న్యూఢిల్లీ, ఏప్రిల్ 9,
కొన్నిరోజులుగా సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు. ఉన్నా లేనట్టే ఉంటున్నారు. రాజకీయంగా ఎలాంటి చడీచప్పుడు లేదు. మోదీతో మీటింగ్ లేదు. అమిత్‌షాతో భేటీ లేదు. వేరే ఎవరినీ కలిసినట్టు కూడా సమాచారం లేదు. మరి, ఇన్నిరోజులుగా కేసీఆర్ హస్తినలో ఏం చేస్తున్నట్టు? అంటే సమాధానం లేదు. వరిపై పోరు గట్రా ఏమీ లేకున్నా.. ఎలాంటి చర్చలు, సమావేశాలు జరపకున్నా.. తన కోసం ఢిల్లీలో కొత్తగా ఓ సీనియర్ జర్నలిస్ట్‌ను పీఆర్వోగా మాత్రం నియమించుకున్నారు సీఎం కేసీఆర్. ఆయన అందుకోసమే అంటూ ప్రచారం జరుగుతోంది. జాతీయ స్థాయిలో తనను ప్రమోట్ చేసేందుకే ఆయన్ను నియమించుకున్నారని తెలుస్తోంది. ఇటీవల జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్ ఉత్తరాదిలో తనకు క్రేజ్ వచ్చేలా ప్రచారం జరగాలని బలంగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో తన పీఆర్వోగా సంజయ్ కుమార్ ఝాను నియమించుకున్నారు. సీనియర్ జర్నలిస్టు అయిన సంజయ్ కుమార్.. గతంలో పలు హిందీ పత్రికల్లో పనిచేశారు. నెలకు 2 లక్షల జీతంతో పాటు.. అదనపు సదుపాయాలు కల్పిస్తూ.. సంజయ్‌ను పీఆర్వోగా అపాయింట్ చేసుకున్నారు. కో టెర్మినస్ విధానంలో.. కేసీఆర్ సీఎంగా అధికారంలో ఉన్నంత కాలం ఆయన ఢిల్లీలో పీఆర్వోగా ఉండనున్నారు. ఢిల్లీ, ఉత్తరాధి, జాతీయ రాజకీయాలపై మంచి అవగాహన ఉన్న సంజయ్ కుమార్ ఝా ను పూర్తిగా ఉపయోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆయనకు పలు జాతీయ పార్టీల నేతలతో దగ్గరి సంబంధాలు ఉన్నాయి. నేషనల్ మీడియాలోనూ మంచి పరపతి ఉంది. తరుచూ కేసీఆర్ నిర్వహించే పసందైన ప్రెస్‌మీట్లు.. గులీబా బాస్ చేసే హాట్ హాట్ కామెంట్లు.. మోదీ-బీజేపీలపై చేసే విమర్శలు.. తరుచూ జాతీయ మీడియాలో వచ్చేలా చూసే బాధ్యతను సంజయ్ ఝాకు అప్పగించారని తెలుస్తోంది. అంటే, కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్‌పై సీరియస్‌గానే ఫోకస్ పెట్టారని అంటున్నారు.