హైదరాబాద్, ఏప్రిల్ 9,
గులాబీ దళం ఆగమాగం అవుతోంది. రైతు ధర్నాల పేరుతో ఆగమాగం చేస్తోంది. వరి కొంటారా? కొనరా? అంటూ కేంద్రాన్ని బద్నాం చేస్తోంది. ఐదెంచల పోరాటంలో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. రాస్తారోకోలతో జనానికి నరకం చూపించారు. నల్ల జెండాల పేరుతో గులాబీ జెండాల ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడిక చివరి అంకంకు సమయం ఆసన్నమైంది. ఈ నెల 11న ఢిల్లీలో రైతు నిరసన దీక్ష చేయాల్సి ఉంది. ఆ ఢిల్లీ ధర్నా ఎంత సక్సెస్ అయితే.. టీఆర్ఎస్‌కు, కేసీఆర్‌కు అంత మైలేజ్ వస్తుందనేది వారి లెక్క. ఇప్పటికే కొన్నిరోజులుగా సీఎం కేసీఆర్ హస్తినలోనే మకాం వేసి ఉన్నారు. మోదీ, అమిత్‌షాలను కలిసేందుకు తెగ ప్రయత్నించి విఫలమవుతూ వస్తున్నారు. కేసీఆర్‌ను ఆఫీసు గడప కూడా తొక్కనీయడం లేదు వారిద్దరు. అదే సమయంలో ఏపీ సీఎం జగన్‌కు, తెలంగాణ గవర్నర్ తమిళిసైలకు సమయం ఇచ్చి.. కేసీఆర్‌ను పూర్తిగా పక్కనపెట్టేశారు కేంద్ర పెద్దలు. తీవ్ర అవమాన భారం మినహా గులాబీ బాస్ చేసింది, చేయగలిగింది ఏమీ లేదంటున్నారు. ఇంతకీ ఢిల్లీలో సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నట్టు? ఎవరినీ కలవడం లేదు. ఎలాంటి సమావేశాలు జరిపినట్టు లేదు. మరి, ఇంకా హస్తినలోనే ఎందుకు ఉంటున్నట్టు? అంత గప్‌చుప్‌గా ఏం చేస్తున్నట్టు? అనే సందేహమైతే ఉంది. మరి, ఈ నెల 11న జరపబోయే ధర్నా వరకూ కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటారా? ఆ రైతు నిరసన దీక్షకు కేసీఆర్ అటెండ్ అవుతారా? డుమ్మా కొడతారా? ఆ లోపే రాష్ట్రానికి తిరిగి వచ్చేస్తారా? అనే అనుమానమూ లేకపోలేదు. ఢిల్లీలో ధూంధాంగా కాకుండా.. చాలా సింపుల్‌గా మాత్రమే రైతు ధర్నా చేయనున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎంచుకున్న వేదికే ఆ అనుమానానికి కారణం. హస్తినలో హల్‌చల్ చేయాలంటే.. జంతర్ మంతర్‌లో ధర్నా చేస్తేనే ఆ పోరాటానికి తగినంత ప్రాధాన్యం, ప్రచారం లభిస్తుంది. సాధారణంగా ఎవరైనా ఢిల్లీలో ధర్నా చేయాలంటే.. జంతర్ మంతర్‌నే వేదికగా సెలక్ట్ చేసుకుంటారు. కానీ, టీఆర్ఎస్ మాత్రం కేంద్రంపై ధర్నాకు తెలంగాణ భవన్‌ను ఎంపిక చేసుకున్నారు. తెలంగాణ భవన్ వేదికగా మాత్రమే ఈ నెల 11న ధర్నాకు దిగనున్నారు. ఆ మేరకు అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో.. గతంలో చెప్పినంత వాడి-వేడిగా కాకుండా.. సింపుల్‌గా, చేశామా అంటే చేశామని అనిపించేలా.. రైతుల పేరుతో గులాబీ శ్రేణులు ధర్నా చేయనున్నారని అంటున్నారు. ఇక, సీఎం కేసీఆర్ ఆ ధర్నాలో పాల్గొనక పోవచ్చని కూడా చెబుతున్నారు. ఈ లోపే ఆయన హైదరాబాద్‌కు తిరిగొస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, కేరళ సీఎం పినరయి విజయన్‌ను కలిసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఆ మీటింగ్స్ ఫిక్స్ అయితే.. కేసీఆర్ ఢిల్లీ నుంచి నేరుగా యూపీ వెల్లడమే, కేరళ ఫ్లైట్ ఎక్కడమో జరగుతుంది. అలా, తాను బాగా బిజీ అని అనిపించేలా షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నారని తెలుస్తోంది. ఏదో ఒక కారణంతో.. ఢిల్లీ ధర్నాకు కేసీఆర్ మాగ్జిమమ్ దూరంగా ఉంటారని అంటున్నారు. తాజా పరిణామాలు చూస్తుంటే.. హస్తినలో ఏదో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నట్టే భావించాల్సి ఉంటుంది. కేసీఆర్‌కు మోదీ, అమిత్‌షాలు అపాయింట్‌మెంట్స్ ఇవ్వకపోవడం, గవర్నర్ తమిళిసైని ఢిల్లీ పిలిపించి, నివేదిక తెప్పించుకోవడం.. తమిళిసై ఢిల్లీలో మీడియా ముందు కేసీఆర్‌ను, తెలంగాణ సర్కారును ఏకిపారేయడం.. రోజుల తరబడి కేసీఆర్ సైలెంట్‌గా ఉండటం.. జంతర్ మంతర్‌లో కాకుండా తెలంగాణ భవన్‌లో రైతు ధర్నాకు ప్లేస్ ఫిక్స్ చేయడం.. ఆ ధర్నాకు డుమ్మా కొట్టేందుకు కేసీఆర్ ట్రై చేస్తుండటం.. అంతా చూస్తుంటే.. ఏదో పెద్ద రాజకీయమే జరుగుతున్నట్టే అనిపిస్తోంది.