కొనసాగుతుంది.మరోవైపు, పాదయాత్రలకు గతంలో ఉన్న జానాకర్షణ ఇప్పుడు లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. మండు వేసవిలో నాడు వైఎస్ఆర్ పాదయాత్ర చేయటాన్ని ప్రజలు గొప్పగా భావించారు. ఇప్పుడు నాయకులు చేస్తున్న పాదయాత్రలను ప్రజా ఎజెండాను హైలైట్ చేసే సాధనంలా కాకుండా, తమ వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవటం కోసం చేస్తున్న కార్యక్రమంగా ప్రజలు చూస్తున్నారు.మండు వేసవిలో పాదయాత్రలకు దిగటంలో తాము ‘ప్రజా ప్రయోజనం’ కోసం ఎంత కష్టపడుతున్నామో చూపించే వ్యూహం దాగుంది.విపక్షాల పాదయాత్రలు పాత కథ అంటూ సీఎం కేసీఆర్‌ కొట్టిపారేశారు. ఆయన ఇలాంటి యాత్రలు చేయరని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్షాలు ఇలా పాదయాత్రల ప్లానింగ్‌లో ఉండగా అధికార టీఆర్‌ఎస్‌ మాత్రం కేంద్రంతో వరి పోరాటంలో నిమగ్నమైంది. మోడీ సర్కార్‌పై వత్తిడి తెచ్చేందుకు ఐదు అంచెల నిరసన కార్యక్రమం చేపట్టింది. మండల స్థాయిలో ప్రారంభమైన నిరసన కార్యక్రమం పార్లమెంట్‌కు వరకు వెళ్లింది. ఈ నెల 6న ముంబై, నాగ్‌పూర్, బెంగళూరు, విజయవాడలకు వెళ్లే జాతీయ రహదారులపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. ఏప్రిల్ 7వ తేదీన హైదరాబాద్ మినహా అన్ని జిల్లా కేంద్రాల్లో లక్షలాది మంది రైతులు నిరసనలు తెలిపారు. ఏప్రిల్ 8న రాష్ట్రంలోని 12,769 పంచాయతీల్లో రైతులు నల్లజెండాలు ఎగురవేసి ర్యాలీలు నిర్వహించారు. ఏదేమైనా, ఇప్పటి వరకు పాదయాత్రలు చేసిన ఏ నాయకునికి నిరాశ ఎదురుకాలేదు. వాటి ద్వారా ప్రధాన ప్రతిపక్ష నేతలు సత్ఫలితాలు పొందారు. వైఎస్‌ఆర్‌, చంద్రబాబు, జగన్‌ అందుకు ఉదాహరణలు. ఇప్పుడు తెలంగాణలో జరిగే పాదయాత్రలు వారికి ఏమాత్రం కలిసొస్తాయో చూడాలి!!

Related Posts